వంటింటి ఖర్చులు భారం : క్రిసిల్ వెల్లడి
ముంబయి : దేశంలో వంటగది వ్యయాలు పెరిగాయని క్రిసిల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఉల్లిపాయలు, వంట నూనెలు, ఎల్‌పీజీ ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన రోటీ రైస్ రేట్ నివేదిక ప్రకారం.. ఆగస్టులో ఒక శాఖాహార థాలీ (ప్లేట్) ధర గతేడాదితో పోలిస్తే 1 శాతం పెరిగి రూ. 29.5కి చేరుకుంది. నెల ప్రాతిపదికన అదే మేర పెరుగుదల నమోదయ్యింది. మరోవైపు మాంసాహార థాలీ వ్యయం పెరిగింది. ఏడాదికేడాదితో పోల్చితే బ్రాయిలర్ కోడి మాంసం ధరలు 10 శాతం మేర ఎగబాకడంతో నాన్ వెజ్ థాలీ ధర ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ. 57.5కి చేరింది.
గత ఏడాదితో పోలిస్తే ఉల్లిపాయలు, వంట నూనెలు, బియ్యం, ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు అధికంగా ఉండటమే థాలీ వ్యయం పెరగడానికి దారితీసింది. మహారాష్ట్రలో మార్చి-ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా సరఫరా దెబ్బతిని ఆగస్టులో ఉల్లి ధరలు ఏకంగా 43 శాతం పెరిగి కిలో రూ. 40కి చేరాయి. గతేడాది ఇది రూ. 28గా ఉంది. ఇదే సమయంలో వంట నూనెలు 11 శాతం, ఎల్‌పీజీ ధరలు 10 శాతం మేర పెరిగాయి. అయితే బంగాళాదుంపల ధరలు 12 శాతం, టమాటా ధరలు 28 శాతం మేర తగ్గడం వల్ల థాలీ ధరలు మరింతగా పెరగకుండా ఉన్నాయి.
మరింత ఉల్లి ఘాటు..
రాబోయే 2 నుంచి 3 నెలల పాటు ఉల్లి సరఫరాలో ఇబ్బందులు, రబీ నిల్వలు తక్కువగా ఉండటం, ఖరీఫ్ దిగుబడులు ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల ఉల్లి ధరలు అధికంగానే ఉండే అవకాశం ఉందని క్రిసిల్ డైరెక్టర్ పుశన్ శర్మ తెలిపారు. ఆగస్టు నెలలో ఉల్లి ధరలు నెలవారీ ప్రాతిపదికన 17 శాతం పెరిగినప్పటికీ, టమాటా ధరలు 7 శాతం తగ్గడం వల్ల దాని ప్రభావం కొంతవరకు నియంత్రించబడిందన్నారు.
ఉల్లి ఘాటు.. నూనె మంట
- Advertisement -
- Advertisement -



