Wednesday, April 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓడినా ఆత్మవిమర్శ చేసుకోని

ఓడినా ఆత్మవిమర్శ చేసుకోని

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ వెయ్యేండ్లైనా మారదు
– ప్రజలే తప్పు చేశారన్నట్టుగా చులకన చేస్తారా? : కల్వకుంట్ల కవిత ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఓటమి పాలైనా బీఆర్‌ఎస్‌ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదనీ, ప్రజలే తప్పు చేశారని చులకన చేసి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకి, 75 ఏండ్ల కురువృద్ధుడు జీవన్‌ రెడ్డిని చేర్చుకుని రాజకీయ పునరేకీకరణ అంటున్న బీఆర్‌ఎస్‌ వెయ్యేండ్లైనా మారదని ఆమె మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు.

వైఎస్‌ నాయకత్వం ఉంటే చాలనీ, తెలంగాణ ఎందుకని ప్రశ్నించిన జీవన్‌ రెడ్డిని చేర్చుకన్న బీఆర్‌ఎస్‌ ఆలోచనా విధానం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని కవిత కోరారు. ఉద్యమ నాయకత్వంపై పోటీ చేసిన వ్యక్తి జీవన్‌ రెడ్డి అని గుర్తుచేశారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదని గుర్తుచేశారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్‌ సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్‌ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదనీ, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదని చెప్పారు.అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలు బహిరంగ సభలు పెట్టి బల ప్రదర్శనకు దిగి పిట్టకథలు, ఉత్తి కథలు చెప్పారని కవిత విమర్శించారు. పార్టీలు కేంద్రంగా కాకుండా ప్రజలే కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలనీ, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈ నెల 25న వస్తున్నామని తెలిపారు. సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడేందుకే తాము రాజకీయాల్లోకి వస్తున్నామనీ, ప్రజలు ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సీఎం మాట్లాడారని అన్నారు. ఫలానా కేసులో ఏ రకంగా తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. సీజన్‌ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదనీ, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారనీ, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదనీ, జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వకుండా ఎలా అధికారంలోకి వస్తారని విమర్శించారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కవిత సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రయివేటీకరించాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ జాగతిలో చేరిన ఏఐఎఫ్‌బీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రసాద్‌
ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఆర్‌.వీ.ఆర్‌. ప్రసాద్‌ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. మంగళవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ మైనార్టీ సెల్‌ నాయకులు సయ్యద్‌ మతీన్‌ అహ్మద్‌ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -