నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తెలంగాణ రెండో పీఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం పీఆర్సీ గడువు పొడిగించకుండా, వెంటనే నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) కార్యకర్తల సమావేశం మంగళవారం మధ్యాహ్నం సిరిసిల్లలో గుండమనేని మహేందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పోరుబాట పట్టారని, ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 2024 మార్చి నుండి రిటైర్ అయిన 12 వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఏక మొత్తంగా రూ 10000 కోట్లు కేటాయించి పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాల డిమాండ్ చేశారు.
జిపిఎఫ్, సిపిఎస్ ఉపాధ్యాయుల డిఎ బకాయిలు విడుదల చేయాలని, బకాయి ఉన్న నాలుగు వాయిదాల డిఎ లను ప్రకటించాలని, హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి పర్యవేక్షణ అధికారుల పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ మాట్లాడుతూసిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, 2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని, కెజిబివి, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, మోడల్ స్కూల్స్, గురుకులాల ఉద్యోగులకు 010, హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, కోశాధికారి అంబటి రమేష్,జిల్లా కార్యదర్శులు కొత్వాల్ ప్రవీణ్,పాముల స్వామి,ఆడెపు శివకుమార్, తిరుపతి జాదవ్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.



