Sunday, September 13, 2026
E-PAPER
Homeప్రత్యేకంగత వర్తమానాల ట్రయాలజీ..ఒక రంగస్థల త్రయం

గత వర్తమానాల ట్రయాలజీ..ఒక రంగస్థల త్రయం

- Advertisement -

ఏ కళారూపమైనా సమస్యను కేవలం ఉపరితలం మీంచి మాత్రమే తడమకూడదు, చర్చించాలి. ప్రేక్షకుడినో పాఠకుడినో అతని స్థానంలో ప్రశాంతంగా కూర్చోనివ్వకుండా, అతని విశ్వాసాలనూ విలువలనూ ప్రశ్నల ముందు నిలబెట్టాలి. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఖమ్మంలో మూడు రోజులు వరుసగా ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’, ‘సత్య దర్శనం’, ‘బుద్ధునితో నా ప్రయాణం’ ఈ కోవకు చెందిన నాటికలు. వీటిని మూడు విడివిడి ప్రదర్శనలుగా చూడటం కంటే, ఒకే ఆలోచన మూడు దశల్లో సాగుతున్న నాటక త్రయంగా చూడటం సముచితం. మొదటిది మనిషిని సమాజం మధ్య నిలబెడితే, రెండోది సత్యం ముందు నిలబెడుతుంది. మూడోది తనను తానే ఎదురుగా నిలబెడుతుంది.

రంగస్థలం మీద బుద్ధుడినో అంబేద్కర్‌‌నో నిలబెట్టడం సులభమే. కానీ వాళ్ల ముందు వర్తమాన సమాజాన్ని నిలబెట్టడం కష్టం. వాళ్ల జీవితాలను దృశ్యాలుగా పునర్నిర్మించడం ఒక పని. వాళ్ల ఆలోచనను సమకాలీన మనిషి అంతరంగంలోకి పంపించడం మరో పని. మొదటిది చరిత్రను ప్రదర్శిస్తుంది. రెండోది చరిత్రతో వర్తమానాన్ని ప్రశ్నిస్తుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ప్రదర్శిస్తున్న దేవేంద్ర నాటికలు ఈ రెండో ప్రయత్నానికి అర్ధంగా నిలుస్తాయి. తూము రవీందర్ దర్శకత్వంలో రంగస్థల రూపం పొందిన ఈ మూడు నాటికలనూ విడివిడిగా చూసే కంటే, ఒకే తాత్విక ప్రశ్నలోపలి మూడు పొరలుగా చూడటం అవసరం.

నైతిక ప్రమాణంగా…
మొదటి నాటిక సమాజంలో మనిషి స్థానాన్ని వెతుకుతుంది. రెండోది అతని విశ్వాసాల పొరలను తొలగించి సత్యం ముందు నిలబెడుతుంది. మూడోది చివరకు అతన్ని అతని అంతరంగంలోకి తీసుకువెళుతుంది. ఈ మూడు నాటికలను కలిపే అంతస్సూత్రం అంబేద్కర్ మాత్రమే కాదు. అంబేద్కర్ ద్వారా ఫూలే, బుద్దుడి మీదుగా మనిషిని పునర్విర్వచించాలనే తపన. ఈ మూడు రచనల వెనుక ఒక ఉమ్మడి భావప్రపంచం ఉంది. కుల నీర్మూలన, దు:ఖ నివారణ, బౌద్ధం, సామాజిక న్యాయం, మానవీయత, హేతువు, సమానత్వం వంటి భావనలు దాని కేంద్రంలో ఉన్నాయి. అయితే వీటిని కేవలం కులాన్ని వ్యతిరేకించే నాటికలు అనడం వాటి పరిధిని తగ్గించడమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బుద్ధుడైనా అంబేద్కరైనా ఒక మత చిహ్నం కంటే మనిషిని కొలిచే నైతిక ప్రమాణంగా పనిచేస్తారు.

చరిత్రను వర్తమానంలోకి
దేవేంద్ర రచనలో కనిపించే మరో ముఖ్య లక్షణం చరిత్రను వర్తమానంలోకి తీసుకురావాలనే తపన. చారిత్రక లేదా తాత్విక అంశాలతో నాటకం రాస్తున్నప్పుడు రచయితకు రెండు ప్రమాదాలు ఉంటాయి. ఒకటి చరిత్ర పాఠంలా మారడం. రెండోది భావజాల ప్రకటనగా మిగిలిపోవడం. నాటకం ఈ రెండింటినీ దాటి వెళ్లాలంటే ఆలోచనకు శరీరం కావాలి. ఆ శరీరమే పాత్ర. ఆలోచనకు కదలిక కావాలి. అదే సంఘర్షణ. ఆలోచనకు శ్వాస కావాలి. అదే సంభాషణ. ఈ త్రయంలో రచయిత చేస్తున్న ప్రధాన ప్రయత్నం అదే తత్వాన్ని రంగస్థల భాషలోకి అనువదించడం. ఈ మూడు నాటికలను కలిపి చూసినప్పుడు మనిషి ఎవరితో కలిసి జీవించాలి? సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? బుద్ధుడితో ప్రయాణమంటే ఏమిటి? అనే మూడు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఉంటుంది. కానీ కొంచెం లోతుగా వెళితే మూడింటి వెనుకా ఒకే ప్రశ్న వినిపిస్తుంది. మనిషి మరింత మనిషిగా ఎలా మారగలడు? అనేదే ఆ ప్రశ్న.

మతపరమైన ఉచ్చారణగా మిగలదు
సంఘం మనిషికి మరొక మనిషి అవసరమని చెబుతుంది. సత్యం తన విశ్వాసాలను కూడా అనుమానించమంటుంది. బుద్ధుడు తనలోని హింసను చూసుకోమంటాడు. అప్పుడు ‘బుద్ధం శరణం గచ్చామి’ ఒక మతపరమైన ఉచ్చారణగా మిగలదు. ‘సంఘం శరణం గచ్చామి’ అనే పేరులోనే మొదటి నాటిక తన రాజకీయ, తాత్విక స్వభావాన్ని ప్రకటిస్తుంది. ‘శరణం’ అనే మాటను కేవలం ఆధ్యాత్మిక ఆశ్రయంగా తీసుకుంటే ఈ నాటిక పరిధి చిన్నదైపోతుంది. ఇక్కడ శరణం అంటే లొంగిపోవడం కాదు. తన అహం నిర్మించుకున్న గోడలను దాటి మరొక మనిషి దగ్గరకు చేరడం. కానీ సమానత్వాన్ని మనిషి ఒంటరిగా నిర్మించలేడు. సామూహిక ఆచరణ. అందుకే ‘సంఘం’ ఇక్కడ ఒక మత వ్యవస్థగా కాకుండా సమాన మనుషుల సహజీవనానికి ప్రతిపాదనగా కనిపిస్తుంది. ఈ అర్థంలో దేవేంద్ర బౌద్ధాన్ని గతంలో ఉంచడం లేదు. దాన్ని వర్తమానంలోకి తీసుకొస్తున్నారు.

ఒక సామూహిక కళానుభవం
కులం మనిషిని మనిషి నుంచి వేరు చేస్తున్నప్పుడు, వర్గం అవకాశాలను అసమానంగా పంచుతున్నప్పుడు, మతం ఒక్కోసారి ఆధ్యాత్మికతను దాటి అధికార రూపం తీసుకుంటున్నప్పుడు ‘సంఘం’ అనే రెండున్నర వేల ఏండ్ల నాటి భావన అకస్మాత్తుగా సమకాలీన పదంగా మారుతుంది. ఇదే ఈ రచనలోని అభ్యుదయ కోణం. అక్కడ ‘శరణం’ అనే మాటకూ కొత్త అర్థం వస్తుంది. అది పారిపోయి ఆశ్రయం పొందడం కాదు. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, అహం నుంచి సహజీవనంలోకి, ఆధిపత్యం నుంచి సమానత్వంలోకి, హింస నుంచి కరుణలోకి, ‘నేను’ నుంచి ‘మనం’లోకి చేసే ప్రయాణమే శరణం. దేవేంద్ర ఆ ప్రయాణానికి అక్షరాలు సమకూర్చారు. తూము రవీందర్ ఆ అక్షరాలకు రంగస్థల శరీరాన్ని ఇచ్చారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ దాన్ని ఒక సామూహిక కళానుభవంగా మార్చింది.

సామాజిక ప్రశ్నగా
‘సంఘం శరణం గచ్చామి’ సమాజం వైపు చూపు. ‘సత్య దర్శనం’ సత్యం వైపు చూపు. ‘బుద్ధునితో నా ప్రయాణం’ అంతరంగం వైపు చూపు. అంటే బయట మొదలైన ప్రయాణం చివరకు లోపలికి చేరుతుంది. అందుకే ఇక్కడ ఫూలే కాలంలో అంబేద్కర్ ప్రస్తావన ఎలా అనే ప్రశ్న అర్దం కోల్పోతుంది. బుద్ధుడిని దేవుడిని చేయడం కన్నా, అంబేద్కర్‌ను పునర్నిర్వచించడం కన్నా వాళ్లను ఒక సామాజిక ప్రశ్నగా నిలబెట్టడం ముఖ్యమైన విషయం. ఎందుకంటే విగ్రహంగా మారిన బుద్ధుడు మనల్ని ఇబ్బంది పెట్టడు. ప్రశ్నగా మారిన బుద్ధుడే మన ప్రశాంతతను, అంబేద్కర్ ప్రశాంతతనూ భగ్నం చేస్తాడు. ‘సత్య దర్శనం’ రచన మరింత తాత్వికమైన ప్రదేశంలోకి ప్రవేశిస్తుంది. సత్యం అంటే ఏమిటి? కళ్లకు కనిపించేదా? సమాజం అంగీకరించేదా? అధికారం ప్రకటించేదా? తరతరాలుగా మనకు చెపుతున్నదా? లేక వీటన్నింటినీ సందేహించిన తర్వాత మిగిలేదా? ‘దర్శనం’ అనే పదంలోనే ఒక వైరుధ్యం ఉంది. దర్శనం అంటే చూడటం. కానీ సత్యం ఎప్పుడూ నేరుగా కనిపించదు. దాని మీద సంప్రదాయం ఉంటుంది. భయం ఉంటుంది. అధికారం ఉంటుంది. వ్యక్తిగత ప్రయోజనం ఉంటుంది. విశ్వాసం ఉంటుంది.

బుద్ధుడితో ప్రయాణించడమంటే?
సాహిత్యానికి సిద్ధాంతం అవసరమే. కానీ సిద్ధాంతం సాహిత్యంగా మారాలంటే దానికి రక్తమాంసాలు కావాలి. సందేహం కావాలి. వైరుధ్యం కావాలి. ఓటమి కావాలి. మౌనం కావాలి. సత్యం గురించి చెప్పడం కన్నా సత్యాన్ని వెతుకుతున్న మనిషి తడబాటును చూపించడమే గొప్ప నాటకీయత. అది దేవేంద్ర నాటకాల్లో స్పష్టంగా జరిగింది. ఈ త్రయంలో అత్యంత వ్యక్తిగతమైన భావజాలం ‘బుద్ధునితో నా ప్రయాణం’. ఇందులో ‘బుద్ధుడు’ ఎంత ముఖ్యమైన పదమో ‘నా’ కూడా అంతే ముఖ్యం. మొదటి రెండు నాటికల్లో సామాజికంగా, తాత్వికంగా సాగిన అన్వేషణ ఇక్కడ వ్యక్తి అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. బుద్ధుడు ఇక చరిత్రలోని మహాపురుషుడు మాత్రమే కాదు, మన పక్కన నడిచే సహప్రయాణికుడు అంటుంది. అసలు బుద్ధుడితో ప్రయాణించడం అంటే ఏమిటి? బోధ్‌గయకు వెళ్లడమా? ఆయన జీవితంలోని ప్రదేశాలను దర్శించడమా? ఆయన బోధనలను వల్లెవేయడమా? కాదు. మనలోని కోపంతో కొంతదూరం నడవడం. మన అహాన్ని వెనక్కి తిరిగి చూడటం. మనం అనుభవించిన దుఃఖంతో పాటు మన వల్ల మరొకరు అనుభవించిన దుఃఖాన్ని కూడా గుర్తించడం. మనలో దాగి ఉన్న చిన్న చిన్న ఆధిపత్యాలను కనిపెట్టడం. అప్పుడు బుద్ధుడితో ప్రయాణం నిజానికి బుద్ధుడి దగ్గరకు చేసే ప్రయాణం కాదు, తనలోపలి మనిషి దగ్గరకు చేసే ప్రయాణం. ఇక్కడే మూడు నాటికలు ఒక వృత్తాన్ని పూర్తి చేస్తాయి. మొదట మనిషి సంఘంలోకి వెళ్తాడు. తర్వాత సత్యం ముందు నిలబడతాడు. చివరకు తనలోకి తాను ప్రవేశిస్తాడు. బయట ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరిన మనిషిని చివరకు రచయిత అతని అంతరంగం దగ్గర నిలబెడతాడు. ఎందుకంటే అంతరంగంలో ఆధిపత్యాన్ని మిగుల్చుకొని బయట సమానత్వం గురించి మాట్లాడటం ఒక వైరుధ్యం. తనలో హింసను దాచుకొని ప్రపంచానికి అహింస బోధించడం మరో వైరుధ్యం. ఈ వైరుధ్యాల దగ్గరే బుద్ధుడు సమకాలీనుడవుతాడు.

‌నాటకం భిన్నమైనది
నాటకం ఇతర సాహిత్య ప్రక్రియలకంటే భిన్నమైనది. కథ చదివినప్పుడు పాఠకుడు తనలో దృశ్యాన్ని నిర్మించుకుంటాడు. నాటకంలో ఆ దృశ్యాన్ని దర్శకుడు నిర్మించి ప్రేక్షకుడి ముందు ఉంచాలి. అందుకే నాటక రచయిత పెట్టిన ఫుల్ స్టాప్‌తో రచన పూర్తికాదు. అక్కడి నుంచి దర్శకుడి భావజాల వ్యాప్తి మొదలవుతుంది. దేవేంద్ర రాసిన తాత్విక భావనలకు రంగస్థల శరీరాన్ని ఇవ్వడమనే సవాలును తూము రవీందర్ విజయవంతంగా అధిగమించారు. ముఖ్యంగా ఆలోచన ప్రధానమైన నాటకాలకు దర్శకత్వం వహించేటప్పుడు ‘మాట’ భారాన్ని ‘దృశ్యం’ మోయాలి. పాత్రలు నిరంతరం భావాలను వివరిస్తూ పోతే ప్రేక్షకుడు నాటకాన్ని చూడడు. ఉపన్యాసాన్ని వింటాడు. అందుకే కదలిక, వెలుతురు, పాత్రల మధ్య దూరం, వేదిక మీద ఖాళీ ప్రదేశం, సంగీతం, నిశ్శబ్దం అన్నీ కలిసి మరో సంభాషణను సృష్టించాలి.

భావానికి కొనసాగింపు
ఒకే తాత్విక భూమిక నుంచి వచ్చిన మూడు రచనలకు విడివిడిగా దృశ్య స్వభావాన్ని కల్పిస్తూనే, వాటి మధ్య ఉన్న అంతస్సంబంధాన్ని చెదరనివ్వకుండా చూడటం ఈ ప్రయోగంలోని కీలకాంశం. ఈ మూడు నాటికలు ఆ కీలకాంశాలకు అద్దాలుగా నిలిచాయి. మంచి నాటకంలో ఖాళీ స్థలం కూడా మాట్లాడాలి. బౌద్ధ తాత్వికతను ఆధారంగా చేసుకున్న రంగస్థలానికి ఆడంబరం కంటే నిరాడంబరత సహజంగా దగ్గరవుతుంది. అందువల్ల ఇక్కడ రంగస్థల నిర్వహణ కేవలం సెట్స్, వస్త్రాలు, లైట్ల సాంకేతిక వ్యవహారం కాదు. అది నాటకంలోని భావానికి కొనసాగింపు. వేదిక మీద పెట్టిన వస్తువు ఎంత మాట్లాడుతుందో, పెట్టకుండానే ఏర్పడ్డ ఖాళీ స్థలం కూడా అంతే మాట్లాడగలదు. ఒక పాత్ర నుంచి మరో పాత్ర మధ్య ఉన్న నాలుగు అడుగుల దూరం కూడా కులం, అధికారం, ఒంటరితనం, పరాయీకరణలకు రూపకం కావచ్చు.

ప్రశ్నగా స్వీకరించడం…
ఈ నాటక త్రయంలో సంగీతం ప్రేక్షకుడికి ‘ఇప్పుడు బాధపడాలి’ అని ఆదేశించకుండా, పాత్రలోని భావానికి అంతర్లీన లయగా ప్రతిధ్వనిస్తుంది. తాత్విక నాటకంలో అన్నిటికంటే విలువైన రంగస్థల సాధనం బహుశా మౌనమే. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సంభాషణ సమాధానం చెప్పగలదు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సమాధానంగా మిగలాలి. అభ్యుదయం అంటే నిరంతర పునర్విచారణ. ఈ నాటక త్రయాన్ని ప్రదర్శిస్తున్న సంస్థ పేరు ‘అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ’ కావడం కూడా ఈ సందర్భంలో ఒక ప్రత్యేక అర్థాన్ని సంతరించుకుంటుంది. ‘అభ్యుదయం’ అనే పదాన్ని ఒక నిర్దిష్ట కాలానికి, ఒక రాజకీయ పరిభాషకు పరిమితం చేయలేం. ప్రతి కాలంలో అభ్యుదయానికి తన ప్రశ్నలు ఉంటాయి. ఒకప్పుడు భూస్వామ్యాన్ని ప్రశ్నించడం అభ్యుదయం. దోపిడీని ఎదిరించడం అభ్యుదయం. ఇప్పుడు వాటితోపాటు కులాన్ని ప్రశ్నించడం, మత ఛాందసత్వాన్ని నిరాకరించడం, వ్యక్తి గౌరవాన్ని కాపాడటం, మనలోని ఆధిపత్యాన్ని గుర్తించడం, భిన్నత్వంతో సహజీవనం చేయడం కూడా అభ్యుదయమే. ఈ నేపథ్యంలో బుద్ధుడిని రంగస్థలం మీదకు తీసుకురావడం ఒక ఆసక్తికరమైన సాంస్కృతిక చర్య. ఇక్కడ బుద్ధుడికి పూలు వేయడం లేదు. ఆయనతో వాదిస్తున్నారు. ఆయన ముందు చేతులు జోడించడం లేదు. ఆయన వేసిన ప్రశ్నల ముందు మనల్ని నిలబెడుతున్నారు. బుద్ధుడిని పూజించడం కన్నా ఆయనను ప్రశ్నగా స్వీకరించడం ఈ మూడు నాటికల అసలు ఆధునికత.

మూడూ అవసరమే
నాటకాన్ని విశ్లేషించేపుడు కేవలం దాని సారం, భావజాలం మాత్రమే చర్చిస్తే సరిపోదు. రంగస్థలం మీద అది ఏ రూపం తీసుకుంది అనేది ప్రధానం. ఈ మూడు నాటికలకు అదనపు సమస్య ఒకటుంది. ఇవి ప్రీరికార్డెడ్ నాటకాలు. అంటే నేపథ్యంలో సంభాషణలు ప్లే అవుతుంటే నటులు లిప్ సింక్ చేయాల్సి ఉంటుంది. ఎవరి డైలాగ్ వాళ్లు చెప్పడంకంటే ఇది మరీ కష్టమైన వాచకం. దాన్ని మూడు నాటకాల్లోనూ నటులు గొప్పగా సాధించారు. ప్రాప్స్ వినియోగంలో వంక లేదు. కోరియోగ్రఫీ బాగుంది. మూడు నాటికల్లో ఒక్కో నటుడు దాదాపుగా నాలుగేసి ఐదేసి పాత్రలు నిర్వహించడం వాళ్ల ప్రతిభకు నిదర్శనం. అయితే అంబేద్కర్ పేరును ఆయన తన గురువు నుంచి తీసుకున్నారన్న ప్రస్తావనలో నిజం లేదన్న ఆరోపణకు దేవేంద్ర సమాధానం చెప్పాల్సుంటుంది. ఫూలే నాటకంలో ఫాతిమా ప్రస్తావన చేసి ఉండాల్సిందన్న విమర్శకూ దేవేంద్ర సమాధానం చెప్పాలి. ఇక ఒకానొక సందర్బంలో సుత్తీ కొడవలి ప్రదర్శన బావోలేదన్న విమర్శకు దేవేంద్ర ఇచ్చుకున్న వివరణ సమంజసమే అనిపించినా అది మెప్పించలేదు. బుద్దుడితో నా ప్రయాణం నాటికలో కేవలం బుద్దుడి జీవిత చరిత్ర ప్రదర్శన మాత్రమే ఉంది. నిజానికి ఈ సందర్బంలో జీవిత కథ అవసరం లేదు. అంబేద్కర్ బౌద్దాన్ని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది అనే అంశాన్ని ప్రధానంగా చర్చించి ఉంటే బాగుండేది. కేవలం రెండు మూడు సన్నివేశాలలో అంబేద్కర్ ప్రవేశించి ఏవో మామూలు ప్రశ్నలు వేసి వెళ్లిపోవడం ఈ నాటికలో ప్రధాన లోపం. అయినా తెర పడిన తర్వాత మొదలయ్యే నాటకాలు ఇవి. మూడు నాటికలు మూడు దారుల్లో మొదలవుతాయి. కానీ చివరకు ఒకే కూడలికి చేరతాయి. మనిషి మరింత మనిషిగా ఎలా మారగలడు? అందుకు సంఘం అవసరమా? సత్యాన్వేషణ అవసరమా? బుద్ధుడు అవసరమా? బహుశా మూడూ అవసరమే.

మనలోని మనిషి వైపు
మంచి నాటకం తెరపడగానే ముగిసిపోదు. అసలు నాటకం అప్పుడే మొదలవుతుంది. హాలు నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడితో పాటు ఒక పాత్ర నడిస్తే, ఒక సంభాషణ వెంటాడితే, ఒక ప్రశ్న ఇంటిదాకా వస్తే ఆ ప్రదర్శన తన పని చేసినట్టే. ఈ మూడు నాటికలూ ప్రేక్షకుడి వెంట పంపించే ప్రశ్న బహుశా ఒక్కటే రెండున్నర వేల ఏండ్ల కిందట బుద్ధుడు మనిషి దుఃఖానికి కారణం వెతుకుతూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా మనం బుద్ధుడి విగ్రహం వరకే చేరామా? లేక ఆయన అడిగిన ప్రశ్న వరకూ చేరామా? అనేవే కీలకమైన ప్రశ్నలు. అంతకంటే ముఖ్యంగా మనలోని మనిషి వైపు మన ప్రయాణం ఇంకా ఎంత దూరం ఉంది? నాటకం చూడడమే ఒక అనుభవం. ఈ మూడు నాటికలు చూడడం గొప్ప అనుభూతి.
ఈ నాటకాల వెనుక దేవేంద్ర శ్రమనూ, ప్రతిభనూ ఉదహరించడానికి ఎంత పెద్ద అతిశయోక్తయినా అతి చిన్నదే. నిజానికి ఇది కేవలం ప్రతిభకు సంబంధించిన విషయమూ కాదు. ఆలోచన, భావజాలం, ఆచరణ కూడా అతనిలో పుష్కలం అని ఈ నాటకాలు చెపుతున్నాయి. దేవేంద్ర అద్భుత సృష్టి ఈ నాటకాలు.

ప్రసేన్
7013358154

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -