లోక్సభకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
ఎంపీ కే సీ వేణుగోపాల్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాని మోడీ సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు కాంగ్రెస్ ఎంపీ కే సీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రూల్ 222 కింద ప్రివిలేజ్ నోటీసు అందజేశారు. ”ఏప్రిల్ 18న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో ప్రతిపక్షాలను తప్పుబట్టారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల వల్లే వీగిపోయిందని, దీనివల్లే మహిళా రిజర్వేషన్ బిల్లుకు క్లియరెన్స్ దక్కలేదని ఆరోపించారు” అని ప్రధాని ప్రసంగాన్ని కాంగ్రెస్ లోక్సభ ఎంపీ వేణుగోపాల్ తప్పుబట్టారు. మోడీ తన ప్రసంగంలో ప్రతిపక్షాలను తప్పుపట్టడం అనైతికమని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అవుతుందని అన్నారు.
బిల్లు వీగిపోవడానికి కారణం ప్రతిపక్షాలు అని చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. పార్లమెంట్లో మెజారిటీ సాధించకపోవడానికి ప్రతిపక్షాలు కారణమని ప్రధాని పేర్కొనడం శోచనీయమన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, కానీ ప్రభుత్వం తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును మాత్రమే వ్యతిరేకించాయని వేణుగోపాల్ తెలిపారు. 106వ రాజ్యాంగ సవరణతో ఏర్పడిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని ప్రతిపక్షాలు కోరాయని, ప్రధాని మాత్రం విపక్షాలను తప్పుబట్టి సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. పార్లమెంట్ విధుల ప్రకారం తాము ఓటింగ్లో పాల్గొన్నామని, కానీ ఆ బిల్లు ఓడిపోవడానికి ప్రతిపక్షాలే కారణమని ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని, రాజ్యాంగంలోని 105వ అధికరణ ప్రకారం ఓటు వేసిన సభ్యులకు ఎటువంటి కారణాలను ఆపాదించరాదని ఆయన అన్నారు. ప్రధానితో సహా ఎవరికైనా ఆ ఆర్టికల్ వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికైన ప్రతినిధి తన విధులను నిర్వర్తిస్తుంటే .. వారిని తప్పుపట్టడం వ్యక్తిగత దాడి అవుతుందని, అంతేకాక పార్లమెంట్ వ్యవస్థను ధిక్కరించడం అవుతుందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసినట్టు అవుతుందని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంట్, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు స్పీకర్ ఓం బిర్లా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాని మోడీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్
- Advertisement -
- Advertisement -



