Friday, September 11, 2026
E-PAPER
Homeఖమ్మంగ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

- Advertisement -

– వ్యకాస సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ 
– ఎంపీడీవో కార్యాలయం వద్ద వ్యకాస ధర్నా 
నవతెలంగాణ-సత్తుపల్లి 

గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు కల్పించి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు వ్యవసాయ కూలీలతో కలిసి శ్రీనివాస్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… ​గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక, ఇతర కూలి పనులు దొరక్క పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం ద్వారా తక్షణమే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ​ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 150 రోజుల పని కల్పించాల్సి ఉన్నా, అనేక గ్రామాల్లో ఉపాధి పనులు చూపించడం లేదని మండిపడ్డారు.

దీనివల్ల గ్రామీణ పేదలు కుటుంబ పోషణ కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. గ్రామాల్లోని చెరువులు, కాలువల పూడికతీత, అభివృద్ధి, మొక్కల పెంపకం, మౌలిక వసతుల కల్పన వంటి పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రావెళ్ల చిన్న నాగేశ్వరరావుకు  వినతిపత్రం అందించారు. ఇందుకు స్పందించిన  ఎంపీడీవో ఆర్సీహెచ్ నాగేశ్వరరావు  మాట్లాడుతూ…. ప్రతి గ్రామంలోనూ 60 మందికి ఉపాధి పనులు కల్పించే వెసులుబాటు ఉందని తెలిపారు. పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

​కొత్తగా జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, సాదు పున్నమయ్య, అయినంపూడి లక్ష్మి, కొలికపోగు జగపతిరావు, కన్నయ్య, నాగళ్ల పద్మ, సావిత్రి, సాదు కృష్ణవేణి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -