– మహిళా ఎమ్మెల్యేలపై దాడులు దుర్మార్గం
– రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం
– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతులు, కౌలు రైతులు, మహిళలు, యువత, వృద్ధులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. రాజ్యాంగ హక్కులు, సంక్షేమాన్ని కాపాడాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశామని తెలిపారు.
ప్రశ్నిస్తే అరెస్టులేనా?
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తోందని మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు రాజ్యాంగం కల్పించిందన్నారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయడం దుర్మార్గమని విమర్శించారు. అక్రమ కేసులు, అరెస్టులకు బీఆర్‌ఎస్ శ్రేణులు భయపడబోవని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అధికారులూ ఖబడ్దార్?
కొందరు అధికారులు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పనిచేస్తున్నారని మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. అధికారులు రాజ్యాంగం, చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
బుద్ధి తెచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం:
వారం రోజులుగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు, సదస్సులు, నిరసనలకు ప్రజల నుంచి స్పందన లభించిందని మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. ఈ నిరసనలతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, జేకేవీ రమణారావు,సంక ప్రసాద్ రావు, జల్లిపల్లి శ్రీ రామ మూర్తి, మందపాటి రాజ మోహన్ రెడ్డి,యూ.ఎస్ ప్రకాష్ రావు,మాజీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



