నవతెలంగాణ-హైదరాబాద్ : శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతను బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా అవమానించారంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన స్థానానికి కనీస గౌరవం ఇవ్వకుండా ‘ఎవడ్రా’, ‘స్పీకర్ గాడు’ అంటూ ఏకవచనంతో సంబోధించడమే కాకుండా, ‘అధికారం ఇచ్చిన వాడు ఎవడ్రా’ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో బూతులు తిట్టడం బీఆర్‌ఎస్ నేతల అహంకారానికి, దళిత వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు అత్యంత తీవ్రంగా పరిగణించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అసభ్యకర పదజాలంతో దూషించిన తాతా మధును తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీఎంను కోరారు. మరోవైపు ఈ ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ను అవమానించిన సదరు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.



