– మూగబోయిన మైకులు
– తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు
– రేపు పోలింగ్..
మే 4న ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. రాజకీయ నేతల ప్రసంగాలు, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో మారుమోగిన మైకులు మంగళవారం సాయంత్రం మూగ బోయాయి. చివరి రోజు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 152 సీట్లకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
డీఎంకే- ఎన్డీయే కూటమి అమీతుమీ
తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా రెండు బలమైన కూటముల మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల బరిలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎన్డీయే కూటమి అమీతుమీ తెల్చుకోనున్నాయి. వీటితో పాటు నటుడు విజరు నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైంది. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ మొత్తంగా 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో భాగంగా కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి వీకే స్టాలిన్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (చెపాక్-తిరువల్లికేణి), సెంథిల్ బాలాజీ (కోయంబత్తూరు సౌత్) సహా ఇతర మంత్రులు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే అగ్రనేత ఎడప్పాడి కె. పళనిస్వామి (ఎడప్పాడి), బీజేపీ నేతలు ఎల్.మురుగన్, తమిళసై సౌందరరాజన్ బరిలో ఉన్నారు. విజరు నేతృత్వంలోని టీవీకే మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తుండగా, విజరు పెరంబూర్, తిరుచ్చి తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సీపీఐ(ఎం) కూడా హౌరాహౌరీ ప్రచారం చేపట్టింది. కిల్వేలూరు పార్టీ అభ్యర్థి టి. లతకు మద్దతుగా జరిగిన భారీ ర్యాలీలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు కె. బాలకృష్ణన్ పాల్గొన్నారు.
తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న
4,023 మంది అభ్యర్థులు
ఈ రాష్ట్రంలో 234 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షిం చుకోను న్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగిం చుకోను న్నారు. వయో వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ఎన్నికల సంఘం ఇప్పటికే ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు, వేలాది పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తు న్నారు. మే 4న ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 23న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1,478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.82 కోట్ల మంది ఓటర్లు ఉండగా మొదటి విడత ఎన్నికల్లో సుమారు 3.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 10,361 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా సిబ్బందితోనే నిర్వహించనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్లు, ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ వంటి వసతులను కల్పించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు వేలాది పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
2.5 లక్షల మంది సాయుధ సిబ్బందితో
భద్రతా ఏర్పాట్లు
మరోవైపు ఎన్నికలు సజావుగా సాగేందుకు సుమారు 2.5 లక్షల మంది సాయుధ సిబ్బందిని ఎన్నికల సంఘం మోహరించింది. 8వేల కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో సర్ అంశం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఒక్క ముర్షిదాబాద్‌లోనే 7.4 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడం రాజకీయ దుమారం రేపింది. పశ్చిమబెంగాల్లో మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. వీటితో పాటు ఇటీవల జరిగిన కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
భవానీపూర్‌పైనే అందరి దృష్టి
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం) బరిలో ఉండగా తీవ్ర పోటీ మాత్రం టీఎంసీ- బీజేపీ మధ్య నెలకొంది. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 77 సీట్లు రాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 213 సీట్లతో భారీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్నికల ప్రచారానికి తెర
- Advertisement -
- Advertisement -



