Tuesday, April 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ అక్రమ యుద్ధం- కొన్ని ప్రశ్నలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ అక్రమ యుద్ధం- కొన్ని ప్రశ్నలు

- Advertisement -

దాదాపు నలభై రోజుల పాటు ఇరాన్‌పైన అమెరికా-ఇజ్రాయిల్‌ దేశాలు సాగించిన యుద్ధం వల్ల ప్రపంచం, సాధారణ ప్రజలు చాలా నష్టపోయారు. సంధి ప్రయత్నాలు సాగుతున్న ప్పటికీ అమెరికా అహంకారంవల్ల అవి సజావుగా ముగుస్తాయనే గ్యారంటీ ఏమీ కనపడటం లేదు. అందువల్ల యుద్ధం కొనసాగే ప్రమాదమూ ఇంకా మన వెన్నంటే ఉంది. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌తోపాటు, అన్ని సరుకుల ధరలూ భారీగా పెరగటం, ఆ దేశాలేగాక ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభాలకు గురికావటం తప్పనిసరి. అది అంతటితో ఆగదు. వివిధ దేశాలలో ఈ ఆర్ధిక సంక్షోభం సామాజిక అస్థిరతకూ, ప్రజల తిరుగుబాట్లకూ దారితీయవచ్చు. ఈ విషయంలో ఎవరికీ దాదాపు భిన్నాభిప్రాయలేమీ లేవు. అయితే ఈ యుద్ధానికి కారణాలేమిటి అనే విషయంలో మాత్రం రక, రకాల వాదనలతో ముందుకొస్తున్నారు. ‘ఏ మాటల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అంటాడు లెనిన్‌ మహాశయుడు. అందువల్ల ఈ వాదనల గుట్టు ప్రజలకు అర్ధం చేయించటం అవసరం.

ఇరాన్‌ అణు కార్యక్రమం
యురేనియం శుద్ధి చేయటం ద్వారా ఇరాన్‌ అణ్వస్త్రాల తయారికి పూనుకుంటోందని దాన్ని అడ్డుకోవటానికే ఈ యుద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నాడు. మరయితే 2015లోనే దీన్ని కట్టడి చేస్తూ ఇరాన్‌, అమెరికాలే కాకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలన్ని (చైనా, రష్యాలతో సహా) సంతకాలు చేసి, అమలు చేస్తున్న ఒప్పందాన్ని ట్రంప్‌ తాను అధికారంలోకి వచ్చిన మొదటిసారే 2018లో ఏకపక్షంగా ఎందుకు రద్దు చేశాడు? తరువాత తన హయాంలోనే ఒమన్‌ దేశం మధ్యవర్తిగా చర్చలు నడిపిన రెండుసార్లూ దాదాపు ఒప్పందానికి వచ్చిన దశలో చర్చలు సాగుతుండగానే ఇరాన్‌పై బాంబుల దాడి ఎందుకు చేసారు? ఇజ్రాయిల్‌ ఇప్పటికే అణుబాంబు తయారు చేసిందనేది అందరికీ తెలిసినా ఎవరూ ఎందుకని ప్రశ్నించటం లేదు? కాబట్టి అమెరికా దాడికి ఇరాన్‌ అణుకార్యక్రమం అసలు కారణం కాదనేది స్పష్టం.

ఇరాన్‌లో పరిపాలనను మార్చటం
ఇరాన్‌ పాలన పట్ల ప్రజల అసంతృప్తి ఉందనీ, ప్రజలను అణచివేస్తున్నారనీ ఆ పాలనను మార్చటం తమ లక్ష్యమనీ ట్రంప్‌ చెబుతున్నాడు. ఇది సరైందేనా? ఇరాన్‌యే కాదు, ఇంకా చాలా దేశాల పరిపాలనలు కూడా బాగాలేవు. అమెరికా,ఇజ్రాయిల్‌లో పరిపాల నలు బాగున్నాయా? అమెరికా మిత్రులుగా ఉన్న సౌదీ అరేబియా లాంటి దేశాలలో ప్రజాస్వామ్యమే లేదు గదా? వాటిని మార్చమని ఇతర దేశాలేవైనా వాటిపైన దాడి చేయవచ్చా? అమెరికా చెబుతున్న గొప్ప ప్రజాస్వామ్య సూత్రానికి అర్ధమేమిటి? ఏ దేశ ప్రభుత్వంలో ఎవరుండాలనేది నిర్ణయించుకో వాల్సింది ఆ దేశ ప్రజలే తప్ప వేరే దేశాల ప్రభుత్వాలు కావు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానాలు అందరూ అంగీకరించిన విలువలు అమలు చేయాలి. అలాకాకుండా బలవంతులు, బలహీనులను వేటాడటం ఆటవిక న్యాయం కాదా? అందువల్ల ట్రంప్‌ ఇరాన్‌లో పాలనను మార్చటం అనే లక్ష్యం ప్రకటించటంలోనే తప్పుంది.

సాకుల చాటున బాకులు
గతంలో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ రసాయనిక ఆయు ధాలు తయారుజేస్తున్నాడనే సాకుతో ఆ దేశంపై అమెరికా దాడి చేసి సర్వనాశనం సృష్టించారు. తీరా తేలిందేమంటే అక్కడ అలాంటి ఆయుధాలే లేవని! ఇటీవల వెనిజులా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నదనే సాకుతో ఆ దేశంపై దాడిచేయటం అధ్యక్షుడు మధురోను, ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి అమెరికాలో నిర్భందించటం మనకు తెలిసిందే.

హార్మూజ్‌ జలసంధి విషయం
ఇరాన్‌, ఒమన్‌ దేశాల మధ్య ఉన్న హార్మూజ్‌ జలసంధి ద్వారా రోజూ 150కి పైగా రవాణా నౌకలు ప్రయాణి స్తుంటాయి. ఈ మార్గం ద్వారానే ప్రపంచ దేశాల వినిమయంలో ఇరవై శాతం వరకూ ఆయిల్‌ సరఫరా అవుతుంటుంది. అమెరికా దాడికి నిరసనగా ఇరాన్‌ ఈ మార్గాన్ని మూసేసింది. దీన్ని ఇరాన్‌ తెరిస్తే తాను యుద్ధం అపేస్తానంటున్నాడు ట్రంప్‌. వాస్తవంగా ఆయన దాన్ని తిరగేసి చెబుతున్నాడు. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖొమైనీ సహా నలభై మందికి పైగా అగ్రనాయకులను అమానుషదాడితో హత్యలు చేయటం, ఇరాన్‌ మొత్తం దేశం తనకు బేషరతుగా లొంగకపోతే ఆ దేశాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా అంతం చేస్తానని హెచ్చరించటం, వైమానిక దాడుల ద్వారా పౌర సౌకర్యాలన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఇరాన్‌ ఆ జలసంధిని మూసివేయటం ద్వారా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అంటే అమెరికా అక్రమ యుద్ధం వల్ల ఇరాన్‌ జలసంధి మూసివేతను ప్రకటించింది తప్ప ఇరాన్‌ మూసివేయటం వల్ల అమెరికా యుద్ధం ప్రారంభించ లేదు.

హార్మూజ్‌ జలాల గురించి
అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందం ప్రకారం హార్మూజ్‌ జలాలగుండా ప్రయాణించటం అన్ని దేశాల హక్కనీ, దానికి ఇరాన్‌ అడ్డుతగులుతోందనీ అమెరికా ఇంకొన్ని దేశాల వాదనగా ఉంది. కానీ అదే ఒప్పందంలోనే ఉన్న మరో ముఖ్య విషయాన్ని వాళ్లు ప్రజలకు తెలియకుండా దాటవేస్తున్నారు. అదేమిటంటే ఏ తీర ప్రాంత దేశానికైనా 12 నాటికల్‌ మైళ్ల (1నాటికల్‌ మైలు = 3.5 కి.మీ) వరకూ సముద్ర జలాలలై సౌర్వభౌమాధికారం ఉంటుందని కూడా ఆ ఒప్పందంలోనే చెప్పబడింది. ఆ ప్రకారం హార్మూజ్‌ జలసంధి తీరదేశాలైన ఇరాన్‌, ఒమన్‌లకు కలిపితే ఆ మొత్తం జలసంధిపైన ఆ రెండు దేశాలకు మాత్రమే సర్వాధికారాలు ఉంటాయి. ఆ మేరకు 1974లో ఆ దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. 1979లో ఖొమేనీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం ఆగిపోయి, తిరిగి ఇటీవల ఇరాన్‌, ఒమన్‌ రెండు దేశాలూ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాయి. అందువల్ల అంతర్జాతీయ నిభందనల ప్రకారం దాన్ని మూసివేయటానికిగానీ, రవాణాకు టోల్‌ ఫీజు వసూలు చేయటానికిగానీ ఇరాన్‌, ఒమన్‌ దేశాలకు పూర్తి అధికారం ఉంటుంది. కానీ ఇపుడు ఆ జలసంధికి దూరంగా అంతర్జాతీయ జలాలలో యుద్ధనౌకలు భారీగా మొహ రించి అమెరికా తన ‘బ్లాకేడ్‌’ సృష్టించటమే అంతర్జాయంగా చట్టవిరుద్దం. ఇది ‘గురివింద సామెత’ను గుర్తు చేయటం లేదూ?

చర్చలలో అమెరికా కపటత్వం
గతంలో రెండుసార్లు చర్చలు సాగిస్తూనే తమ దేశంపై బాంబులు కురిపించిన అమెరికా దుర్మార్గం దృష్టిలో ఉంచుకుని మొదట చర్చలకు తటపటాయించినా, శాంతి సాధనకోసం ఇరాన్‌ కూడా చర్చలకు సిద్ధపడటం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించటాన్ని ప్రపంచం హర్షించింది. కానీ ఏప్రిల్‌ 11న, పాకిస్తాన్‌ మధ్యవర్తిగా ఇస్లామా బాద్‌లో చర్చలు సాగుతుండగానే అమెరికా ‘డిస్ట్రాయర్లు’ హార్మూజ్‌ జలసంధిలో ప్రవేశించటానికి ప్రయత్నించటం ఇరాన్‌ హెచ్చరికలతో వెనుదిరగటం చేసింది. చర్చలపేరుతో ఇరాన్‌ను ఏమార్చి వాళ్లు అమర్చిన ‘సముద్రమైన్ల’ను తొలగించటం కోసం అమెరికా ప్రయత్నించింది. మరోవైపు లెబనాన్‌ ఈ ఒప్పందంలో లేదని ఇజ్రాయిల్‌ లెబనాన్‌పై దాడులు సాగించటాన్ని ట్రంప్‌ సమర్దిం చాడు. అ విధంగా అమెరికా అసలు రూపం బయటపడింది. చర్చలకు ప్రాతిపదికగా ఇరాన్‌ పది డిమాండ్లను బహిరంగంగా ఆమోదించిన ట్రంప్‌ మాట మార్చి, కొత్త డిమాండ్లు చేర్చి చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. ఇది మోసం చేయటం కాదా?

రెండోసారి చర్చలు
తిరిగి మధ్యవర్తుల ప్రయత్నాలతో రెండోసారి చర్చలకు సిద్ధమై హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరవటానికి అంగీకరిం చింది. అయినా అమెరికా మాత్రం ‘ఇరాన్‌ నౌకలను బ్లాకేడ్‌’ చేసే తన చట్టవిరుద్ద చర్యను కొనసాగించటాకే నిర్ణయించుకుని ప్రకటించింది. ఇది చర్చలలో పరస్పరం గౌరవించుకున్నట్లా? లేక ఇరాన్‌ను లొంగదీసుకున్నట్లా? ‘నా నోట్లో నీ వేలు పెట్టు. నీ కంట్లో నా వేలు పెడతా’ , రెండూ సమానమే గదా అన్నట్లుంది.

సార్వభౌమాధికారం
అమెరికా ఈ చర్యలన్నీ కూడా అన్ని దేశాలకు సార్వభౌమా ధికారం ఉంటుందనే మౌలిక అంర్జాతీయ సూత్రాన్ని ఉల్లంఘించటం తప్ప వేరుగాదు. సార్వభౌమా ధికారం అంటే ఏదేశమైనా తన అంతర్గత విషయాలుగానీ, విదేశాంగ విధానాలుగానీ నిర్ణయించు కోవడానికి సర్వస్వ తంత్రను కలిగి ఉండటం. ఆ విషయాల్లో ఇతర దేశాలేవీ జోక్యం చేసుకోకుండా ఉండటం. అంటే ఆయా దేశాలు తమ ప్రజలను పాలించుకునే పద్ధతులుగానీ, అభివృద్ధి చేసుకునే సిద్ధాంత, విధానాలుగానీ ( పెట్టుబడిదారీ విధానం, సోషలిజం వగైరా) ఆ ప్రజల చేతుల్లోనే ఉండాలి తప్ప వేరే ఏ దేశమూ శాసించ కూడదు. అణ్వాయుధం తయారు చేయటంగానీ, తమ భూ భాగంలోకి (జలాలతో) ఇతరుల ప్రవేశంగానీ, ఇతర దేశాలపై తాను విధించే సుంకాలుగానీ, చేసుకునే ఒప్పందాలు గానీ, ఆయిల్‌తో సహా ఏ సరు కులనైనా ఇతరుల నుండి కొనటం గానీ, తాను అమ్మటంగానీ ఇలాంటి విషయాన్నింటిని నిర్ణయించుకునే అధికారం ఆ దేశానిదే తప్ప ఎవరి పెత్తనమూ ఉండకూడదు.
అయినా అమెరికా ఎందుకిలా వ్యవహరిస్తోంది? పైకి చెప్పే ఈ కారణాలు ఏవీ అసలు కారణాలు కాదు. అసలు కారణం దాని రహస్య ఎజెండా మరొకటి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గత ఎనభై సంవత్సరాలుగా అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యంగా చలామణీ అవుతోంది. ఇందుకు దానికున్న ఆర్ధిక శక్తి, అపారమైన ఆయుధ శక్తి (ప్రపంచవ్యాప్తంగా దాదాపు 750 మిలటరీ స్థావరాలతో), ద్రవ్య మార్కెట్‌లో అంతర్జాతీయ కరెన్సీగా ‘డాలర్‌ ఆధిపత్యం’ తోడ్పడుతున్నాయి. కానీ ప్రస్తుత ప్రపంచంలో అమెరికాకున్న ఈ మూడు శక్తులూ వేగంగా బలహీనపడుతున్నాయి. ఆర్ధికంగా ఇప్పటికే (పర్చేసింగ్‌ పవర్‌ పారిటీ) చైనా అమెరికాను దాటిపోతున్నది. అమెరికా ఎంత బలమైన మిలటరీని (ప్రంచంచంలోనే నెం1 నేవీ, వైమానిక దళాలు) కలిగిఉన్నా, ఆధునిక యుద్ధ్దరీతుల్లో (సైబర్‌, ఎలక్ట్రానిక్‌, మాగటిక్‌ వార్‌ఫేర్‌) చైనా, రష్యాలు అగ్రభాగాన ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే అతి చిన్న శక్తిగా ఉన్న ఇరాన్‌ వాటి సహాయంతో అమెరికాను వణికిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. అలాగే డాలర్‌ తన చేతిలో ఉందిగాబట్టి అమెరికా విధిస్తున్న ఆంక్షలను విధిలేక ఇప్పటి వరకూ భరిస్తూ వస్తున్న అనేక దేశాలు చైనా, రష్యా ఆధ్వర్యంలో బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థల ఆధ్వర్యంలో డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీలతో వ్యాపారం చేయటం ప్రారంభించాయి. ఈ క్రమం రోజురోజుకూ బలపడుతోంది. ఇదిలాగే కొనసాగితే త్వరలోనే అమెరికా ప్రపంచాధిపత్యం అంతమవటం ఖాయం. ఈ పరిణామాన్ని నిలవరించటం అమెరికా లక్ష్యం.
అలాగే ట్రంప్‌ వ్యక్తిత్వంలో కొన్ని అపసవ్య ధోరణులూ, విచిత్ర ప్రవర్తనలూ కొంత కారణమైనా సామ్రాజ్యవాద సహజ లక్షణం విస్తరణ కాంక్ష. ఎందుకంటే పెట్టుబడిదారీ విధాన అత్యున్నతమైన సామ్రాజ్యవాదం ఉన్నతవరకూ దాని విస్తరణ స్వభావం ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర పోగుబడే సంపదల సర్క్యులేషన్‌కు మరిన్ని మార్కెట్లు దానికి అవసరం. ఆయిల్‌, ఖనిజాలు వగైరా లాంటి ముడి పదార్థాలపై గుత్తాధిపత్యం మరింత అవసరం. ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను ఆక్రమిస్తాననీ, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తా నని చెప్పటంగానీ, ఇజ్రాయిల్‌ను అఖండ ఇజ్రాయిల్‌గా విస్తరిస్తానని నెతన్యాహు చెప్పటంగానీ ఈ విస్తరణ కాంక్షలో భాగమే. విస్తరణవాదం ఉన్నంత వరకూ యుద్ధాలు అనివార్యంగా సాగుతాయి.ఈ యుద్ధాలు పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాద దేశాలకు మరిన్ని సంపదలు కూడబెడతాయి. సామాన్య ప్రజల బతుకులను బజారుకీడుస్తాయి. అందువల్ల ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ యుద్ధాన్ని వ్యతిరేకించటం శాంతికాముకులందరి కర్తవ్యం కావాలి. ప్రజల మేలు కోరే ఏ దేశ ప్రభుత్వమైనా అలాంటి వైఖరి తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అమెరికా, ఇజ్రాయిల్‌ పక్షం వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా దుశ్చర్యల పట్ల నిరసనలు వెల్లువెత్తడం చూసి కొంత తగ్గినట్లుగా, తటస్తవిధానం అవలంబిస్తున్నట్లుగా నటిస్తోంది. మన మీడియాలోని కొందరు కూడా ఇదే గొప్ప వైఖరి అనీ, మోడీగారి తెలివైన ఎత్తుగడ అనీ ప్రజల్ని నమ్మించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై సాగిస్తున్న ఈ యుద్ధం ఆ దేశాలకే పరిమితం కాదు. యుద్ధం, యుద్ధానికి వ్యతిరేక పరిణామాలు, ప్రభావాలు మొత్తం ప్రపంచంపై ఉంటాయనేది తిరుగులేని సత్యం. ఇది సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటన. వనరుల దోపిడీకి, బలహీన దేశాలపై ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రతిఘటన. ఈ ప్రతిఘటన పర్యవసానాలు మరో ప్రపంచపు ఆవిర్భావానికి దారితీయాలని ఆకాంక్షిద్దాం. మనమూ ఆ కృషిలో పాలుపంచుకుందాం.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -