-పైసలతో పబ్లిక్ షో…? జగిత్యాల రాజకీయాల్లో కొత్త వివాదం
-“బస్ ఎక్కు… పైసలు పట్టు”
నవతెలంగాణ-రాయికల్
జగిత్యాలలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో జన సమీకరణ ప్రధాన అజెండాగా మారగా,అందుకోసం భారీగా నగదు పంపిణీ జరిగిందనే చర్చ జిల్లావ్యాప్తంగా జోరందుకుంది.“బస్ ఎక్కు… పైసలు పట్టు”అన్న విధంగా ప్రజలను ఆకర్షించారని స్థానికంగా ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు, నవతెలంగాణ రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో నగదు పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో వెళ్లినప్పుడు,బహిరంగ సభకు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూలు బస్సు బస్సులో విఐపి పాస్ కలిగిన ఓ వ్యక్తి ప్రజలకు డబ్బులు అందజేస్తున్న దృశ్యాలు నవతెలంగాణ కెమెరాకు చిక్కాయి.
ఈ సందర్భంగా చిత్రీకరణ జరుగుతుండగా,అక్కడ ఉన్న ఓ యువకుడు ఫోటోలు“తీస్తే తీసుకోండి…నెట్లో పెడితే పెట్టుకోండి, పేపర్లో వేస్తే వేసుకోండి…మేమే దొరికామా…! ఏమైనా చేసుకోండి” అంటూ నిర్లక్ష్యంగా స్పందించడం గమనార్హం.సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో గ్రామాలు, వార్డుల స్థాయిలో మధ్యవర్తులను వినియోగించి ప్రజలకు నగదు అందజేసినట్టు ప్రతిపక్ష వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి.బస్సులు,ఇతర వాహనాల ద్వారా పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు ముందుగానే ప్రణాళిక రచించి నగదు పంపిణీ చేసినట్లు సమాచారం.
కొంతమంది ప్రజలు పేరు వెల్లడించకుండా మాట్లాడుతూ… సభకు హాజరవ్వాలంటే డబ్బు ఇచ్చిన ఘటనలు నిజమేనని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం కేవలం రాజకీయ కార్యక్రమం కాకుండా, ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తే అంశంగా మారింది.రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇలాంటి పద్ధతులు తాత్కాలికంగా జనాన్ని సమీకరించగలిగినా,దీర్ఘకాలంలో ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడుతున్నారు.సభలో కనిపించిన జనసందోహం వెనుక నిజమైన ప్రజా మద్దతా? లేక నగదు ప్రలోభమా? అన్న చర్చ ఇప్పుడు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.



