Wednesday, April 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమేలుకో రైతన్న..

మేలుకో రైతన్న..

- Advertisement -

– రైతాంగాన్ని వంచిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– ఈ చర్యలను తిప్పికొట్టేందుకు సభలో కార్యాచరణ
– మూడేండ్లలో ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ రైతుసంఘం
– ‘నవతెలంగాణ’తో ఆ సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
– కొత్తగూడెంలో 23 నుంచి 25 వరకు తెలంగాణ రైతుసంఘం 3వ మహాసభ

తెలంగాణ రైతుసంఘం (ఏఐకేఎస్‌) రాష్ట్ర 3వ మహాసభలు కొత్తగూడెంలో ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. ఈ మహాసభలకు 600 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, 5వేల మందితో ప్రారంభ సభ నిర్వహించ బోతున్నట్టు తెలిపారు. 33జిల్లాల నుంచి హాజరయ్యే ప్రతినిధులు మూడ్రోజుల పాటు చర్చలు జరుపుతారని, ఆయా జిల్లాల్లో ఉన్న వ్యవసాయ సమస్యలు, ప్రభుత్వ పథకాలు, రైతాంగ ఉద్యమం, విస్తరించాల్సిన ఆవశ్యకత, పంటలు, పంటల స్థితిగతులపై చర్చిస్తామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ ‘నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.

రైతు కోసం… రైతుసంఘం
”23న జరిగే ప్రారంభ సభకు ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌ధావలే, విజ్జుకృష్ణన్‌ హాజరవుతారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు తమ్మినేని వీరభద్రం, ఎం.సాయిబాబు, బి.వెంకట్‌ విచ్చేస్తున్నారు. ఈ మూడేండ్లలో నిర్వహించిన పోరాటాలను సమీక్షించు కొని రాబోయే మూడేండ్ల కార్యాచరణ రూపొందిస్తాం. నూతన కమిటీని ఎన్నుకుంటాం. రైతాంగ ఉద్యమం విశిష్ట అనుభవాలను అందించింది. స్వాతంత్య్రానికి ముందు, 1946-51 వరకు సాగిన అనేక రైతాంగ పోరాటాలు ఏ రూపంలో ఉన్నాయో ఇప్పుడు అటువంటివి కూడా వస్తున్నాయి. పంటల ప్రణాళికకు ఏమి చేయాలనే దానిపై ఈ మహాసభలో సెమినార్‌ ఏర్పాటు చేశాం” అని పోతినేని తెలిపారు.

పోడుభూములకు పట్టాలు ఇప్పించాం…
రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై పోరాటం చేశాం. కొన్నింటిలో ఆశించిన ఫలితాలు సాధించాం. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ హయాంలో పోడు భూముల సమస్యపై…2005లో తెచ్చిన అటవీహక్కుల చట్టాల ప్రకారం హక్కుపత్రాలు కల్పించాలని పోరాడాం. మొదటి నుంచి తెలంగాణ రైతు సంఘం ఈ సమస్యపై పట్టుబట్టి పోరాడింది. భద్రాచలం, ఏటూరునాగారం, ఆదిలాబాద్‌ నుంచి అశ్వారావుపేట వరకు సాగిన రహదా రుల దిగ్బంధనం వంటి పోరాటాలు చేశాం. మా కార్యకర్తలు అనేక కేసులు ఎదుర్కొ న్నారు. ఈ పోరాటాలతో ప్రభుత్వం దిగివచ్చి సుమారు 4.2 లక్షల మందికి హక్కు పత్రాలు జారీ చేసింది.

ల్యాండ్‌ ఫూలింగ్‌ యాక్టుకు వ్యతిరేకంగా..
రాష్ట్రంలో ల్యాండ్‌ పూలింగ్‌ యాక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. అసైన్డ్‌ భూములను ప్రభుత్వమే తీసుకుని కొంత భూమిని అస్సైన్‌మెంట్‌దారుకు ఇచ్చి మిగిలిన భూమిని డెవలప్‌ చేసి తద్వారా ప్రభుత్వం లబ్ది పొందాలని యత్నించింది. దీనిని రైతుసంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. అస్సైన్‌మెంట్‌ ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో భూస్వాములు, బడా వ్యాపారులకు కైంకర్యం చేసే కుట్ర భావించాం. ప్రభుత్వం దీనిని వెనక్కు తీసుకునే వరకు పోరాటం సాగించాం.

భూ నిర్వాసితులకు మద్దతుగా…
వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, మూడో రైల్వేలైన్‌, వివిధ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జరిపే భూసేకరణలో రైతులకు నామమాత్రపు పరిహారం ఇవ్వటాన్ని వ్యతిరేకించాం. భూ నిర్వాసితులకు మద్దతుగా ఉద్యమం నిర్వహించాం. ప్రభుత్వం ప్రకటించిన దానికంటే రెండు, మూడురెట్లు అదనంగా పరిహారాన్ని సాధించాం. 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా అరకొర పరిహారం ఇచ్చి రైతులను నష్టపరిచే చర్యలకు వ్యతిరేకంగా పోరాడాం.

ధరణి సమస్యలపై…
కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి సమస్య పరిష్కారానికి పోరాడాం. పార్ట్‌-బీ పేరుతో లక్షల ఎకరాలు పెండింగ్‌లో పెట్టడాన్ని నిరసిస్తూ పోరాటాలు చేశాం. ధరణిలో మార్పుల కోసం ఉద్యమాలు చేశాం. ఫలితంగా ప్రస్తుత ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చారు. ఈ చట్టంలోనూ ఉన్న లోపాలను ఎత్తిచూ పాలని డిమాండ్‌ చేయడంతో వీటిలో కొన్నింటిని సరిచేస్తున్నారు. సాదాబైనామాలో అమ్మినవారు వచ్చి సంతకం పెట్టాలనే నిబంధ న ఉండేది. అది జరిగే పనికాదని ప్రభుత్వానికి చెప్పాం. ఈ మేరకు కొన్నవారితోనే సరిపుచ్చే దిశగా చర్యలు పూర్తవుతున్నాయి. రైతాంగానికి ఇబ్బందులు తొలిగే దాకా ఉద్యమిస్తాం.

గిట్టుబాటు ధరల కోసం…
గిట్టుబాటు ధరల కోసం ఉద్యమిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతులను వంచించింది. 2014లో అధికారంలోకి రావడానికి ముందు ‘మేము కనీస మద్దతు ధరలకు చట్టం తీసుకొస్తాం… రైతుల ఆదాయాన్ని డబుల్‌ చేస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఏ దీనిని పూర్తిగా విస్మరించింది. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాం. కనీస మద్దతు ధరలు అమలు చేయాలని ఉద్యమిస్తున్నాం. రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న వీటి కొనుగోలులో ప్రభుత్వం సాచివేత ధోరణిని అవలంబిస్తోంది. అందుకే మేము మక్కల కొనుగోలు కేంద్రాలను తెరవాలని ప్రతీ మండలంలో ఆందోళనలు చేశాం. అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా సరిపోను ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

కౌలు రైతుల విషయంలో…
కౌలు రైతులకు రైతుభరోసా సంగతి అటుంచితే కనీసం కౌలుదారులను గుర్తించటం లేదు. రాష్ట్రంలో 26 లక్షల మంది కౌలుదారులు 30-35 లక్షల ఎకరాల భూములను సాగుచేస్తున్నారు. ప్రభుత్వం వీరిపట్ల శీతకన్ను వేసింది. గతంలో కేసీఆర్‌ కౌలుదారులను గుర్తించబోమని అన్నారు. ఈ ప్రభుత్వం గుర్తిస్తామన్నది. కానీ ఆచరణలో పక్కనపెట్టింది. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కార్యాచరణ చేపడుతున్నాం.

పేరుకే రైతు ప్రభుత్వం…
రైతుభరోసా సక్రమంగా అమలు కావటం లేదు. హామీ ఇచ్చినా కౌలు రైతులకు ఈ స్కీం ఆచరణ లేదు. పంటల బోనస్‌ సన్నాలకు మాత్రమే పరిమితమైంది. మొక్కజొన్నలకు ఇవ్వటం లేదు. పత్తి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. పంటల మార్పిడిలో నిర్ధిష్ట ప్రణాళిక లేదు. కోటి ఎకరాలకు ప్రాజెక్టులు, బోర్ల నీరు వస్తుంటే అటువంటి చోట ఏ పంటలు వేయాలి? వాటి మార్కెట్‌, పెట్టుబడి, విత్తనాలు, ఎరువుల సంగతేంటనేది ప్రభుత్వం ప్రణాళిక రూపొందించటం లేదు. ప్రత్యామ్నాయ పంటల విషయంలో ఈ మేరకు సూచనలు చేస్తే రైతులు ఆలోచిస్తారు. రైతు భరోసా విడతల వారీగా వేయటం, పెండింగ్‌లు పెట్టడం చేస్తున్నారు. ఈ సమస్యలపై తగిన పోరాటాలు నిర్వహించేందుకు కొత్తగూడెం మహాసభలను తగిన వేదికగా భావిస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -