– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి
– సత్తుపల్లిలో ఘనంగా ఏచూరి 2వ వర్ధంతి సభ
నవతెలంగాణ-సత్తుపల్లి
సీపీఐ(ఎం) పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు సీతారాం ఏచూరి జీవితం ఆయన ఉద్యమ చరిత్ర, పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి అన్నారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల భవన్)లో శనివారం పార్టీ పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సభలో మాచర్ల భారతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏచూరి చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన ఏచూరి సంతాప సభలో భారతి మాట్లాడారు.
భారత రాజకీయాల్లో ఏచూరి కీలక పాత్ర పోషించారని, విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగి నిరంతరం శ్రామిక జీవుల కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను బలవంతంగా అమలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల ఉదాహరణలను చూసి ప్రధాని మోడీ తెలుసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని హెచ్చరించారు.
పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు మాట్లాడుతూ..అణగారిన వర్గాల అభ్యున్నతికి పార్లమెంటులో గొంతుకై నిలిచిన గొప్ప దార్శనికుడు, మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టాలు రావడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారని, ఆయన స్ఫూర్తితో ప్రజాపోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మాచర్ల గోపాల్, చావా రమేష్, మోరంపూడి వెంకట్రావు, ఓలేటి శ్రీహరి, చెరుకూరి శ్రీనివాస్, గుదే రాము, వలి, భాస్కర్, వెంకటేశ్వరరావు, జిలాని, రఫీ, రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



