Wednesday, April 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలకు నో : ఇరాన్‌

చర్చలకు నో : ఇరాన్‌

- Advertisement -

ఒప్పందం కుదరకపోతే బాంబు దాడులే : ట్రంప్‌ బెదిరింపు
ఎలాంటి చర్యలకైనా సిద్ధం : ఇరాన్‌
నేటితో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం
నేడు ఇస్లామాబాద్‌కు అమెరికా, ఇరాన్‌ బృందాలు : పాకిస్తాన్‌
(నవ తెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌)

కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతున్న నేపథ్యంలో ఇరాన్‌, అమెరికా మధ్య పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రశ్నే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. అమెరికా డిమాండ్ల చిట్టా పెరిగిపోతోందని, అవాస్తవ అంచనాలు వేస్తోందని, వైఖరిని తరచూ మార్చుకుంటోందని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందని మండిపడింది. హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధించడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌ చేరుకున్నప్పటికీ ఇరాన్‌ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఇదిలావుండగా పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌కు ఫోన్‌ చేసి మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. సౌదీ అరేబియా, ఖతార్‌, టర్కీ దేశాలతో జరిపిన సంప్రదింపుల వివరాలు తెలియజేశారు.

ప్రతినిధి బృందాన్ని పంపడం లేదు : టెహ్రాన్‌
చైనాకు టెహ్రాన్‌ ప్రతినిధి బృందాన్ని పంపుతోందంటూ వస్తున్న వార్తలను ఇరాన్‌ తోసిపుచ్చింది. అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఇప్పటి వరకూ ఏ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌ బయలుదేరలేదని ప్రభుత్వ మీడియా తెలియజేసింది. రెండో విడత చర్చల కోసం ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌ చేరుకున్నదని లేదా బయలుదేరిందని పలు అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తాసంస్థలు కథనాలు అంది స్తుండడంతో ఇరాన్‌ ఈ వివరణ ఇచ్చింది. ఒత్తిడితో చర్చలు జరపలేమని ఇరాన్‌ అధికా రులు స్పష్టం చేశారు. అమెరికా వైఖరిలో వచ్చే మార్పును బట్టే చర్చలు కొనసాగుతా యని తేల్చిచెప్పారు. కాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సందర్భంగా ఇచ్చిన హామీ లను అమెరికా ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు సహించబోవని, అత్యంత అప్రమత్తత తో ఉంటాయని, ‘నిర్ణయాత్మక… తక్షణ’ స్పందన తెలుపుతాయని ఇరాన్‌ సీనియర్‌ సైనిక కమాండర్‌ మేజర్‌ జనరల్‌ అబ్దోల్లహీ హెచ్చరించారు.

బెదిరింపులతో చర్చలా : ఘలీబఫ్‌ మండిపాటు
బెదిరింపులు, కాల్పుల విరమణ ఒప్పం దం ఉల్లంఘనల ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దౌత్యాన్ని నీరుకారుస్తున్నారని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ ఘలీబఫ్‌ ఆరోపించారు. చర్చలను లొంగుబాటుకు వేదికగా మార్చేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తు న్నా రని మండిపడ్డారు. ఉద్రిక్తతలు మరింత పెరి గితే యుద్ధభూమిలో మరిన్ని అస్త్రాలు వాడతా మని హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడు తున్న ట్రంప్‌తో చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నిం చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లం ఘించడమే కాకుండా తమ నౌకల రాకపోక లను అడ్డుకుంటున్నారని ధ్వజ మెత్తారు. లొంగిపోయేలా తమపై ఒత్తిడి తేవడానికి, యుద్ధం తిరిగి మొదలు పెట్టడానికి ఆయన చర్చలను ఓ సాకుగా చూపుతున్నారన్నారు. బెదిరింపుల మధ్య జరిగే చర్చలను ఇరాన్‌ ఎప్పటికీ అంగీకరించదని చెప్పారు.

చర్చలకు రాకుంటే సమస్యలు తప్పవు : ట్రంప్‌ బెదిరింపు
‘చర్చలకు రండి…లేకుంటే గతంలో ఎన్నడూ చూడని విధంగా సమ స్యలు ఎదుర్కోండి’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ను బెదిరిం చారు. ‘ది జాన్‌ ఫ్రెడరిక్స్‌ షో’కు ఆయన ఫోన్‌ ఇంటర్వ్యూ ఇస్తూ చర్చలకు ఇరాన్‌ వస్తే మంచిదే నని, లేకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇరాన్‌ నాయకత్వంతో నేరుగా చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని ట్రంప్‌ తెలిపారు. చర్చలు జరిపేందుకు తమ వద్ద సమర్థులైన వ్యక్తులు ఉన్నారని, ఒకవేళ ఇరాన్‌ ప్రతినిధులు తనను నేరుగా కలవాలని అనుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు. ఇదిలావుండగా సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో వరుసగా పోస్టులు పెడు తున్న ట్రంప్‌ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు. ఇరాన్‌కు చెందిన వందలాది చమురు నౌకలు అమెరికా వైపు వస్తున్నాయని దాని సారాంశం. అమెరికాకు బయలు దేరాలని ఇరాన్‌ నాయకత్వమే నౌకలకు సూచించిందని, అవి టెక్సాస్‌, లూసియానా, అలస్కా నగరాలకు చేరుకునే అవకాశం ఉన్నదని ఆయన రాసుకొచ్చారు. యుద్ధంపై తప్పుడు వార్తలు రాస్తున్నా యంటూ కొన్ని అమెరికా వార్తా సంస్థలపై ట్రంప్‌ మండిపడ్డారు. అమెరికా సైనిక కార్యకలాపాలు బాగానే కొనసాగుతున్నా యంటూ దళా లను ప్రశం సించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకూ నౌకల రాక పోకలపై దిగ్బంధం కొనసాగు తుందని ట్రంప్‌ చెప్పారు.

శాంతి చర్చలకు సిద్ధంకండి : చైనా సూచన
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు బుధవారం ముగుస్తున్న దృష్ట్యా అన్ని పక్షాలు శాంతి చర్చలకు సిద్ధం కావాలని చైనా సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితి కీలక దశలో ఉంది. అది శాంతి, యుద్ధం మధ్య ఊగిస లాడుతోంది. ఈ తరుణంలో అన్ని పక్షాలు చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరిష్కారానికి కట్టుబడి ఉండాలి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించి చర్చలు కొనసాగించాలి’ అని చైనా విదేశాంగ ప్రతినిధి గుయో జియాకన్‌ తెలిపారు. హార్ముజ్‌ జలసంధిని తెరవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇప్పటికే సూచించారు.

దిగ్బంధాన్ని తప్పించుకొని…
హార్ముజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధాన్ని విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ ఆంక్షలను దాటుకొని ఇరాన్‌కు చెందిన ఓ ట్యాంకర్‌ తిరిగి తమ జలాలలో ప్రవేశించిం దని తెలుస్తోంది. ఇరాన్‌ నుంచి ఇండోనేషియాకు గత నెలలో 20 లక్షల బ్యారళ్ల చమురుతో ఓ నౌక బయలుదేరింది. చమురును మరో ట్యాంకర్‌లోకి బదిలీ చేసిన తర్వాత తిరిగి వెనక్కి బయలు దేరింది. అమెరికా దిగ్బంధాన్ని దాటుకొని విజయవం తంగా ఇరాన్‌ జలాల్లోకి ప్రవేశించింది. ఇది ఒక గొప్ప విజయమని ఇరాన్‌ తెలిపింది. అయితే ఈ ఘటనపై అమెరికా ఇంకా స్పందించలేదు.

హార్ముజ్‌ను దాటిన పది భారత నౌకలు
హార్ముజ్‌ జలసంధిలో నిలిచిపోయిన పది భారత నౌకలు సురక్షితంగా దానిని దాటా యి. భారత నౌకలు హార్ముజ్‌ను దాటి బయటికి వచ్చేందుకు వీలు కల్పించా లంటూ ఇరాన్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. హార్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. ‘ఇరాన్‌ రాయబారిని పిలిపించాం. విదేశాంగ కార్యదర్శితో ఆయన సమావేశమయ్యారు. దాడి గురించి తమ అధికారులకు తెలియజేస్తానని రాయబారి చెప్పారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ విలేకరులకు చెప్పారు. కాగా మన దేశానికి చెందిన మరో 14 నౌకలు ఇంకా హార్ముజ్‌లోనే ఉన్నాయి.

ఆయనకు వ్యూహమే లేదు : ట్రంప్‌పై అమెరికా పాత్రికేయురాలు ఆపిల్‌బమ్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, ఇరాన్‌పై ఆయన చేస్తున్న యుద్ధంపై పులిట్జర్‌ బహుమతి విజేత, చరిత్రకారిణి, పాత్రికేయురాలు అన్నే ఆపిల్‌బమ్‌ తీవ్రంగా స్పందించారు. అమెరికాకు ప్రస్తుతం వ్యూహాత్మక దిశ కొరవడిందని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక ప్రణాళికల కంటే ట్రంప్‌ తన వ్యక్తిగత కోరికలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విమర్శించారు. ట్రంప్‌ చర్యలు అనూహ్యంగా ఉంటాయని, ఫలితంగా ప్రపంచంలో అస్థిరత తలెత్తుతోందని, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోందని చెప్పారు. కీలక పదవులలో ఆయన అనుభవం లేని వ్యక్తులను నియమించారని అంటూ ఇంటెలిజెన్స్‌ అధిపతిగా తుల్సీ గబ్బార్డ్‌ నియామకాన్ని ప్రస్తావించారు. సంప్రదాయ సంస్థలను ట్రంప్‌ నీరుకారుస్తున్నారని ఆరోపించారు. ఆయన నిరంకుశులకే ప్రాధాన్యత ఇస్తారని, ఇతర నియంతలను ప్రశంసిస్తుంటారని తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీ భవిష్యత్తు, ప్రజాభిప్రాయం కంటే ఆయన తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని అంటూ శ్వేతసౌధంలో ఓ బాల్‌రూమ్‌ను నిర్మించాలన్న ట్రంప్‌ అభీష్టాన్ని ఆపిల్‌బమ్‌ గుర్తు చేశారు.

ఆ నౌకతో మాకు సంబంధం లేదు : చైనా స్పష్టం
బీజింగ్‌ : గల్ఫ్‌లో అమెరికా స్వాధీనం చేసుకున్న ఇరాన్‌ కార్గో నౌకతో తమకేమీ సంబంధం లేదని చైనా స్పష్టం చేసింది. క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు ఆ నౌకలో ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ‘నాకు తెలిసినంత వరకూ అది విదేశీ పతాకం ఉన్న కంటైనర్‌ నౌక. దానితో మాకు సంబంధం ఉన్నదన్న వార్తలలో నిజం లేదు’ అని చైనా విదేశాంగ ప్రతినిధి గుయో జియాకమ్‌ తెలిపారు. ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిక్కీ హేలీ అంతకుముందు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ అమెరికా స్వాధీనం చేసుకున్న నౌక చైనా నుంచి ఇరాన్‌ వెళుతోందని, అందులో క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయనాలు ఉన్నాయని ఆరోపించారు. ఇరాన్‌ పాలకులకు చైనా సాయపడుతోందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది.

అమెరికా యుద్ధం ఖర్చుతో…
8.7 కోట్ల మంది ప్రాణాలు కాపాడవచ్చు : ఐరాస

ఇరాన్‌పై యుద్ధం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రోజుకు రెండు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. యుద్ధంపై చేస్తున్న వ్యయంతో 8.7 కోట్ల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఐక్యరాజ్యసమితి మానవతావాద సంస్థ అధినేత టామ్‌ ఫ్లెచ్చర్‌ చెప్పారు. ఇందుకు 23 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని అన్నారు. ఈ నిధులను పక్షం రోజులలోనే సమకూర్చు కోవచ్చునని, అయితే నిర్లక్ష్యపు యుద్ధం కారణంగా అది జరగలేదని తెలిపారు. ఇరాన్‌పై బాంబు దాడులు జరిపి ఆ దేశాన్ని రాతి యుగం నాటికి తీసుకుపోతానంటూ ట్రంప్‌ చేస్తున్న హెచ్చరికను ఆయన ప్రస్తావిస్తూ అది చాలా ప్రమాదకరమని అన్నారు. నియంత కావాలని అనుకునే వారికి ఇలాంటి బెదిరింపులు ప్రోత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సోమవారం ప్రసంగిస్తూ వివిధ దేశాలు అందిస్తున్న నిధులలో కోత విధించడంతో ఐరాస మానవతా సాయం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఆహార-ఇంధన ద్రవ్యోల్బణం 20 శాతానికి చేరిందని తెలిపారు. సబ్‌-సహారన్‌ ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికాలపై దీని ప్రభావం అనేక సంవత్సరాల పాటు ఉంటుందని, అనేక మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోతారని ఫ్లెచ్చర్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -