Wednesday, April 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌కు ఓటెందుకెయ్యాలి?

కాంగ్రెస్‌కు ఓటెందుకెయ్యాలి?

- Advertisement -

సకల జనులను దగా చేసినందుకా…
ఓటుకు నోటు కేసులో రేవంత్‌ జైలుకెళ్లడం ఖాయం
కాళేశ్వరం, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుల కోసమే ఢిల్లీకి వెళ్లా : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌కు ప్రజలు మళ్లీ ఓటు ఎందుకు వేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా?, సకల జనులను దగా చేసినందుకా?, రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకు ఓటు వేయాలా? దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీనియర్‌ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామనీ, అందులో దాచిపెట్టేదేం లేదని చెప్పారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏ విధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందనీ, వచ్చేనెల ఆరో తేదీన హైకోర్టులో రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్‌ న్యాయవాదులను సంప్రదించడానికే ఢిల్లీకి వెళ్లామన్నారు. కాంగ్రెస్‌ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసి కూడా ఆయన ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటూ ఒక ఎమ్మెల్యే అనడం, దాన్ని స్పీకర్‌ ధ్రువీకరించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.

బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వస్తుందన్నారు. పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్‌ రెడ్డి అనీ, ఇప్పుడు హోంమంత్రిగా ఆయనే ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తరఫున నామమాత్రపు న్యాయవాదులను పెట్టి, వ్యక్తిగతంగా ఆయన తరఫున ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ్‌ లూద్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టుకున్నారని వివరించారు. ఈ ఓటుకు నోటు కేసులో బీఆర్‌ఎస్‌ తరఫున జగదీశ్‌రెడ్డి, సంజరు, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ ఇంప్లీడ్‌ అయ్యారని అన్నారు. నాడు సమైక్య వాదులతో చేతులు కలిపి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్‌ రెడ్డికి ఆ స్టే వెకేట్‌ అయిందంటే ముఖ్యమంత్రి సీటు ఊడటం, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. కేసీఆర్‌ ‘స్టేట్స్‌ మన్‌’ లాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే రేవంత్‌రెడ్డి ఆయన కుర్చీ కోసం ‘స్ట్రీట్‌ మన్‌’ లాగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సభకు పోటీగా అదే సమయానికి మైకు పట్టుకుని రేవంత్‌రెడ్డి సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్‌ వస్తున్నారని భయపడి డైవర్షన్‌ కోసం ఒక కిస్తీ రైతు భరోసా వేశారని చెప్పారు.

రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనీ, రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని నిన్నటిదాకా రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని ఒప్పుకున్నారనీ, రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టా?అని ప్రశ్నించారు. ఎన్ని డ్రామాలు ఆడినా రేవంత్‌రెడ్డికి నూకలు చెల్లాయనీ, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మెన్లు జి దేవీప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -