Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాకళే ప్రత్యామ్నాయ స్వరం

ప్రజాకళే ప్రత్యామ్నాయ స్వరం

- Advertisement -

భావజాల పోరులో ప్రజానాట్యమండలి ముందుండాలి
రాజారావు స్ఫూర్తితో భావజాల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలి
యువతను సాంస్కృతిక ఉద్యమంలోకి తేవాలి : నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌. రమేష్‌
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

కళ సమాజాన్ని ప్రతిబింబించడమే కాకుండా దాని ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి కూడా అని నవతెలంగాణ సంపాదకులు, ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు రాంపల్లి రమేశ్‌ అన్నారు. ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసేందుకు నేడు వివిధ శక్తులు సాంస్కృతిక రంగాన్ని వినియోగిస్తున్నాయ‌నీ, ఈ పరిస్థితుల్లో ప్రజా కళాకారుల బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ‌ప్రజా కళలే ప్రత్యామ్నాయ స్వరమని వివరించారు. డాక్టర్‌ గరికపాటి రాజారావు వర్థంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమేశ్‌ ‌మాట్లాడుతూ కళను వినోదానికి మాత్రమే పరిమితం చేయడం దాని సామాజిక శక్తిని తగ్గించడమేనని అన్నారు. ప్రజల జీవితంతో మమేకమై, వారి కష్టాలు, ఆకాంక్షలు, సామాజిక వైరుధ్యాలను కళారూపాల్లో ప్రతిబింబించినప్పుడే కళకు ప్రజలతో సజీవ సంబంధం ఏర్పడుతుందని చెప్పారు.
గరిక పాటి రాజారావు కళను ప్రజల జీవితంతో అనుసంధానించిన తీరు నేటి కళాకారులకు స్ఫూర్తిదాయ కమన్నారు. రాజారావును స్మరించుకోవడం అంటే ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదనీ, ఆయన నమ్మిన ప్రజా సాంస్కృతిక విలువలను సమకాలీన పరిస్థితుల్లో సమాజం ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని రమేశ్‌ అన్నారు. నేడు సినిమా, టెలివిజన్‌, సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ వేదికలు ప్రజల ఆలోచనలపై అపారమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వివరించారు. మతతత్వం, కుల వివక్ష, మూఢనమ్మకాలు, అసమానతలను బలపరిచే భావజాలాలకు వ్యతిరేకంగా ప్రజా కళాకారులు తమ సృజనాత్మకతను వినియోగించాలని పిలుపునిచ్చారు. విభజించే శక్తులకు ఎదురుగా ఐక్యతను, మూఢనమ్మ కాలకు ఎదురుగా శాస్త్రీయ ఆలోచనను, నిరాశకు ఎదురుగా పోరాట స్ఫూర్తిని కళ ప్రజల్లో నింపాలని అన్నారు. ప్రజా కళ అంటే కేవలం నినాదాలు కాదనీ, ప్రజల జీవితాలను అర్థం చేసుకుని, వారి అనుభవాలను కళగా మలచడమేనని చెప్పారు. కొత్త తరాన్ని ప్రజా సాంస్కృతిక ఉద్యమంలోకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. యువ కళాకారులతో కొత్త రూపాలు, కొత్త మాధ్యమాలు, కొత్త వ్యక్తీకరణ పద్ధతులను అన్వేషించాలని కోరారు. కాలం మారుతున్న కొద్దీ కళారూపాలు మారాలి కానీ ప్రజల పట్ల కళాకారుడి నిబద్ధత మాత్రం మారకూడదన్నారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ మాట్లాడుతూ రాజారావు సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త తరానికి అందించడంతోపాటు సమకాలీన సమస్యలపై కళా కారులను చైతన్యపరిచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రజానాట్యమండలి కార్యక్రమాలను విస్తరించి యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాజారావు చిత్రపటానికి వక్తలు, కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి నాయకులు, కళాకారులు, కార్యకర్తలు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -