Sunday, April 19, 2026
E-PAPER
Homeకవితనిరంతర సాధన కవిత్వాన్ని వెలిగిస్తది

నిరంతర సాధన కవిత్వాన్ని వెలిగిస్తది

- Advertisement -

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన ‘రాచర్ల శ్రీనివాస్‌’ కు సాహిత్యంపట్ల ఆసక్తి పెంచింది తాను చదువుకున్న పాఠశాల APRS బండారుపల్లి. చిన్నప్పటి సంది అక్షరమంటే ప్రాణం. వ్యాసరచన పోటీల్లో, కవితల పోటీల్లో పాఠశాలకు ప్రాతినిధ్యం వహించేవాడు. బహుమతులు పొందడం శ్రీనివాస్‌ను సాహిత్యం పట్ల నిబద్ధత ఏర్పర్చుకోవడానికి ప్రోత్సాహాన్ని అందించింది. పలు వేదికలపై కవి సమ్మేళనంలో పాల్గొని కవితల్ని ఉద్వేగ భరితంగా చదవడంతో మరింతగా రాణించాలనే పట్టుదల పెరిగింది. నవ తెలంగాణ దినపత్రిక ‘అంకురం’ సాహిత్య పేజీ తనలోని కవిని చాలాకాలంపాటు తాజాగా వుంచగలిగింది. ప్రచార ఆర్భాటం లేని, సామాజిక మాధ్యమాల కవిత్వగాలి సోకని అచ్చమైన పల్లెటూరి కవి శ్రీనివాస్‌. చాలా మంది కవుల్లాగే తానూ ప్రాస కవిత్వం రాసిండు. సీనియర్‌ కవుల కవిత్వం చదువుకుంటూ తన కవిత్వానికి ‘మెరుగులు’ దిద్దుకునే లక్షణాన్ని సంపాదించుకున్నడు.

శ్రీనివాస్‌ కవిత్వానికి తన జీవితం, సనూజం అతి పెద్ద కవితా వస్తువు. మానవ విలువల్ని కాపాడటం తన ధ్యేయం. సంఘటనలు, సందర్భాలు తనలోని కవిని తట్టిలేపే ఉత్ప్రేరకాలు. సరళవచనం, సులభమైన శైలి తన సొంతం. గజిబిజి పదబంధాలతో, అనవసరపు ప్రతీకలతో తన కవితను నింపడు. చెప్పాలనుకున్న విషయం సూటిగా, అర్థమయ్యేటట్లు, స్పష్టంగా చెప్పే నేర్పును ఆకళింపు చేసుకున్నడు. విద్యార్థి నాయకుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా తన అనుభవం అపారమైనది. ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించి, చర్చించే సుగుణం తనలో దాగుంది. కులవివక్ష గురించి రాసినా, తెలుగుభాష గొప్పదనం గురించి కీర్తించినా, బాల్యాన్ని నెమరు వేసుకున్నా, స్నేహాన్ని తల్చుకున్నా, ఉపాధ్యాయ సమస్యల్ని ఎత్తిచూపినా, కష్టాలు, కన్నీళ్లను హత్తుకున్నా, ఉమ్మడి కుటుంబాల్లోని ప్రేమానురాగాలు, ఆపాయతల్ని గుర్తుచేసుకున్నా, రేపటి తరంపై సాంకేతికత ప్రభావాన్ని ఆగ్రహంగా వెళ్లగక్కినా తనదైన ముద్రను వేయగలిగిన సత్తా వున్న కవి రాచర్ల శ్రీనివాస్‌. నిరంతరసాధన తన కవిత్వాన్నైనా, ఎవరి కవిత్వాన్నైనా వెలగిస్తది. మామూలు వాక్యం కవితావాక్యంగా ఎలా రూపొందుతుందో పరిశీలించడం, సాధన చేయడం అత్యంత ఆవశ్యకం.

అసలైన ‘జీవనసౌందర్యం’ ఎక్కడ కనిపిస్తదో కవి చెబుతున్నడు. బాహ్య సౌందర్యంతో పాటు అంత: సౌందర్భం కూడా మిళితమై వుండాలన్నది కవి ఆశయం. కష్టాల్ని అధిగమించడం ద్వారా జీవన సౌందర్యం సాక్షాత్కరిస్తుందనే సందేశం వినిపిస్తది. మనిషికి కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ సహజం, సాధారణమే! ఎవరైతే వాటిని ప్రేమతో, నవ్వుతో స్వీకరించి, అవిరామకషితో తాను ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగిపోతారో వారినే విజయం వరిస్తది.
మనిషి తాను ఎదుర్కునే ఆటంకాలు, వైఫల్యాల వల్ల జీవితం పూర్తిగా అర్థంచేసుకునే మనస్తత్వాన్ని, గెలుపోటములు – కష్ట సుఖాలు అతి సాధారణమనే వైఖరిని పొదివి పట్టకోగలుగు తాడు. కవి చెబుతున్న నిద్రలేములు, మౌనంగా వుండటం లోలోపల మనసును రగిలిస్తూనే వుంటయి. విజయతీరం వైపు సాగే పయనంలో ప్రతికూల అనుభవాలు (అలుపెరుగని ఆలోచనలు) కష్టాలు, కన్నీళ్లు, లేమి, బాధలు, బాధ్యతలు, అసూయలు అవమానాలు, ఈర్ష్య, ద్వేషం) ‘జోక్యం చేసుకునే చరాలు’ గా చెప్పవచ్చు.

సముద్రం లాంటి జీవితంలో అలలు తీరాన్ని తాకడానికి నిరంతరం కాలంతో పోటీ పడుతూనే వుంటయి. కవి వేటిని సత్యాలుగా చెబుతున్నడో, ఏవి మనసులో రగిలే సందేహా సమాధానాలని నిర్ధారిస్తున్నడో, కాలం మిగిల్చే తీయని జ్ఞాపకాలు ఏమిటో అర్థం చేసుకోవడం ద్వారా ‘శీర్షిక’ కు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. స్వీయ మూల్యాంకనం (Self Evaluation) ద్వారా కవి తన అంతరంగపు ఆలోచనల వల్ల కలిగిన అలజడిని, అందుకు పరిష్కారాన్ని కనుగొనే దిశలో ‘కవిత్వనడక’ కొనసాగింది. అనుభవం నేర్పిన పాఠాలు దాదాపుగా అన్ని రకాల సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని ఉపదేశిస్తూనే వుంటుందనే సత్యాన్ని గ్రహించగలుగుతాం. పాఠకుల్లో ఒక పాజిటివ్‌ దక్పథాన్ని ఏర్పర్చడానికి, మోటివేషన్‌ కల్గించేలా, కదలికను ఆశించేలా ‘కవిత’ నిర్మించబడిందని చెప్పవచ్చు.
కొన్ని ‘వస్తువు’ లు కవిత్వమవుతున్నప్పుడు చెప్పే విధానం మామూలు ఉపదేశ, ఉపన్యాస ధోరణిని ఆశ్రయించినప్పటికీ, ఆయా ‘వస్తువు’ లు ఏ స్థితిని గురించి చెబుతున్నాయో ఆయా సందర్భాల్లోని మానసికతను పురిగొల్పడానికి ప్రభావవంతంగా పనికొస్తయి. మాటే మంత్రమైనట్లు, అదే కవిత్వం అవ్వగలదు. ఆశించిన ఫలితాల్ని రాబట్టగలదు. కవిగా ‘రాచర్ల శ్రీనివాస్‌’ మరింతగా కవిత్వమై విరగబూస్తాడని, అందుకు అతని జీవితానుభవాలు నిత్యం చైతన్య వంతంగా వుండేలా జాగత పరుస్తాయని ఆశిస్తూ నిరంతరం కవిత్వ సాధన చేయాలని, తనలోని పరిణత కవిని ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుకుంటూ తన కవిత్వ ప్రయాణాన్ని కొనసాగించగలడని విశ్వసిస్తూ కవికి శుభాకాంక్షలు.

జీవన సౌందర్యం
కాలంతో పోటీపడి
అలల్లా..
విజయతీరాలకై సాగే పయనంలో
అలుపెరుగని ఆలోచనల అంతరంగాలు
కష్టాలు కన్నీళ్లు కలిమిలేములు
బాధలు వేదనలు బంధాల బాధ్యతలు
అసూయలు అవమానాలు ఈర్షా ద్వేషాలు
మహోన్నత ఆశయ సాధనలో ప్రేరకాలుగా
కాలం మిగిల్చిన తీయని జ్ఞాపకాలు
నిద్రలేములను లెక్కచేయక
నిర్విరామ కృషితో
అనుకున్న లక్ష్యం కోసం ఆటంకాలను ఎదురీదే క్రమంలో
కొన్నిసార్లు మౌనం
మరికొన్నిసార్లు చిరునవ్వు
మనసులో రగిలే సందేహ సమాధానాలు
కలత ఎరుగని మోములో విరిసే నవ్వు
కల్మషం లేని మనసులో
కురిసే ప్రేమానురాగాలు
అంతిమ విజయంలో ఎదురయ్యే ఎన్నెన్నో సవాళ్లు
ఓ జీవన సౌందర్యం వెనుక విరబూసే సత్యాలు

– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -