మాకోసం కన్నీళ్ళు కార్చొద్దు
ఇన్నేళ్ళ కాలంలో మీరు చేసిందేమిటి? :
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు బృందాకరత్ లేఖ
ప్రధాని జీ.. మహిళా రిజర్వేషన్ అంశంతోనే మీరు జాతినుద్దేశించి ప్రసంగించడం ఆరంభించారు. ”అధికారంలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించడంపై పోరాటం అనేక దశాబ్దాలుగా సాగుతోంది….కాబట్టి అనేకమంది మహిళలు ఈ అంశాన్ని నా ముందు ప్రస్తావించారు కూడా. అందువల్ల అనేకమంది సోదరీమణులు ప్రతీ అంశాన్ని వివరిస్తూ నాకు లేఖలు కూడా రాశారు.”
మోడీజీ, మీరు ప్రస్తావించినట్లుగా, ‘దశాబ్దాలు తరబడి సుదీర్ఘంగా సాగుతున్న పోరాటం’లో క్రియాశీలంగా పాల్గొన్న ఒకరి నుంచి మీకు మరొక లేఖ. ఆ చారిత్రక పోరాటం మహిళా సంఘాల నాయకత్వాన సాగింది. తాము కేవలం ‘ప్రతినిధులం’ కాదని నిరూపించుకోవడానికి పంచాయితీల్లోని లక్షలాదిమంది మహిళలు పితృస్వామ్య సంస్కృతులపై పోరాడారు, వేలాదిగా ప్రదర్శనలు, ర్యాలీలు, నిరసనలు, ధర్నాల్లో పాల్గొన్నారు. పిటిషన్లు అందచేశారు. ‘నేను కూడా దాని కోసం కృషి చేస్తున్న వారిలో ఒకడిని’ అని మీరు కూడా అన్నారు. లేదు మోడీజీ, ఇన్నేళ్ళ పోరాటంలో మీ నుంచి ఎన్నడూ కూడా మాకు ఎలాంటి మద్దతు అందలేదు. గాడ్సే సిద్ధాంతానికి, గాంధీ సిద్ధాంతానికి మధ్య ఎంత దూరం వుందో మీరన్నదానికి సత్యానికి అంత దూరం వుంది.
ప్రచారాల నుంచి వాస్తవాలు వేరు చేద్దాం మోడీజీ. కానీ దానికి ముందుగా – మహిళల ‘విచారాలను పంచుకుంటున్నాం’ అన్న మీ ప్రకటనను, ”ఈ దేశ మహిళలకు నేను హామీ ఇస్తున్నా : మహిళా రిజర్వేషన్లు అమలు చేసే మార్గంలో గల ప్రతి అవరోధాన్ని మేం తొలగిస్తాం.” అన్న మీ ప్రతినను ప్రస్తావిస్తూ, మీ విచారాన్ని, ప్రతి అడ్డంకిని తొలగించగల నిర్దిష్టమైన సూచన ఇదిగో. 2023లో మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 106వ రాజ్యాంగ సవరణలో తలెత్తిన ప్రధాన అడ్డంకిని తొలగించాలి. ఇది, మహిళా రిజర్వేషన్‌ను జనాభా లెక్కలతో, నియోజకవర్గాల పునర్విభజనతో ముడి పెడుతోంది. ఈ వ్యాక్యాన్ని తొలగించండి మోడీజీ, మహిళా రిజర్వేషన్లను రేపటి నుంచే అమలు చేయవచ్చు. కానీ మీరు ఇది చేయరు మోడీజీ, మహిళా రిజర్వేషన్ పట్ల మీకు ఎన్నడూ నిబద్ధత లేదు.
2014లో మీరు ప్రధానిగా ఎన్నికయ్యారు. మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో మీ పార్టీ హామీ ఇచ్చింది. మీ నేతృత్వంలోని కూటమి 336 సీట్లలో విజయం సాధించింది. వాటిలో మీ పార్టీ 282 సీట్లు గెలిచింది. మీరు చేసిన ‘ప్రయత్నాలు’ ఏమిటి? మీ మొదటి పదవీ కాలంలోనే మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదో మీరు ఈ దేశ మహిళలకు చెప్పండి. అంతేకాదు మోడీజీ, కనీసం బిల్లును ప్రభుత్వ ఎజెండాలో పెట్టడానికి కూడా మీరు తిరస్కరించారు. 2017లో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడిగా అప్పటి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బిజినెస్ ఎజెండాలో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. మీరు ఎందుకు తిరస్కరించారు? 2018 జులైలో లోక్‌సభలో సీపీఐ(ఎం) ఎంపీ, ప్రస్తుత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి ఈ అంశాన్ని లేవనెత్తారు. 2019లో జరగాల్సిన ఎన్నికలకు ఇంకా ఒకే ఒక సంవత్సరం మిగిలి వుండడంతో అప్పుడు ఒక రకమైన ఆతృత నెలకొంది. ఆమెకు అనేక పార్టీలు మద్దతిచ్చాయి. కానీ మీ ప్రభుత్వం ఆమె అభ్యర్ధనను విస్మరించింది. పలు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో ధర్నా చేశారు. పార్లమెంట్ వెలుపల, బిల్లును అజెండాలో చేర్చి, ఆమోదించాలని కోరుతూ మహిళలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. కానీ, మీరేమీ చేయలేదు. ఎందుకని మిస్టర్ మోడీ? ఫలితంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడో వంతు రిజర్వేషన్లు మహిళలు కోల్పోయారు. ఈ అంశంపై మీ మొదటి ద్రోహం ఇది.
2019లో, మీ పార్టీ మరింత పెద్ద మెజారిటీతో గెలుపొందింది. మీ కూటమి 353 సీట్లను గెలుచుకుంటే అందులో మీ పార్టీ 303 సీట్లను గెలుచుకుంది. ఇది భారీ మెజారిటీనే. మరి దాన్ని మీరు ఎలా ఉపయోగించారు? వ్యాపార వాణిజ్య వర్గాలకు సాయపడడమే మీ ప్రాధాన్యతగా వుంది. నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను మీరు తీసుకువచ్చారు. మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించడానికి మీరు మీ మెజారిటీని ఉపయోగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి మీ మెజారిటీని మీరెందుకు ఉపయోగించలేదు? కనీసం పార్లమెంటరీ కమిటీకి నివేదించేందుకు కూడా సమయం లేకుండా లోపభూయిష్టమైన మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి దాదాపుగా మీ పదవీ కాలంలో చివరి సమావేశాల వరకు మీరెందుకు వేచి వున్నారు?
పేరు మార్చి బిల్లు పెట్టారు..
2023 సెప్టెంబరులో మాత్రమే, నారీ శక్తి వందన్ అధినియం (ఎన్‌ఎస్‌విఎ) అని పేరు మార్చి మీరు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ శీర్షికను మీరు ఎంచుకోవడం గురించి ఈ లేఖలో తర్వాత నేను ప్రస్తావిస్తాను. మీరు మీరిచ్చిన హామీని రెండోసారి కూడా ఉల్లంఘించినందున రాబోయే 2024 ఎన్నికల్లో తలెత్తే విమర్శల నుంచి తప్పించుకునేందుకే మీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని చాలా మంది అన్నారు. కానీ ఎజెండా అంతకంటే అధ్వాన్నంగా వుంది. సెక్షన్ 334ఎను ఒక రాజ్యాంగ సవరణగా ఎన్‌విఎస్‌ఎ ప్రవేశపెట్టింది. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన అనంతరం మాత్రమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ఆ సెక్షన్ పేర్కొంటోంది. ఈ రీతిన ముడిపెట్టడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా నిరసించాయి. జనాభా లెక్కలతో లేదా నియోజక వర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్లకు అస్సలు సంబం ధం లేదని, రెండోది 2024 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ల హక్కు నిరాకరించబడుతోందని, మూడోది, ఈ మొత్తం ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో ఎలాంటి గ్యారంటీ లేదని మేం వాదించాం. వీటిల్లో చాలా అంశాలను ఆనాడు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో లేవనెత్తాయి. 2029 ఎన్నికల నాటికి జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని మీరు, హోం మంత్రి ‘హామీ’ ఇచ్చారు. బిల్లు ఆమోదం పొందింది. కానీ మీరిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు.
మహిళలు మూల్యం చెల్లించారు
మోడీజీ, మహిళలు మూల్యం చెల్లించారు. ఇలా ముడిపెట్టడంపై మీరు పట్టుబట్టకుండా, ఆనాడు మీ పార్టీ ఓటు వేసిన 2010 నాటి బిల్లునే ప్రవేశపెట్టినట్లైతే ఈనాడు లోక్‌సభలో 180మంది మహిళలు వుండేవారు. కానీ దానికి బదులుగా వారి సంఖ్య కేవలం 74కి పడిపోయింది. ఇది 2019లో కన్నా తక్కువే. ఈ కాలంలో పది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మూడో వంతుకు బదులుగా వారి సంఖ్య పది శాతం కన్నా తక్కువగా వుంది. మీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో 182 అసెంబ్లీ సీట్లలో, 2022లో నిర్వహించిన ఎన్నికల్లో, కేవలం 15మంది మాత్రమే మహిళలు. అంటే కేవలం 8శాతం. పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ మీకు వున్నప్పటికీ, తక్షణమే అమలు చేయగలిగేలా ఒక చట్టాన్ని తీసుకురావడానికి మీరు తిరస్కరించారు. ఇది మీరు చేసిన రెండో ద్రోహం మోడీజీ.
రాష్ట్రాల ఎన్నికల మధ్య మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు?
కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మధ్యలో, ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ అంశంపై కొత్తగా రాజ్యాంగ సవరణలు తీసుకురావడానికి పార్ల మెంట్ సమావేశాలను మీరు పొడిగించారు. ప్రతిపక్ష పార్టీలతోముందస్తు చర్చల్లేవు లేదా మహిళా సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు లేవు. చిట్టచివరకు సభా వేదికపై ఆ రాజ్యాంగ సవర ణలు వీగిపోయాయి. కాలం చెల్లిన టువంటి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని నియోజక వర్గాల పునర్విభజనను తీసుకురా వాలన్న మీ ఎజెండాను అమలు చేయడానికి మహిళా రిజర్వేషన్ అంశా న్ని ఉపయోగించుకోవాలన్న మీ ఎత్తుగడ ను భగం చేశాం. మీకు ఈ ఆలోచన వుండ బట్టే జనగణన ప్రక్రియను మీరు ఉద్దేశ్య పూర్వకంగా ఇంత వరకు ప్రారంభించలేదన్నది ఇప్పుడు స్పష్టమైంది. ఇది మీరు చేసిన మూడో ద్రోహం మోడీజీ.
పార్లమెంట్‌లో సీట్లను 850కి పెంచాలని మీరనుకుంటున్నారు. మీ ప్రసంగంలో ”నారీ శక్తి వందన్ సవరణ ఏ ఒక్కరి నుండి దేన్నీ తీసుకునేది కాదు. ప్రతి ఒక్కరికీ అన్నీ ఇవ్వడానికి ఉద్దేశించినదే నారీ శక్తి వందన్ సవరణ. ఇవ్వడానికే ఈ సవరణ.” అని మీరు చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే, రాజకీయాల్లో పితృస్వామ్యాన్ని భంగపరచరాదు. పురుషులే అధికారాన్ని అట్టిపెట్టుకోవాలి, వారి సంఖ్య పెరగాలి-కావాలంటే మహిళలను కలుపుకోవచ్చు. సామంత రాజ్యాలను నడుపుతూ, మహిళా రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మీ స్వంత పార్టీలోని ఫ్యూడల్ కులతత్వ భూస్వాముల నుండి ఎదురైన వ్యతిరేకత విషయంలో మీరు రాజీపడ్డారు. సీట్లు పెరిగితే వారు దెబ్బతినకుండా వుంటారు.
2014లో ఎలాఉందో.. అలాగే అమలు చేయాలి
ప్లీజ్ మోడీజీ, మా కోసం కన్నీళ్ళు కార్చకండి – 2014లో మీరు ఎలా చేయాల్సి వుందో అలాగే చేయండి, దేంతోనూ ఎలాంటి ముడిపెట్టడాలు, షరతులు లేకుండా తదుపరి ఎన్నికల్లో అమలు చేయడానికి వీలుగా మహిళా రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురండి, మాకు నాటకాలు కాదు, కార్యాచరణ కావాలి.
అభినందనలతో, బృందాకరత్
డీలిమిటేషన్ అంశంతో రాజకీయం
ఇక చిట్టచివరిగా, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుపై చూద్దాం. దీన్ని విడిగా చర్చించాలి. రాష్ట్రాల జనాభా అనేది దామాషా వాటాలకు ప్రాతిపదిక కారాదు. ఎందుకంటే ఇది, రాష్ట్రాలను వాటి అభివృద్ధికి శిక్షించినట్లవు తుంది. అటువంటపుడు ఏది ప్రాతిపదికగా వుండాలి? చర్చలు, సంప్రదింపులు జరగాలి. ఏ కేసులోనైనా మహిళా రిజర్వేషన్‌తో దీనికెలాంటి సంబంధం వుండదు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని మీరు తారుమారు చేయడంలో విఫలమైనందుకు మహిళలు సంతోషిస్తున్నారు. ‘భ్రూణ హత్యకు పాల్పడినందుకు’ ‘పాపం చేశారంటూ’ అందుకు వారు శిక్షించబడతారంటూ ప్రతిపక్షాలపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ మాటలను మరింత జాగ్రత్తగా ఉపయోగించాలి మోడీజీ. తప్పనిసరిగా మీరు అనుచితమైన పోలికలను ఉపయోగించాల్సి వచ్చినట్లైతే మీరు తెలుసుకోవాల్సింది అసలు అక్కడ గర్భస్త పిండమే లేదని. మీ పార్టీ ఓటు వేసిన 2010 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లు రూపంలో పూర్తిగా ‘రూపుదిద్దుకున్నదే’ అక్కడ వుంది. మీరు దాన్ని సమాధి చేసేశారు. ఒకవేళ పాపమంటూ ఏదైనా వుందంటే అది ఇదే. మీ ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాలతో మహిళలు విసిగిపోయారు. దాన్ని ‘వందన్’గా పిలవకండి. మేం గౌరవం కోసం చూడడం లేదు, హక్కుల కోసం చూస్తున్నాం. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగబద్ధంగా పెంచడంతోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందనే ప్రగాఢ విశ్వాసంలోనే మా బలమైన డిమాండ్ పాదుకుని వుంది. కుల గణన డిమాండ్‌కు మేం మద్దతిచ్చాం. అయితే దాన్ని మీరు నివారించాలనుకున్నారు. ఎందుకంటే భారతదేశంలోని కులాల అసమానతలకు సంబంధించిన వాస్తవాలకు ఒక రూపమివ్వడానికి, తిరుగులేని డేటా ద్వారా నమోదు చేయబడి, పరిష్కరించబడాలని మీరు కోరుకోవడం లేదు.
మనువాదీ దృక్పథమే..
అదనంగా మనువాదీ దృక్పథం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. 2011 జనాభా లెక్కలను ఉపయోగించడం ద్వారా దళితులు, ఆదివాసీ మహిళలకు వారికి రిజర్వ్ చేసిన సీట్లలో వారికి న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా వారికి నిరాకరించబడుతోందన్నది వాస్తవం కాదా ? 2001, 2006 మధ్య కాలంలో ఎస్‌సీ, ఎస్‌టీ జనాభా పెరిగింది. దానికి తగినట్లుగానే వారి సీట్లు కూడా పెరగాలి. కానీ మీ ప్రతిపాదన వారి ఈ హక్కును నిరాకరించింది.



