Sunday, September 13, 2026
E-PAPER
Homeజోష్లోకల్‌ టాలెంట్‌తోనే ‘కొత్త సినిమా’ తీశాం

లోకల్‌ టాలెంట్‌తోనే ‘కొత్త సినిమా’ తీశాం

- Advertisement -

సినిమా అంటే హైదరాబాద్‌.. స్టూడియోలు, భారీ సెట్లు, స్టార్‌ హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలు.. సాధారణంగా తెలుగు సినిమా గురించి మాట్లాడినప్పుడు కనిపించే దృశ్యం ఇదే. అయితే ప్రతిభ ఉంటే పల్లె గల్లీల నుంచైనా వెండితెరపై అడుగుపెట్టొచ్చునని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు రామగుండం–గోదావరిఖని ప్రాంతానికి చెందిన యువ దర్శకుడు అజర్‌. సింగరేణి బొగ్గుబావుల నుంచి వచ్చిన ఆయన స్థానిక ప్రతిభను గుర్తించి, వారికి అవకాశం కల్పిస్తూ రూపొందించిన చిత్రమే ‘కొత్త సినిమా’. టైటిల్‌లోనే కొత్తదనం ఉన్న ఈ చిత్రం నిర్మాణంలోనూ అంతకుమించిన ప్రయోగం కనిపిస్తుంది.
‘మన ఊర్లోనే ఉంటూ.. మన ఊరి వాళ్లతోనే సినిమా తీయొచ్చు’ అనే ఆలోచన అజర్‌ ప్రయాణానికి పునాది. కొత్తవాళ్లకు అవకాశాలు రావడం లేదని బాధపడకుండా, వాటి కోసం ఎదురుచూడకుండా తానే ఒక వేదిక సృష్టించుకున్నారు. నటనతో పాటు సినిమా నిర్మాణంలోని వివిధ సాంకేతిక విభాగాలపై ఆసక్తి ఉన్న యువతను కూడా ప్రోత్సహించారు. సినిమా అనేది ఒక నగరానికే పరిమితమైన కళ కాదని, ప్రతి ప్రాంతంలోనూ కథలు ఉంటాయని, ప్రతి మనిషిలోనూ ఒక ప్రతిభ దాగుంటుందని అజర్‌ నమ్ముతున్నారు.

బొగ్గుబాయి నుంచి సినిమా ప్రపంచానికి
అజర్‌ ప్రయాణంలో మరో ప్రత్యేకత ఉంది. టెక్నీషియన్‌గా పనిచేస్తూనే సినీ రంగంపై ఉన్న ఆసక్తితో తన ప్రయాణాన్ని కొనసాగించారు. బొగ్గును వెలికితీసే నేల నుంచి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘మేము కింద స్థాయి నుంచి వచ్చామని చాలామంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి.. భూమి లోతుల్లోంచి, బొగ్గుబాయి నుంచి వచ్చాం. చీకటిలో బొగ్గును వెలికితీసే ప్రాంతం నుంచి వెలుగు పంచేందుకు వచ్చాం’ అనే అజర్‌ మాటల్లో ఆయన నేపథ్యం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి. సింగరేణి కార్మిక కుటుంబాల జీవనాన్ని దగ్గరగా చూసిన అనుభవం ఆయన ఆలోచనలకు బలమైంది. తన ప్రాంతంలోని సామాన్య ప్రజల జీవితాలు, వారి కలలు, వారి ప్రతిభకు సినిమాలో చోటు కల్పించాలనే పట్టుదలతో ముందుకు సాగారు.

కథే హీరో.. ప్రతిభే బలం : పెద్ద హీరోలు లేకపోయినా కథలో బలం ఉంటే ప్రేక్షకులను మెప్పించొచ్చునని అజర్‌ నమ్మారు. అదే నమ్మకంతో కొత్త నటీనటులతో ‘కొత్త సినిమా’ను రూపొందించారు. సురేశ్‌, రాకేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంతో పాటు ఎడిటింగ్‌ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. మహమ్మద్‌ వాసిమ్‌ అక్రమ్‌, సాగి సుధీర్‌రావు, యడండ్ల సతీష్‌యాదవ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఒకే వ్యక్తి కథ నుంచి ఎడిటింగ్‌ వరకు పలు బాధ్యతలు చేపట్టడం వెనుక తన ఆలోచనను పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకురావాలనే పట్టుదల ఉందని అజర్‌ చెబుతున్నారు.
మూడేండ్ల కష్టం
‘కొత్త సినిమా’ ఒక్కరోజులో పుట్టిన ఆలోచన కాదు. దాదాపు మూడేండ్లుగా చిత్రబృందం ఈ సినిమా కోసం కష్టపడింది. కొత్తవాళ్లతో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు తొలుత చాలామంది నమ్మలేదని అజర్‌ చెబుతున్నారు. ‘కొత్తవాళ్లం కదా.. ఎవరూ నమ్మలేదు. అయినా మా ఊర్లోనే ఆడిషన్స్‌ నిర్వహించి టాలెంట్‌ ఉన్నవారిని ఎంపిక చేసుకున్నాం. సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం’ అని ఆయన అంటున్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా చిత్రబృందాన్ని ముందుకు నడిపించారు.

తండ్రి త్యాగం
అజర్‌ సినీ ప్రయాణంలో ఆయన తండ్రి హుస్సేన్‌ పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. సింగరేణి ఉద్యోగిగా నాలుగు దశాబ్దాలపాటు కష్టపడి సంపాదించిన డబ్బును తన కుమారుడి కల కోసం ఖర్చు చేశారు. తన కలను నమ్మిన తండ్రి పీఎఫ్‌ డబ్బులను కూడా సినిమా నిర్మాణానికి ఉపయోగించారని ప్రచార కార్యక్రమాల్లో అజర్‌ భావోద్వేగంతో గుర్తుచేసుకుంటున్నారు. ‘మా నాన్న హుస్సేన్‌గారు రియల్‌ హీరో. తన కొడుకు కలను నమ్మి డబ్బు ఖర్చు పెట్టి రిస్క్‌ చేశారు’ అని అన్నారు. తెరపై కనిపించేది సినిమా అయినా, దాని వెనుక కుటుంబం, స్నేహితులు, స్థానిక యువత, ఎన్నో ఆశలు, మరెన్నో త్యాగాలు ఉన్నాయని ఈ ప్రయాణం చెబుతోంది.
‘వై ఇన్‌ హైదరాబాద్‌.. వై నాట్‌ ఇన్‌ అవర్‌ ప్లేస్‌’ : సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ‘వై ఇన్‌ హైదరాబాద్‌.. వై నాట్‌ ఇన్‌ అవర్‌ ప్లేస్‌’ అనే కాన్సెప్ట్‌ను తీసుకురావడం అజర్‌ ఆలోచనలోని ప్రత్యేకతను చాటింది. ‘హైదరాబాద్‌లోనే ఎందుకు? మా ఊర్లో ఎందుకు కాదు?’ అనే ప్రశ్నకు ఈ కార్యక్రమం ఒక సమాధానంగా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్‌ కంటెంట్‌, పోస్టర్లను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆవిష్కరించారు. ‘మేము కూడా సినిమా తీసినంరో’ పాట లాంచ్‌ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్రబృందాన్ని అభినందించారు.

అజర్‌ సినీ అరేనా
సినిమా నిర్మాణాన్ని ఒకే చిత్రంతో ఆపేయాలనే ఆలోచన అజర్‌కు లేదు. గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీ కేంద్రంగా ‘అజర్‌ సినీ అరేనా’ పేరుతో ప్రొడక్షన్‌, క్రియేటివ్‌ వేదికను నిర్వహిస్తూ స్థానిక ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నారు. నటన, రచన, దర్శకత్వం, ఎడిటింగ్‌, ఇతర సాంకేతిక విభాగాలపై ఆసక్తి ఉన్న యువతకు ఒక వేదికగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ప్రేక్షకుల తీర్పు కోసం…
పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ‘కొత్త సినిమా’ త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సింగరేణి గడ్డపై స్థానిక ప్రతిభతో రూపొందిన ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందన్నది ఆసక్తికరం. బాక్సాఫీస్‌ ఫలితం ఎలా ఉన్నా… వంద మందికి పైగా కొత్తవారికి అవకాశం కల్పించడం, ‘మన ఊరిలోనే సినిమా తీయొచ్చు’ అనే నమ్మకాన్ని నాటడం మాత్రం ‘కొత్త సినిమా’ సాధించిన ముఖ్యమైన విజయం. బొగ్గుబాయి చీకట్ల నుంచి సినిమా తెర వెలుగుల వైపు సాగిన అజర్‌ ప్రయాణం.. అక్కడి నుంచి మరెంతమంది స్థానిక ప్రతిభావంతుల కలలకు దారి చూపుతుందో చూడాలి.

యడవల్లి శ్రీనివాసరావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -