Wednesday, April 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగాల బదిలీలపై నిషేధం ఎత్తివేత

ఉద్యోగాల బదిలీలపై నిషేధం ఎత్తివేత

- Advertisement -

ట్రాన్స్‌ఫర్లకు మే 1 నుంచి 31 వరకు అవకాశం… ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల ప్రక్రియ మే 1 నుంచి 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఒకే చోట మూడేండ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులు. అయితే నాలుగేండ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. 2027 మే 31కి ముందు ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులకు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు బదిలీని కోరుకునే అవకాశం వారికే కల్పిస్తారు. జీవిత భాగస్వామి ఆధారంగా కోరుకునే బదిలీలకు మూడేండ్ల నిబంధన వర్తించదని జీవోలో స్పష్టం చేశారు. ఏ ఒక్క క్యాడర్‌లో కూడా 40శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదు. బదిలీల ప్రక్రియ మొత్తం కౌన్సెలింగ్‌ పద్ధతిలో సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌/వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌ ద్వారా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే బదిలీల సమయం లో భార్యాభర్తలు (ఒకరికి మాత్రమే), ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారు, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాం గులైన పిల్లలున్న తల్లిదండ్రులు, వితంతువులు, క్యాన్సర్‌, న్యూరో సర్జరీ, కిడ్నీమార్పిడి, లివర్‌ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, బోన్‌ టీబీ వంటి వైద్య అవసరాలు కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. సెన్సస్‌ (జనాభా గణన) సంబంధిత పనుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించబోవని స్పష్టం చేసింది. బదిలీల ప్రక్రియను పర్యవేక్షిం చడానికి క్యాడర్‌ వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. స్టేట్‌, మల్టీ-జోనల్‌/జోనల్‌, జిల్లా స్థాయిల్లో అధికారుల నేతత్వంలో ఈ కమిటీలు పని చేయనున్నాయి.

బదిలీల షెడ్యూల్‌ వివరాలు
మే 1-7: బదిలీల విధివిధానాల ఖరారు. ఖాళీ పోస్టులు, తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేసి ప్రచురిస్తారు.
మే 8- 15: ఉద్యోగులు తమకు కావలసిన బదిలీ ప్రాంతాల కోసం ఆప్షన్లను సమర్పించాలి.
మే 16- 24: సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి బదిలీ విధానం ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం మాస్టర్‌ లిస్ట్‌ను సిద్ధం చేస్తారు.
మే 25-31: బదిలీ ఉత్తర్వుల జారీ. బదిలీ ఉత్తర్వులు వెలువడిన 3 రోజుల్లోపు ఉద్యోగులు విధుల నుంచి రిలీవ్‌ కావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -