Tuesday, September 8, 2026
E-PAPER
Homeఖమ్మంతాతా మధు దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ యత్నం

తాతా మధు దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ యత్నం

- Advertisement -

– అశ్వారావుపేటలో కార్యకర్తల ఆందోళన.. 
– పోలీసులతో తోపులాట
నవతెలంగాణ – అశ్వారావుపేట

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం అశ్వారావుపేట పట్టణంలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పదవిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తాతా మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు, స్పీకర్ పదవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాజకీయ విమర్శలకు అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగ పదవులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

దిష్టిబొమ్మ దహనానికి యత్నం:
నిరసనలో భాగంగా కార్యకర్తలు తాతా మధు దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని స్పష్టం చేస్తూ దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి:
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాలని కోరారు. రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, తుమ్మ రాంబాబు, నండ్రు రమేష్, జూపల్లి ప్రమోద్, కౌన్సిలర్లు మిండా హరిబాబు, తిరుమలశెట్టి వెంకన్నబాబు, దండ బత్తుల ఆదిలక్ష్మి, రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -