వాణిజ్యం నుంచి ఏఐ వరకు ఫోకస్
12, 13 తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు
11 సభ్య దేశాలతో విస్తరించిన బ్రిక్స్‌కు భారత్ నాయకత్వం
ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, అభివృద్ధి ఫైనాన్స్‌పైనా చర్చలు
న్యూఢిల్లీ : వాణిజ్యం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వరకు బ్రిక్స్ వేదికగా భారత్ తన ఎజెండాను ప్రపంచం ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. బ్రిక్స్ కూటమికి 2026లో అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈనెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో 18వ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ఇంధనం, వాతావరణం, అంతర్జాతీయ పాలనలో మార్పులపై కీలక చర్చలు జరపనుంది. అదే సమయంలో బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ అనే థీమ్‌ను భారత్ ఎంచుకుంది. సంక్షోభాలను తట్టుకునే ఆర్థిక వ్యవస్థలు, కొత్త సాంకేతికత, దేశాల మధ్య సహకారం, సుస్థిర అభివృద్ధి, ఆ నాలుగు అంశాల చుట్టూ బ్రిక్స్ సదస్సును ముందుకు తీసుకెళ్లాలని భారత్ భావిస్తోంది. దీనికి హ్యూమానిటీ ఫస్ట్ అనే దృక్పథాన్ని జోడించింది.బ్రిక్స్‌లో భారత్ ప్రధానంగా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలను తగ్గించడం, అంతర్జాతీయ చెల్లింపులను సులభతరం చేయడం ఇందులో కీలకం. జాతీయ కరెన్సీల వినియోగాన్ని పెంచడం, సరిహద్దు చెల్లింపుల వ్యవస్థలను మరింత అనుసంధానం చేయడం వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న భౌగోళిక, రాజకీయ సవాళ్ల నేపథ్యంలో సరఫరా గొలుసులను మరింత పటిష్టం చేయడం భారత్ ఎజెండాలో ముఖ్యమైన అంశం. అంతేకాక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా బ్రిక్స్ సహకారం అందించాలనేది లక్ష్యం. ఇందుకోసం ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ విధానం, ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక సహకార పోర్టల్ వంటి ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది.
బ్రిక్స్‌లో ఏఐ సహకారానికి ప్రాధాన్యం
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా మార్చుతున్న అంశాల్లో ఏఐ ఒకటి. అందుకే బ్రిక్స్‌లో కూడా ఏఐ సహకారానికి భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఏఐతో పాటు ఫిన్‌టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత వ్యవస్థలపై సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంచాలని భావిస్తోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు ప్రత్యేక రిపాజిటరీ ప్రతిపాదన కూడా ఉంది. భారత్‌కు ఇప్పటికే ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థల్లో అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడం ద్వారా సాంకేతికతను కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం చేయకుండా గ్లోబల్ సౌత్‌కు అందుబాటులోకి తీసుకురావాలన్నది భారత్ ఆలోచనగా కనిపిస్తోంది.
స్టార్టప్‌లకూ ప్రాధాన్యం
కొత్త ఆవిష్కరణలకు బ్రిక్స్ దేశాల్లోని యువత, స్టార్టప్‌లను అనుసంధానం చేయడంపైనా భారత్ దృష్టి పెట్టింది. బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి ప్రతిపాదనల ద్వారా కొత్త సంస్థలకు పెట్టుబడులు, సాంకేతిక సహకారం అందించే ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయంలో కూడా డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాలనేది భారత్ లక్ష్యం. ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ వ్యవస్థల సాయంతో రైతులకు మెరుగైన సేవలు అందించే దిశగా బ్రిక్స్ సహకారాన్ని పెంచాలని భావిస్తోంది.
బ్రిక్స్ విస్తరణ తర్వాత భారత్‌లో సదస్సుకు మరింత ప్రాధాన్యం
బ్రిక్స్ విస్తరణ తర్వాత భారత్‌లో జరగనున్న సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేషియా మొత్తం 11 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారత్ అధ్యక్షత వహించడం కీలక సందర్భం. కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణం వంటి రంగాల్లో ప్రత్యక్ష ప్రయోజనాలు కల్పించే సహకారం అవసరమనే సందేశాన్ని భారత్ ఇవ్వాలని చూస్తోంది.
అంతర్జాతీయ ద్రవ్య, రాజకీయ సంస్థల్లో సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాధాన్యం, ఆర్థిక సమ్మిళితత్వం వంటి అంశాలను కూడా భారత్ బలంగా ప్రస్తావించనుంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా బ్రిక్స్‌ను మరింత బలమైన వేదికగా మార్చడమే భారత్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి బ్రిక్స్ సదస్సు కేవలం దేశాధినేతల సమావేశం మాత్రమే కాదు. ప్రపంచ వాణిజ్యం, టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌పై భారత్ తన ఆలోచనలను చెప్పే వేదికగా మారనుంది. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే ఆ సదస్సులో వెలువడే నిర్ణయాలు, బ్రిక్స్ భవిష్యత్ దిశను కూడా నిర్దేశించే అవకాశం ఉంది.



