Saturday, August 29, 2026
E-PAPER
Homeజోష్రాపిడో రైడర్‌ నుంచి టెక్‌ లీడర్‌ వరకు..

రాపిడో రైడర్‌ నుంచి టెక్‌ లీడర్‌ వరకు..

- Advertisement -

​యువత కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమిస్తోంది. ‘ఈ లోకం మీదేనండి’ అన్న శ్రీశ్రీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని తమ ప్రతిభతో ప్రపంచానికి పరిచయమవుతోంది. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పత్తిపాటి గణేష్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే ఉన్నత చదువులు చదివాడు. యూట్యూబర్‌గా కొనసాగుతూ సాఫ్ట్‌వేర్‌ రంగంలో అడుగుపెట్టి, వెంకటాచలంపల్లి నుంచి అమెరికా వరకు తన దారిని తానే నిర్మించుకున్నాడు. ఆ నాన్న పాదాలు బురదలో నడిస్తే.. ఇప్పుడు కొడుకు పాదాలు కార్పొరేట్‌ కంపెనీల్లో నడుస్తున్నాయి. ఆ అమ్మ చేతులు మట్టిలో కష్టపడితే.. కొడుకు చేతులు కంప్యూటర్‌ కీబోర్డుపై కదులుతున్నాయి. పాతికేళ్ల గణేష్‌ ప్రయాణమే నేటి ‘జోష్‌’…

​చదువు పెద్దగా లేని మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గణేష్‌.. వెంకటాచలంపల్లిలో ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. ‘ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మట్టిలో కష్టపడినా.. నా పిల్లల భవిష్యత్తు మాత్రం ఈ మట్టికే పరిమితం కాకూడదు’ అన్న తండ్రి మాటలు అతనికి స్ఫూర్తిగా నిలిచాయి. గుంటూరులో పదో తరగతి, విజయవాడలో ఇంటర్‌, అనంతరం గుంటూరు హిందూ కాలేజీలో బీఏ ఎకనామిక్స్‌ పూర్తి చేశాడు. డిగ్రీ తర్వాత తల్లిదండ్రులపై భారం వేయకూడదని తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలని హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడి నుంచే అతని జీవితంలో మరో కీలక మలుపు మొదలైంది.

​యూట్యూబ్‌తో ప్రయాణం
హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో గణేష్‌ రాపిడో బైక్‌ రైడర్‌గా, స్విగ్గి డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగించాడు. ఎండా, వానా లెక్కచేయకుండా రోజువారీ ఖర్చులకు సరిపడా సంపాదించుకుంటూనే తనలోని మరో కలను సాకారం చేసుకునేందుకు కృషి చేశాడు. తాను చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, విద్యార్థులకు సరైన సమాచారం, సులభంగా అర్థమయ్యే పాఠాలు అందుబాటులో లేకపోవడం అతడిని ఆలోచింపజేశాయి. ‘తాను నేర్చుకున్నది మరో విద్యార్థికి ఉపయోగపడితే?’ అనే ఆలోచనతో PGN Educationకు శ్రీకారం చుట్టాడు. హాస్టల్‌ గదిలో ఫోన్‌తోనే వీడియోలు రూపొందిస్తూ, అందరూ నిద్రపోయిన తర్వాత రికార్డింగ్‌, ఎడిటింగ్‌, అప్‌లోడింగ్‌ చేసేవాడు. దాదాపు రెండేళ్ల నిరంతర కృషితో PGN Educationకు గుర్తింపు లభించింది. లక్షకుపైగా సబ్‌స్క్రైబర్లు చేరడంతో పాటు, విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. చివరకు YouTube Silver Creator Award అందుకునే స్థాయికి చేరాడు. మరింత మంది విద్యార్థులకు చేరువ కావాలనే ఉద్దేశంతో PGN Education మొబైల్‌ యాప్‌ ప్రారంభించాడు. Classplus నుంచి Silver-level గుర్తింపు పొందాడు.

అమెరికా కల
PGN Educationకు గుర్తింపు వస్తున్న సమయంలోనే గణేష్‌లో మరో కల బలపడింది.. ఇంకా చదవాలి, ప్రపంచాన్ని చూడాలి, టెక్నాలజీని మరింత లోతుగా నేర్చుకోవాలి. ఇందుకోసం ఎన్నో కన్సల్టెన్సీలను సంప్రదించి, అవసరమైన పరీక్షలు రాశాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఆ కష్టకాలంలో స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం అతనికి ఎంతో అండగా నిలిచింది. ముఖ్యంగా రజియా అందించిన ఆర్థిక, మానసిక సహకారం తనలో మళ్లీ నమ్మకాన్ని నింపిందని గణేష్‌ చెబుతున్నాడు. ‘వైఫల్యం ప్రయాణానికి ముగింపు కాదు.. మరో ప్రయాణానికి నేర్పే పాఠం’ అనే నమ్మకంతో మళ్లీ ప్రయత్నించాడు. రెండో ప్రయత్నంలో విదేశాలకు వెళ్లిన గణేష్‌.. కొత్త దేశం, కొత్త సంస్కృతి, ఒంటరితనం, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ దాదాపు రెండేళ్ల కృషితో Sacred Heart Universityలో Business Analyticsలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు.

​ఆశయం కోసం
మాస్టర్స్‌ పూర్తయ్యాక మంచి ఉద్యోగం, జీతంతో స్థిరపడటమే చాలామంది లక్ష్యం. కానీ గణేష్‌కు ఉద్యోగం ఒక మార్గం మాత్రమే. అమెరికాలోని Macro Tech కంపెనీలో Business Analyticsగా చేరి, మూడేళ్లలోనే టీమ్‌ లీడర్‌ స్థాయికి ఎదిగాడు. ఉద్యోగానికే పరిమితం కాకుండా, టెక్నాలజీతో సమస్యలకు పరిష్కారాలు రూపొందించి లక్షలాది మందికి ఉపయోగపడే టెక్నాలజీ లీడర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. PGN Education ద్వారా గుర్తించిన విద్యార్థుల Social Media Distraction సమస్యకు పరిష్కారంగా Focus Pet అనే AI ఆధారిత మొబైల్‌ యాప్‌ను రూపొందించాడు. డిజైన్‌ నుంచి డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌, బగ్‌ ఫిక్సింగ్‌ వరకు స్వయంగా పనిచేశాడు. భవిష్యత్తులో PGN Educationను కేవలం పాఠాలు చెప్పే వేదికగా కాకుండా.. నైపుణ్యాలు, కెరీర్‌ మార్గదర్శకత్వం, టెక్నాలజీ పరిజ్ఞానం, గ్లోబల్‌ అవకాశాలను అందించే Technology-driven Education Platformగా తీర్చిదిద్దాలని గణేష్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

అవకాశాల విలువను నేర్పిన రోజులు
ఒకప్పుడు రాపిడో, స్విగ్గీ డెలివరీలు చేసిన రోజులు తనకు అవకాశాల విలువను నేర్పాయని గణేష్‌ చెబుతున్నాడు. అందుకే PGN Technologies, PGN Educationను మరింత విస్తరించి యువతకు ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, టెక్నాలజీలో పనిచేసే అవకాశాలు కల్పించాలని, గ్లోబల్‌ లీడర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనొక్కడే కాకుండా.. తన ద్వారా మరెందరో విద్యార్థులు ఎదగాలని, కొందరు వ్యాపారవేత్తలుగా, మరికొందరు టెక్నాలజీ లీడర్లుగా, ఇంకొందరు ప్రపంచస్థాయి అవకాశాలను అందుకునేలా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాడు. విద్యార్థులను కేవలం ఉద్యోగాలకు సిద్ధం చేయకుండా.. ఆలోచించే, సమస్యలను పరిష్కరించే నిపుణులుగా తీర్చిదిద్దాలన్నదే అతని ఆశయం. రైతు కుటుంబం నుంచి వచ్చిన గణేష్‌.. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ దాటి అమెరికాలో టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. ఒకప్పుడు అవకాశాల కోసం వెతికిన అతను.. ఇప్పుడు ఇతరులకు అవకాశాలు సృష్టించే స్థాయికి ఎదగాలని కలలు కంటున్నాడు.​

పేర్ల రాము
9642570294

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -