జిల్లా వ్యవసాయాధికారి బాపురావు..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల రైతువేదికలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న వ్యవసాయ విస్తరణ సబ్-మిషన్ కింద రాష్ట్ర విస్తరణ కార్యక్రమాలకు మద్దతు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పథకంలో భాగంగా పూర్వ జ్ఞాన గుర్తింపు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమము నిర్వహించినట్లుగా జిల్లా వ్యవసాయాధికారి బాపు రావు,మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పూర్వ జ్ఞాన గుర్తింపు అనేది రైతులు తమ అనుభవం ద్వారా సంపాదించిన సంప్రదాయ ఆచరణాత్మక నైపుణ్యాలను అధికారికంగా గుర్తించి వాటిని మరింత మెరుగుపరిచే ఒక ప్రత్యేక శిక్షణా విధానమన్నారు. ఇందులో నేల తయారీ, విత్తన శుద్ధి, విత్తడం, ఎరువుల యాజమాన్యం, పురుగుల నివారణ, యంత్రాల వినియోగం, నీటిపారుదల, కోతలు, మార్కెటింగ్ వంటి ప్రతి వ్యవసాయ పనికి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమన్నారు.
రైతులు తమ సాంప్రదాయ పరిజ్ఞానంతో వీటిని నిర్వహిస్తున్నప్పటికీ, ఆధునిక సాంకేతికతలతో వారి నైపుణ్యాలను మెరుగుపరచడానిని పూర్వ జ్ఞాన గుర్తింపు తోడ్పడుతుందన్నారు. అలాగే ఇట్టి శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతులకు, గ్రామీణ యువతకు సామర్థ్య పెంపు నైపుణ్యాభివృద్ధి మద్దతు సేవల గూర్చి సమగ్రంగా వివరించడం జరిగిందన్నారు. అలాగే రైతులకు అవసరమైన జ్ఞానాన్ని, సాంకేతికతను నైపుణ్యాలను మార్కెట్ సమాచారాన్ని అందించి సాగు ద్వారా పొందే నికర ఆదాయాన్ని సుస్థిరంగా పెంచడం పై అవగాహన కల్పిస్తూ రసాయనాలు లేని (ప్రకృతి సేద్యం) సహజసిద్ధమైన సాగు పద్ధతులను ప్రోత్సహించడం వాతావరణ మార్పులను తట్టుకునే పంటలు మరియు సాంకేతికతలను పాటించడం సాంప్రదాయ పంటల స్థానంలో లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను వేయడం, సకాలంలో చీడపీడల వ్యాప్తిని పసిగట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టడం నేల స్వభావం ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగాన్ని పెంపొందించడం, సాగులో డిజిటల్ సాంకేతికతలు యాప్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, సరికొత్త సాగు పద్ధతులు మరియు మార్కెట్ ఆధారిత అంశాలపై రైతులకు స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను ఆధునీకరించడం జరిగిందని తెలిపారు.
అలాగే మండల కేంద్రంలో క్షేత్ర సందర్శన నిర్వహించి కూరగాయ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కంటె శ్రీపాల్, వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారులు అనూష, సంధ్య, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.



