Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇదేనా భద్రత?

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇదేనా భద్రత?

- Advertisement -

– అసెంబ్లీ సాక్షిగా మహిళలకు అవమానం.. మక్తల్‌లో ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
– భారీ ఉద్రిక్తత మధ్య చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లా కేంద్రానికి తరలింపు
– దారిపొడవునా నిలిచిన వాహనాలు.. ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణుల ఆగ్రహం
నవతెలంగాణ-మక్తల్:
అసెంబ్లీ సాక్షిగా మహిళలను అవమానించేలా వ్యవహరించడాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మక్తల్ పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం “ఇందిరమ్మ రాజ్యం” అని చెప్పుకుంటూనే మహిళలకు కనీస రక్షణ, గౌరవం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో సాధారణ మహిళలకు రక్షణ లేకపోవడమే కాకుండా మాజీ మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులకు సైతం కనీస మర్యాద ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.మక్తల్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటనలో ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసి, మరో ముగ్గురిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మిగిలిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ఇప్పటివరకు పోలీసులు, ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వెయ్యి రోజుల పాలన విఫలం

రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. మహిళల భద్రత, శాంతిభద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అరెస్టులతో అణచివేయాలని చూస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఆందోళన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రానికి తరలించారు. ఆయనను తరలిస్తున్న సమయంలో పోలీసు వాహనం వెంట బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంతో దారిపొడవునా వాహనాలు నిలిచిపోయాయి. కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, శ్రీనివాస్ గుప్తా మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ జుబేర్ పాషా టౌన్ ప్రెసిడెంట్ చిన్న హను మంతు, సర్పంచ్లు గాల్ రెడ్డి, రవితేజ, శ్రావణ్,అన్వర్, హుస్సేన్, పారేవుల అసిరెడ్డి, వెంకటేష్, రుద్ర సముద్రం రామలింగం, శివారెడ్డి,ఈశ్వర్ యాదవ్, జుట్ల సాగర్, నరసింహా రెడ్డి, బండారి ఆనంద్, శివారెడ్డి  పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -