దేశంలో 26.7 కోట్ల మంది బానిసలు
భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోన్న
పొగాకు ఉత్పత్తుల వినియోగం : డబ్య్లూహెచ్‌ఓ
న్యూఢిల్లీ :పోగాకు వాడకంతో దేశవ్యాప్తంగా ఏడాదికి 70 లక్షల మంది బలవుతున్నారు. దాదాపు 26.7 కోట్ల మంది వయోజనులు ఈ పొగాకుకు బానిసలుగా మారుతున్నారు. అంతేకాక ప్రతి ఏటా సుమారు 8,21,000 టన్నుల పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులను దేశ ప్రజలు వినియోగిస్తున్నారు. పొగాకు అధికంగా తాగే వారిలో మిజోరం టాప్‌లో ఉంది. అక్కడి పురుషులలో 73 శాతం మంది, మహిళల్లో 62శాతం మంది పొగాకుకు బానిసయ్యారు. ఈ పొగాకు వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ఎస్) చేసిన అధ్యయనంతో ఈ విషయాలు బయటపడ్డాయి. పొగాకు వాడే వారిలో సుమారు 26 శాతం మంది సిగరెట్లు, బీడీలను సేవిస్తున్నారు. 74శాతం మంది ఖైనీ, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. 2034 నాటికి భారతదేశ పొగాకు మార్కెట్ 9,88,000 టన్నులకు చేరుకోవచ్చని ఐఎంఏఆర్ సీ గ్రూప్ అంచనా వేసింది. ప్రపంచంలో చైనా తర్వాత పొగాకును అత్యధికంగా వినియోగించే, ఉత్పత్తి చేసే దేశం ఇండియానే (రెండో ప్లేస్). ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. భారత్‌లో చౌకగా, విరివిగా పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయి. దీంతో అన్ని ఆదాయ వర్గాల ప్రజలు పొగాకు వ్యసనం బారిన పడుతున్నారు.
గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (జీఏటీఎస్ ) ఇండియా 2016-17 ప్రకారం, 15 ఏండ్లకు పైబడిన సుమారు 26.7 కోట్ల మంది భారతీయులు పొగాకు వాడుతున్నారు. పురుషులు 19.8 కోట్ల మంది, మహిళలు 5.3 కోట్ల మంది పొగాకును వినియోగిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులలో పురుషులు, మహిళలు ఇద్దరూ ఎక్కువగా ఉపయోగించే వాటిలో పాన్ మసాలా ఒకటి. 14.9శాతం మంది పురుషులు, 2.2శాతం మహిళలు పొగాకు కలిపిన పాన్ మసాలాను వినియోగిస్తున్నారు. 12.4శాతం పురుషులు, 1.3శాతం మంది మహిళలు ఖైనీని ఉపయోగిస్తున్నారు. సిగరెట్‌ను 13.3శాతం, 1.4శాతం మహిళలు కాల్చుతున్నారు. ధూమపానం చేసే పురుషులలో సగటున 46శాతం మంది రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిగరెట్లు, బీడీలను తాగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ ) ప్రకారం, పొగాకు మానవ శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతుంది. అలాగే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. క్రమంలో పొగాకు తాగేవారి అకాల మరణానికి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా ప్రజలు పొగాకుకు బానిసయ్యారు. ప్రతి ఏటా పొగాకు వల్ల 70 లక్షలకు పైగా ప్రజలు మరణిస్తున్నారు. ఈ మృతుల్లో సెకండ్ హ్యాండ్ స్మోక్‌కు గురయ్యే 16 లక్షల మంది ఉన్నారు. భారత్‌లో ప్రతి ఏటా 13.5 లక్షల మరణాలు పొగాకు వాడకం కారణంగానే సంభవిస్తున్నాయి.
మిజోరం టాప్
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ఎస్) డేటా ప్రకారం, దేశంలో ఎక్కువగా పొగాకు వాడుతున్న రాష్ట్రంగా మిజోరం నిలిచింది. అక్కడ 73శాతం మంది పురుషులు, 62 శాతం మంది మహిళలు పొగాకును వినియోగిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 59శాతం మంది పురుషులు పొగాకు తాగుతున్నారు. మణిపుర్ 58శాతం మంది పొగాకును వాడుతున్నారు. సగటు పొగాకు వినియోగదారుడు పొగాకు ఉత్పత్తులపై నెలకు సుమారు రూ.350- 400 ఖర్చు చేసున్నట్టు సర్వేలో తేలింది. 2026 ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీని 28శాతం నుంచి 40శాతానికి పెంచింది. అధిక పన్నులు విధించడం వెనుక ఉన్న ఉద్దేశం పొగాకు ఉత్పత్తుల ధరలను పెంచి, వాటి వినియోగాన్ని తగ్గించడం. అయినా పొగాకుకు బానిసలైన వారు ఈ ధరలను లెక్క చేయడం లేదు.
దేశ జీడీపీపై ప్రభావం
పొగాకు సంబంధిత వ్యాధులు, అకాల మరణాల వల్ల దేశం తన స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో సుమారు 1శాతం మేర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం అంచనా వేసింది. పొగాకు ఉత్పత్తులపై వసూలయ్యే ప్రతి 100 రూపాయల ఎక్సైజ్ పన్నుకు, ఆర్థిక వ్యవస్థపై సుమారు 816 రూపాయల భారం పడుతోంది. మరోవైపు, గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘గృహ వినియోగ వ్యయ సర్వే’లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.



