సీఎం చిత్రపటం దగ్ధం చేసేందుకు యత్నం
స్వల్ప తోపులాట ఉద్రిక్తత
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ పేరుతో మహిళ బిల్లు ప్రవేశపెట్టగా కాంగ్రెస్ తో పాటు దాని ఇండియా కూటమి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చిన మహిళలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ, చిత్రపటాలకు దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఇరువరి మధ్య కాసేపు తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మహిళ మోర్చ నాయకురాలు మాట్లాడుతూ… నారీ శక్తి రాజకీయాల్లో మరింత బలపరిచేందుకు మహిళ బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టితే కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకించడం సరికాదన్నారు. మహిళల పట్ల వారికి చిత్తశుద్ది లేదని తెలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో మహిళ శక్తి ఎంటో కాంగ్రెస్ కు చూపుతామని అన్నారు. బీజేపీ కౌన్సిలర్ ధోని జ్యోతి మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా మహిళ లోకం రిజర్వేషన్ బిల్లు కోసం ఎదురు చూస్తుంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. బిల్లు అమలు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొన్ని రోజులుగా కృషి చేయగా మహిళలను రాజకీయంగా అణగదొక్కేందుకు కాంగ్రెస్ బిల్లుకు మద్దతు తెలపకపోవడం వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి వెల్లడైందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతుండగా చరిత్రాత్మకమైన మహిళ రిజర్వేషన్ బిల్లును ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్, మహిళ మోర్చ్ నాయకురాలు జాదవ్ సుమన్, నాయకురాళ్లు గంగుబాయి, స్వప్న, రాధ, శ్రీలేఖ, నాయకులు రాకేష్, గటిక క్రాంతి కుమార్, అనూప్, మోహన్, మనోజ్పవర్ పాల్గొన్నారు.



