నవతెలంగాణ – జన్నారం
మండలంలోని కవ్వాల్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కవ్వాల్ గ్రామానికి చెందిన కండ్లే పోషన్న (51)శుక్రవారం సాయంత్రం కవ్వాల్ గ్రామంలోని పోడేటి పోశ గౌడ్ ఇంటి ముందు ఉన్న చెదబావిలో ఒక కోడిపుంజు పడింది. దానిని బయటకు తీయడానికి పోషన్న బావిలోకి దిగాడు. బావి లోపలకి దిగిన అనంతరం కోడిపుంజును తీసే క్రమంలో అకస్మాత్తుగా ఊపిరాడక ఇబ్బంది పడి అపస్మారక స్థితికి చేరాడు.
అక్కడే బావిలో చిక్కుకుపోయి మృతి చెందాడు. పోషన్న బావిలోకి దిగిన తర్వాత ఎక్కువ సేపు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పరిశీలించగా.. అతను స్పందన లేకుండా కనిపించాడు. వెంటనే గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి అతన్ని బయటకు తీశారు.అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. పోషణ భార్య శాంతవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.



