Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంఅంగన్వాడీల అక్రమ అరెస్టులు సరికాదు

అంగన్వాడీల అక్రమ అరెస్టులు సరికాదు

- Advertisement -

– సీడీపీఓ కార్యాలయం వద్ద సీఐటీయూ నిరసన
నవతెలంగాణ-సత్తుపల్లి 

బుధవారం చలో హైదరాబాద్‌ మహాధర్నాకు అనుమతినిచ్చి, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు కొలికపోగు సర్వేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా సత్తుపల్లి సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీడీపీఓ సత్యవతికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రీ-ప్రైమరీ, పీఎంశ్రీ పేరిట తెచ్చిన పాఠశాలలను రద్దు చేసి, వాటి నిర్వహణను అంగన్వాడీలకే అప్పగించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18వేలు అమలు చేయడంతో పాటు పీఎఫ్, ప్రమాద, సహజ మరణ భీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్ల ఏరియర్స్, 24 రోజుల సమ్మె కాలం వేతనాలు, ఇతర బకాయి బిల్లులను తక్షణమే విడుదల చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఐసీడీఎస్‌కు అధిక నిధులు కేటాయించి బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ షకీనా, వరకా సుశీల, ఇతర కమిటీ సభ్యులతో పాటు దాదాపు 135 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -