26 క్వింటాల పరిమితిని ఎత్తివేయాలి: రైతులు
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు
నవతెలంగాణ – బోనకల్
రైతులు పోరాటంతో సాధించుకున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో రైతులలో ఆనందం, ఉత్సాహం పరుగులు పెట్టింది. రైతులు ఆనందం ఆకాశాన్ని అంటింది. మండల పరిధిలోని ముష్టికుంట్ల రావినూతల సొసైటీ పరిధిలో గల రైతులు సోమవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి విధితమే. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ముష్టికుంట్ల సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అదేవిధంగా రావినూతల సొసైటీలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండారు నరసింహారావు, కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ బోనకల్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో మొక్కజొన్నలను కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, సహకారం పూర్తిగా తాము అందిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో రైతులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రైతులు వ్యవహరించాలని కోరారు. బోనకల్ మండలంలో తొమ్మిది సహకార సంఘాలు ఉండగా ప్రస్తుతం బోనకల్, లక్ష్మీపురం, కలకోట సహకార సంఘాలలో కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని ప్రస్తుతం రావినూతల, ముష్టికుంట్ల సహకార సంఘాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. ప్రైవేటు వ్యాపారులు రూ.1750 నుంచి రూ. 1800 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని దీనివలన తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వారికి వివరించారు. క్వింటాకు సుమారు రూ. 600 రూపాయల వరకు నష్టపోతున్నామని తెలిపారు. ఎకరానికి 26 క్వింటాల పరిమితిని పూర్తిగా ఎత్తివేసి రైతుల వద్ద ఉన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు వారిని డిమాండ్ చేశారు.
తమ నుంచి సగం పంటను కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన పంటను ఎవరికి అమ్ముకోవాలని దీని వల్ల కూడా తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కిలారు సురేష్, ముష్టికుంట్ల, రావినూతల సర్పంచ్ లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, భూక్యా బద్రు నాయక్, ఉప సర్పంచ్ లు అమరేసి సీతయ్య, దొండపాటి సత్యనారాయణ, బీఆర్ఎస్ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు బోయినపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు వట్టి కొండ రామకృష్ణ, రావినూతల మాజీ సొసైటీ చైర్మన్ మైనేని నారాయణ ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.



