డాలర్‌తో 32 పైసలు పతనమై రూ.93.48లకు..
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ వెలవెల పోతోంది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి 93.48 వద్ద ముగిసింది. పశ్చిమాసియా శాంతి చర్చల పురోగతిపై నెలకొన్న అనిశ్చితి వల్ల ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం. అదే సమయంలో అమెరికా కరెన్సీ బలంగా కొనసాగుతుండటం రూపాయిపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసినప్పటికీ అవి రూపాయిని ఆదుకోలేకపోయాయని పేర్కొన్నాయి. వీటితో పాటు నాన్డెలివరబుల్ ఫార్వర్డ్ (ఎన్డీఎఫ్) మార్కెట్లలో స్పెక్యులేటివ్ బెట్టింగ్‌లపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న తాజా నిర్ణయం కూడా భారత కరెన్సీపై కొంత ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మూడో రోజూ మార్కెట్లకు లాభాలు..
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల ఆశావహ సంకేతాలు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గొచ్చనే అంచనాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీ లాభాలను సాధించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 753.03 పాయింట్లు పెరిగి 79,273కు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 211.75 పాయింట్ల లాభంతో 24,576 స్థాయి వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 79,367 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. మరోవైపు రిలయన్స్, టైటాన్, ఎన్టీపీసీ వంటి స్టాక్స్ అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 94.70 డాలర్ల వద్ద, బంగారం ధర 4781 డాలర్ల వద్ద నమోదయ్యాయి.
నిఫ్టీ 27వేల ఎగువకు చేరొచ్చు : పిఎల్ క్యాపిటల్
గత మూడు నెలల్లో నిఫ్టీ 6.6 శాతం పతనాన్ని చవిచూసినప్పటికీ.. 2026-28 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏడాది సగటు ఆదాయాలు 15 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని పిఎల్ క్యాపిటల్ అంచనా వేసింది. నిఫ్టీ భవిష్యత్ లక్ష్యాన్ని 27,080 పాయింట్లుగా పిఎల్ క్యాపిటల్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ”ప్రపంచ అనిశ్చితులు, చమురు ధరల పెరుగుదల స్వల్పకాలిక సవాళ్లను విసురుతున్నప్పటికీ, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ఉత్పత్తి వంటి దేశీయ అంశాలు మార్కెట్ స్థిరత్వానికి తోడ్పడతాయి” అని ఆ సంస్థ ఇన్స్ట్యూషనల్ ఈక్విటీస్ కోహెడ్ అమ్నిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
మళ్లీ అగాధంలో రూపాయి
- Advertisement -
- Advertisement -



