పొగాకు విక్రయ దుకాణాలపై సిటీ పోలీసుల ఉక్కుపాదం
రూ. 1.10 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తుల సీజ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్నేహితులను చూసికొందరు, సరదాకోసం ఇంకొందరు, చెడు వ్యసనాలతో మరికొందురు విద్యార్థులు, యువకులు మాదకద్రవ్యాల భారిన పడుతున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని డ్రగ్స్, గంజాయి, ఈ సిగరేట్‌తో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న మాఫియాలు రెచ్చిపోతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలను విద్యార్థులకు సరఫరా చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల సమీపంలో గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు సులభంగా లభించడం వల్ల విద్యార్థులు, యువత వాటికి ఆకర్షితులవుతున్నారు. నగరంలో మాదకద్రవ్యాలతోపాటు పోగాకు ఉత్పత్తులను విద్యార్థులకు సరఫరా చేస్తున్న అంశంపై పోలీసులు ఆరా తియ్యగా పలు కేసుల్లో అస్సలు విషయం వెలుగుచూసింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ లో భాగంగా ఈ నెల 18 నుంచి విస్తతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి నెడుతున్న విద్యాసంస్థల సమీపంలోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
సుమారు 5 వేల మందికి పైగా పోలీసుల సోదాలు
విద్యార్థుల, యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై పోలీసులు కఠిన చట్టాలను ప్రయోగించారు. నగర వ్యాప్తంగా సుమారు 5 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది ఏకకాలంలో సోదాల్లో పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, రిజర్వ్ పోలీస్, ప్రత్యేక బందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. మూడు రోజుల్లో 567 కేసులను నమోదు చేశారు. సుమారు రూ. 1.10 కోట్ల విలువైన నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. అత్యధికంగా చార్మినార్ జోన్ పరిధిలో 119 కేసులు నమోదు కాగా, రాజేంద్రనగర్ జోన్‌లో 102, గోల్కొండలో 98 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఖైరతాబాద్‌లో 78, సికింద్రాబాద్‌లో 64, జూబ్లీహిల్స్ లో 54, శంషాబాద్ జోన్ పరిధిలో 52 కేసులను పోలీసులు నమోదు చేశారు. పట్టుబడిన ఉత్పత్తులు, దుకాణదారుల నేర తీవ్రతను బట్టి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (సీఓటీపీఏ చట్టం) óభారతీయ న్యాయ సంహిత లోని సంబంధిత సెక్షన్లు, జువైనల్ జస్టిస్ (జీజీ) యాక్ట్ – సెక్షన్ 77 అండ్ 79, ఈ-సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే…
నగరంలో ఎక్కడైనా ఏ దుకాణదారుడైనా మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే, వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015లోని సెక్షన్ 77 కింద చట్టపరమైన చర్యలను పోలీస్ అధికారులు తీసుకోనున్నారు. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, ఈ-సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు గమనిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు కోరారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) ఫోన్ నెంబర్ 8712661601కు సమాచారం అందించాలని సూచించారు.
యువత భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు : సజ్జనర్
డ్రగ్స్ రహిత సమాజం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆపరేషన్ సేఫ్ స్కూల్‌ను ప్రారంభించాం. డ్రగ్స్ మహమ్మారికి పొగాకు ఉత్పత్తులే ముఖద్వారం. ఈ ప్రమాదకరమైన గొలుసుకట్టును ప్రాథమిక దశలోనే తుంచేయాలన్నదే ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ ముఖ్య ఉద్దేశం. యువత భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. విద్యార్థులు, యువత భద్రత కోసం ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంభిస్తున్నాము.
డ్రగ్స్ ఊబిలోకి నెడుతున్నవారిపై ప్రత్యేక దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



