ఛేదనలో స్టబ్స్, రాహుల్ మెరుపుల్
సొంతగడ్డపై ఆర్సీబీకి పరాభవం
బెంగళూరు 175/8, ఢిల్లీ 179/4
నవతెలంగాణ-బెంగళూరు
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలకు బ్రేక్ పడింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో ఆరంభంలో తడబడినా.. వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు బాట పట్టింది. ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (60 నాటౌట్, 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కెఎల్ రాహుల్ (57, 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించటంతో మరో బంతి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ లాంఛనం ముగించింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ (63, 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించటంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అక్షర్ పటేల్ (2/18), కుల్‌దీప్ యాదవ్ (2/32), లుంగిని ఎంగిడి (2/39) రెండేసి వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీ బ్యాటర్లను కట్టడి చేశారు. ఛేదనలో అజేయ అర్థ సెంచరీ సాధించిన ట్రిస్టన్ స్టబ్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఇది రెండో ఓటమి కాగా.. ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది మూడో విజయం.
ఛేదనలో మెరిసిన స్టబ్స్, రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 176 పరుగులు. పిచ్ నెమ్మదిగా స్పందిస్తోంది. బౌన్స్ పెద్దగా లభించటం లేదు. పవర్‌ప్లేలో స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగాడు. క్యాపిటల్స్ ఓపెనర్ నిశాంక (1), కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2)లను అవుట్ చేసి ఆర్‌సీబీని ముందంజలో నిలిపాడు. 18/3తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే వెనుకంజ వేసింది. ఈ దశలో ఓపెనర్ కెఎల్ రాహుల్ (57)తో జతకలిసిన ట్రిస్టన్ స్టబ్స్ (60 నాటౌట్) నాల్గో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. రాహుల్ దూకుడుగా ఆడగా.. స్టబ్స్ స్ట్రయిక్‌రొటేషన్ చేశాడు. ఐదు ఫోర్లు, 2 సిక్సర్లతో 30 బంతుల్లో రాహుల్ అర్థ సెంచరీ సాధించాడు. కనాల్ పాండ్య తన ఓవర్లో రాహుల్‌ను అవుట్ చేసి ఆర్‌సీబీ శిబిరంలో మళ్లీ ఆశలు రేపాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (26 రిటైర్డ్ హర్ట్), డెవిడ్ మిల్లర్ (22 నాటౌట్, 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)లతో కలిసి స్టబ్స్ ఆఖరు వరకు క్రీజులో నిలిచాడు. కనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వరుస ఓవర్లలో పరుగుల నియంత్రణ చేయటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒత్తిడిలో పడింది. ఆఖరు ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకు 2 పరుగులే వచ్చాయి. కానీ డెవిడ్ మిల్లర్ వరుసగా 6, 6, 4తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన స్టబ్స్.. ఓ ఎండ్‌లో ఆర్‌సీబీ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. 19.5 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/26), కనాల్ పాండ్య (1/24) ఆకట్టుకున్నారు.
ఫిల్ సాల్ట్ ఒక్కడే
సొంత మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు నిరాశపరిచారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (63, 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కగా.. ఇతర బ్యాటర్లు విఫలం అయ్యారు. విరాట్ కోహ్లి (19, 13 బంతుల్లో 3 ఫోర్లు) జతగా సాల్ట్ తొలి వికెట్కు 52 పరుగులతో శుభాంభం చేశాడు. కానీ మరో ఎండ్‌లో ధాటిగా ఆడే బ్యాటర్ సహకారం సాల్ట్‌కు కరువైంది. దేవదత్ పడిక్కల్ (18), రజత్ పాటిదార్ (8), జితేశ్ శర్మ (14) అంచనాలను అందుకోలేదు. టిమ్ డెవిడ్ (26) మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసినా వికెట్ నిలుపుకోలేదు. షెఫర్డ్ (1), కనాల్ పాండ్య (12) ఆఖర్లో దూకుడుగా ఆడలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు ఆర్‌సీబీ 175 పరుగులే చేసింది. చిన్నస్వామి స్లో వికెట్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్‌లు ఏడు ఓవర్లలో 50 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీని కట్టడి చేశారు. పేసర్ లుంగిసాని ఎంగిడి (2/39), ముకేశ్ కుమార్ (1/32) రాణించారు.
థ్రిల్లర్‌లో డీసీ విన్నర్
- Advertisement -
- Advertisement -



