గుక్కెడు తాగునీళ్లు కరువు
ప్రారంభానికి నోచుకోని ‘ఉమామహేశ్వర’ పనులు
తాగునీటి కోసం చెంచులు విలవిల
వన్యప్రాణులకు నీటి గండం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ చెంచుల గొంతు తడవడం లేదు. గుక్కెడు తాగునీటి కోసం విలవిల్లాడుతున్నారు. వన్యప్రాణులు కూడా నీటి కోసం అల్లాడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే వారికి తాగునీటితో పాటు సాగునీటి సౌకర్యార్థం ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని 2023లో ప్రభుత్వం ప్రతిపాదించింది. నిధులు కేటాయించి సర్వే కూడా పూర్తి చేశారు. మూడేండ్ల కాలవ్యవధిలో పూర్తి చేసి నల్లమల్ల ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రణాళిక రూపొందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు, గిరిజనేతరుల దప్పిక తీర్చడానికి సాగునీటి సమస్య నివారించడానికి ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని 2023 మే4న ప్రకటించింది. రూ.1,534 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చి, ఆ తర్వాత అంచనాలను రూ.2,500 కోట్లకు పెంచారు. నీటిపారుదల శాఖ చేపట్టే ఈ పథకానికి సర్వే పనులు పూర్తి చేశారు. బల్మూరు మండలం మైలారం సమీపంలో 2.5 టీఎంసీల సామర్థ్యంతో ఉమామహేశ్వర జలాశయాన్ని నిర్మించతలపెట్టారు. అమ్రాబాద్ మండలం మున్ననూరు దగ్గర చెన్నకేశవ జలాశయం నిర్మించాల్సి ఉంది. వనపర్తి జిల్లా ఏదుల నుండి 25 కిలోమీటర్ల కాలువ ద్వారా పాలమూరు రంగారెడ్డి నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 57,200 ఎకరాలకు సాగునీరు, 12000 మంది చెంచులకు దాహార్తి తీరుతుంది.
శిథిలమైపోతున్న పైలాన్
2021 ఏప్రిల్ 4న బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చంపేటలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమా నికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పైలాన్ శిథిలమైపోతోంది తప్ప పనులు ముందుకు సాగట్లేదు.
నీళ్లు లేవు…
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది. కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి సాగు, తాగునీటిని నల్లమల ఏజెన్సీకి మళ్లించాలని ప్రజలు కోరుతున్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా మోటారు పంపుల ద్వారా నల్లమల అటవీ ప్రాంతానికి మళ్ళిస్తే అచ్చంపేట, అమ్రాబాద్, పదర, వంకేశ్వరం, బల్మూరు, లింగాల, ఉప్పునుంతల వంటి మండలాలకు సాగునీటి సమస్య ఉండదు. ప్రధానంగా నల్లమలలో ఉండే అప్పాపూర్, లక్ష్మీపెళ్లి, సార్లపెళ్లి, కుడిచింతల, వటపర్లపల్లి వంటి చెంచుపెంటల్లో వేసవి కాలంలో తాగునీటికి విలవిల్లాడతారు. నీటి కోసం నల్లమలలో ఉండే ఊట కుంటలను ఆశ్రయిస్తారు. అనేకమంది అతిలోతైన కృష్ణా నదిలోని నీటిని కావడి ద్వారా తెచ్చుకుంటారు. సుమారు లక్ష ఎకరాలకు పైగా ఉండే సాగు భూములకు వర్షాధారమే దిక్కు.
సాగు, తాగునీరివ్వండి : లింగమయ్య, అప్పాపూర్
నల్లమల్ల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులతో సమానంగా జీవిస్తున్నాం. అడవిలో నీళ్లు లేక అవస్థలు పడుతున్నాం. సారవంతమైన భూములు ఉన్నా సాగునీరు లేదు. సాగు, తాగునీరు ఇవ్వాలి.
ఏజెన్సీ ప్రాంతాన్ని ఆదుకోవాలి : శంకర్ నాయక్, అచ్చంపేట
ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఏజెన్సీ ప్రాంతానికి సాగు, తాగు నీటిని అందివ్వాలి. ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నల్లమల్లకు నీటిని మళ్ళిస్తే తాగు, సాగు నీరు అందుతుంది. మాతో పాటు వన్యప్రాణులకూ దప్పిక తీరుతుంది. ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా ఆలోచన చేయాలి.



