జీడీపీ 6 శాతమే
మూడీస్ కోత
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం భారత ఆర్థిక వ్యవస్థకు విఘాతంలా మారింది. పశ్చిమాసియాలోని యుద్ధ వాతావారణం జిడిపిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, ముడి పదార్థాల భారంతో భారత్ ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో దేశ వృద్ధి 6 శాతానికి క్షీణించొచ్చని తాజా రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇంతక్రితం వేసిన 6.8 శాతం అంచనాతో పోల్చితే భారీ తగ్గుదల నమోదు కానుంది. పెరిగిన ఇంధన ధరల వల్ల ప్రయివేటు వినియోగం తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడం ఇందుకు ప్రధాన కారణాలని మూడీస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
ప్రమాదకరంగా వాణిజ్య లోటు..
ఇంధన ధరలు ఎగిసిపడటంతో భారత్ వాణిజ్య లోటు పెరగనుందని మూడీస్ హెచ్చరించింది. తద్వారా ప్రభుత్వం ఇంధనం, ఎరువుల రాయితీల కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని మూడీస్ పేర్కొంది. ముఖ్యంగా భారత్ తన చమురు, గ్యాస్ అవసరాల కోసం పశ్చిమాసియా దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల సరఫరా వ్యవస్థలో ఆటంకాలు కలిగే ముప్పు ఉందని పేర్కొంది. కాగా.. దేశంలోని వ్యూహాత్మక చమురు నిల్వలు, వాణిజ్య నిల్వలు రాబోయే కొద్ది నెలల పాటు ఈ ముప్పును కొంతవరకు అడ్డుకోగలవని తెలిపింది.
ఆహార భద్రతకు పెను సవాల్..
సిమెంట్, కెమికల్స్, విమానయాన వంటి ఇంధన ఆధారిత పరిశ్రమలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అదే విధంగా నైట్రోజన్ ఆధారిత ఎరువుల కోసం భారత్ గల్ఫ్ దేశాలపై ఆధారపడటం వల్ల అక్కడ సరఫరా దెబ్బతింటే వ్యవసాయ రంగం, ఆహార భద్రతకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని మూడీస్ తెలిపింది. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీ నగదు బదిలీలలో మూడింట ఒక వంతు మధ్యప్రాచ్యం నుంచే వస్తున్నందున అక్కడ ఆర్థిక అనిశ్చితి నెలకొంటే దేశ కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగి.. రూపాయి విలువ క్షీణించే ప్రమాదం ఉందని మూడీస్ హెచ్చరించింది. సకాలంలో సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చని మూడీస్ సూచించింది.
వృద్ధి మందగించొచ్చు : ఐరాస
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.4 శాతం, 2027లో 6.6 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తాజా నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (ఈఎస్‌సీఏపీ) విడుదల చేసిన ‘ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ పసిఫిక్ 2026’ నివేదిక ప్రకారం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పటిష్టమైన వినియోగం, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటి సానుకూల అంశాల వల్ల 2025లో భారత వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుకుంది. అయితే.. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా 2025 ద్వితీయార్థంలో ఎగుమతులు తగ్గడంతో వృద్ధి మందగించినట్టు నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా 137 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను (రెమిటెన్స్) అందుకుంటున్న భారత్‌పై అమెరికా 2026 జనవరి నుంచి విదేశీ బదిలీలపై విధిస్తున్న 1 శాతం పన్ను ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.



