రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకర్ల వినతి
2014-18 మధ్య రూ.725.18 కోట్లు పెండింగ్
రైతుబంధు చెక్కుల ప్రింటింగ్ చార్జీలు ఇవ్వలేదు
వడ్డీలేని రుణాల బకాయిలకు చక్రవడ్డీలు
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
రుణాల కోసం సామాన్యుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పించుకొనే బ్యాంకర్లు ఇప్పుడు తమకు రావల్సిన సర్కారు సబ్సిడీ బకాయిల సొమ్ము కోసం సచివాలయం చుట్టూ తిరు గుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వేదికలపైనా తమ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రయోజనం శూన్యం. ఈ బకాయిల కు వడ్డీలు పెరిగి అసలును మించి పోవడం మరో విషయం. వివరాల్లోకి వెళ్తే…2014 నుంచి 2018 వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా వడ్డీలేని రుణాలను ప్రకటించింది. లబ్దిదారుల్నీ ఎంపిక చేసింది. బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నట్టు లేఖలు ఇచ్చింది. సబ్సిడీ సొమ్మును రీయింబర్స్‌మెంట్ చేస్తామని ఆ లేఖల్లో పేర్కొన్నది. ఆ లేఖల ఆధారంగా బ్యాంకర్లు లబ్దిదారులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేశారు. అలా 2014-2018 వరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రీయింబర్స్‌మెంట్ చేస్తామన్న సొమ్ము రూ.725.18 కోట్ల సొమ్మును నేటి వరకు బ్యాంకర్లకు చెల్లించలేదు.
దీనితో బ్యాంకర్లు ఇప్పుడు ఆ సొమ్ము కోసం రాష్ట్ర సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. విచిత్రంగా బీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా బ్యాంకర్లకు ఈ సబ్సిడీ బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆనాటి పాత బకాయిల చెల్లింపులను పట్టించుకోవట్లేదు. దీనిపై బ్యాంకర్లు అనేకసార్లు ఆర్థికశాఖకు లేఖలు రాసినా ప్రయోజనం శూన్యం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ రాధాకృష్ణన్ ఇటీవల దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. రైతుబంధు చెక్కుల ముద్రణ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లించలేదనీ, ఆ సొమ్ము మరో రూ.25.94 కోట్లు ఉన్నదని ఆయన గుర్తుచేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఎనిమిదేండ్లుగా వడ్డీలేని రుణాల సబ్సిడీ సొమ్ముకు వడ్డీలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కో రకమైన వడ్డీని వసూలు చేస్తున్నది. కొన్ని బ్యాంకులు ప్రభుత్వ సబ్సిడీ సొమ్ముకు చక్రవడ్డీ విధిస్తున్నాయి. ఇటీవల ఇదే విషయాన్ని ఓ సమావేశంలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క వద్ద బ్యాంకర్లు ప్రస్తావించినట్టు సమాచారం.
”ఆ వడ్డీని మీరు అప్పుడే వసూలు చేసుకోవాల్సింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టి మమ్మల్ని అడిగితే ఇప్పటికిప్పుడు మేం ఏం చేయలేం. అప్పటి ప్రభుత్వంపై మీరెందుకు ఒత్తిడి తేలేదు. అయినా ఇస్తాం. కొద్దిగా టైం పడుతుంది” అని సమాధానం చెప్పినట్టు తెలిసింది. దీంతో బ్యాంకర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే ఇదే సమావేశంలో గ్రామీణ ప్రజలకు బ్యాంకులు ఉదారంగా, విరివిగా రుణాలు ఇవ్వాలంటూ సదరు మంత్రి ఉద్భోద చేసినట్టు సమాచారం. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులకు వడ్డీలేని రుణాలపై సుదీర్ఘ ఉపన్యాసం కూడా ఇచ్చినట్టు తెలిసింది. అంతా విన్న బ్యాంకర్లు ‘సర్కారు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఏండ్ల తరబడి ఇవ్వకుండా, బ్యాంకుల నుంచి మీరు ఇంకా ఎక్కువ రుణాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం’ అని గొణుక్కున్నట్టు సమాచారం. 2014-18 మధ్యకాలంనాటి వడ్డీలేని రుణాల పెండింగ్ బకాయిల అసలు, వడ్డీని కూడా వెంటనే చెల్లించాలని కోరుతూ ఇటీవలే బ్యాంకర్లు మరోసారి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాసినట్టు తెలిసింది.


