Tuesday, September 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అధికార కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడ్డాయి 

అధికార కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడ్డాయి 

- Advertisement -

చివరి రోజు నిరసనలో బీఆర్ఎస్ నేతలు 
నవతెలంగాణ-ఆసిఫాబాద్ 

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయని బిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలన పై ఈనెల రెండున ప్రారంభించిన నిరసన కార్యక్రమాల ముగింపు సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, జిల్లా నాయకురాలు సరస్వతి, సింగల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, కెరమెరి మండల నాయకుడు అబ్దుల్ కలాంల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ హామీల పత్రాన్ని వినతిగా అందజేశారు. అంతకుముందు ఏర్పాటు చసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలు ప్రకటించినదన్నారు. అబద్ధల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చే వరకు పోరాడుతామన్నారు.

అధికారం ఉందని అసెంబ్లీ వద్ద మహిళ ఎమ్మెల్యేలను కూడా చూడకుండా పోలీసులతో దాడి చేయించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఇప్పటికే రైతులకు రైతు బీమా, రైతు బంధు కు ఎగనామం పెట్టగా, 22 ఏ పేరుతో మరో గుదిబండను రైతుల నెత్తిన వేశారని ఆరోపించారు. ఆగస్టు 15న ఎల్ఐసికి చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించలేదని దీంతో అప్పటినుండి చెల్లించాల్సిన రైతు బీమా కూడా ఆగిపోయిందని అన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెబుతున్న ప్రభుత్వం మగవారిపై అదనపు భారం వేసిందన్నారు. జిల్లా నాయకులు పల్లెల్లో తిరగడం లేదని తిరిగితే కాంగ్రెస్ పరిస్థితి తెలుస్తుందని తెలిపారు. అసెంబ్లీలోకి వెళ్లడానికి నల్ల టీ షర్ట్ లపై అభ్యంతరాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పండగలు చేయడం సిగ్గులేని తనానికి నిదర్శనం అని తెలిపారు. తెలంగాణ సమాజం మళ్లీ తమ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లూ వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ ఆ రాజ్యంలో మహిళలకు గౌరవం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉంటామని కలలు కంటున్నాడని మరోసారి రేవంత్ కు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరసన మరింత పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, నాయకులు అహ్మద్, దూడల అశోక్, లాల, అంబాజీ, రవీందర్ హనుమంతరావు, నిసార్, జీవన్ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -