– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్
– సత్తుపల్లిలో విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-సత్తుపల్లి
స్కాలర్‌షిప్స్, ఫీజు రీయంబర్స్‌మెంట్ అనేది విద్యార్థులకు ప్రభుత్వం వేసే భిక్ష కాదని, అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్ స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఈ ప్రదర్శన సాగింది. అనంతరం విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్ మాట్లాడారు.
గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ప్రవీణ్ మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 11వేల కోట్లు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తామని గొప్పలు చెప్పారే తప్ప, ఆచరణలో ఏమాత్రం అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం కమిషన్లు వచ్చే పథకాలపై చూపే శ్రద్ధ, విద్యా సమస్యల పరిష్కారంపై చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కమిటీ సభ్యులు భాను శ్రీకర్ మాట్లాడుతూ డివిజన్ వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉమెన్స్ జూనియర్ కళాశాల ప్రహరీ గోడ కూలి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే జిల్లాలోని ముగ్గురు మంత్రులను వేలాది మంది విద్యార్థులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, రామ్ చరణ్, దీపు, చరణ్, పవన్, మణికంఠ, గౌతమి, త్రిపుర, శైలజ తదితరులు పాల్గొన్నారు.



