Wednesday, April 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభద్రాద్రి భద్రతే ఎజెండా !

భద్రాద్రి భద్రతే ఎజెండా !

- Advertisement -

– ముంపు, విస్తరణ సమస్యలకు పరిష్కారం చూపేవారెవరు?
– జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం
– పరిష్కారం చూపే వారికే పట్టం కడతామంటున్న ఓటర్లు
నవతెలంగాణ-భద్రాచలం

వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగడం, భారీవర్షాలతో భద్రాచలం అతలాకుతలం అవడం పరిపాటిగా మారింది. భద్రాద్రి ప్రజల్లో తమ భద్రతపై ఆందోళన నెలకొంటోంది. వరద ప్రవాహం చుట్టుముట్టడంతో పట్టణ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. భద్రాచలం ఆలయం చుట్టూ నీరు చేరుతోంది. ప్రమాదకర స్థాయి నీటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఇంత జరుగుతున్నా పాలకులు శాశ్వత పరిష్కారం చూపకుండా తూతూమంత్రంగా పనులు చేపట్టి ముగిస్తున్నారు. దీనిపై భద్రాచలం ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని మరిచిపోవడంతో జనం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భద్రాద్రి భద్రతే ఎన్నికల ఎజెండా కానుంది. హామీలుగాకుండా ఎవరు గెలిచినా పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందించి పరిష్కారం చూపేవారికే మద్దతు ఇస్తామని ప్రజలు అంటున్నారు.
2022లో 72 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకున్న క్రమంలో పట్టణానికి రక్షణగా ఉన్న కరకట్ట ఉంటుందో తెగుతుందో అన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. భద్రాచలం పట్టణానికి సరిహద్దు ఆంధ్ర ప్రాంతానికి ప్రారంభంగా ఉన్న ఎటపాక స్లూయిజ్‌ నుంచి వరద పొంగుతూ రాజుపేట కాలనీ నుంచి పట్టణంలోకి ప్రవేశించడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి సీతారామాలయం పరిసర ప్రాంతాల్లో పడవలలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 72 అడుగులకే భద్రాచలం అతలాకుతలం అయిపోతుంటే అప్పటికీ పోలవడం కాపర్‌ డ్యాము కూడా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు. మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాజెక్టుతో జూలై, ఆగస్టు సెప్టెంబర్‌ మాసాలలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద ప్రమాదాన్ని ఇప్పుడున్న కరకట్ట ఏమాత్రం కాపాడుతున్నదనేది సందేహం. ఈ సమయంలో అన్ని రాజకీయ పక్షాలు, ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, పౌర సంస్థలు భద్రాచలం భద్రతపై ఎవరూ మాట్లాడని పరిస్థితి ఉంది. 2004లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన రాయి పడిన నాటి నుంచి భద్రాచలానికి జరగబోయే ముప్పును తెలియజేస్తూ పోలవరం ఉద్యమాన్ని సీపీఐ(ఎం) నిర్వహించింది. ఆ పోరాటంలో సకలజనులు పాల్గొన్నారు. మళ్లీ అలాంటి ఉద్యమం జరగాల్సి ఉంది.
భద్రాద్రి భద్రతతో పాటు రామయ్య పట్నం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా భద్రాచల విస్తరణనే ముఖ్యమని పట్టణ ప్రజలు అంటున్నారు. భద్రాచలం నుండి పర్ణశాల వెళ్లాలన్న పది కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్‌ దాటి వెళ్లాలి. ఈ నేపథ్యంలో భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపితేనే రామయ్యపట్నం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇటీవల జరిగిన భద్రాచలం మేజర్‌ గ్రామపంచాయతీ ఎన్నికలలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎన్నికలలో కరకట్ట పున:నిర్మాణం, ఐదు పంచాయతీల విలీనం వంటి ఆంశాలను ప్రచార అస్త్రాలుగా వాడుకున్నాయి.

సర్పంచిగా గెలిచిన మొదటి తీర్మానమే ఐదు పంచాయతీలపై చేస్తామని రెండు ప్రధాన పార్టీలు హామీ ఇచ్చినప్పటికీ ఎన్నికలు ముగిసి నూతన పాలకవర్గం ఏర్పడి మూడు మాసాలు అవుతున్నా ఇప్పటివరకు తీర్మానం చేయలేదు. అందుకే ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత అని నినదిస్తూ ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలం పునరీకరణ పేరుతో రాజకీయ ఉద్యోగ పక్షాలను ఐక్యం చేసి సదస్సును నిర్వహించాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అవసరాన్ని గుర్తించిన తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోం మంత్రికి పలుమార్లు లేఖలు రాయటం, రాజ్యసభ సభ్యురాలు పార్లమెంట్లో చర్చించడం జరిగినప్పటికీ ప్రభుత్వమే పూనుకొని అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

అదేవిధంగా త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ఐదు పంచాయతీలు, కరకట్ట పున:నిర్మాణంపై స్పష్టమైన నిర్ణయానికి రాకపోతే అధికార పక్షానికి భంగపాటు తప్పదని తెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ సైతం కరకట్ట నిర్మాణంపై ప్రకటనకే పరిమితం గాకుండా భవిష్యత్‌ కార్యాచరణను స్పష్టంగా ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గతంలో అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఎజెండాలుగా ఎన్నికలు జరిగాయి. ఇటీవల కాలంలో పోలవరం ముంపు ఐదు పంచాయతీల విస్తరణ సమస్య కింది స్థాయి వరకు విస్తతంగా వెళ్ళటంతో ప్రధానంగా భద్రాచలం భద్రత భవిష్యత్తు ముఖ్యమని ఈ ప్రాంత ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని స్పష్టమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -