ఆ రోజు మేమిద్దరం ఓ పెళ్లికి వెళ్లాం. ఆమె కాలేజ్ ఫ్రెండ్ పెళ్లి.
“రెండు గంటలు మాత్రమే రామ్.. వెళ్లివద్దాం..” అని బలవంతంగా తీసుకెళ్లింది. నిజానికి అలాంటి వేడుకల్లో నేను సహజంగా ఉండలేను. తెలియని జనాలు, బలవంతపు పలకరింపులు, ఫోటోలకు నవ్వులు.. నాకు ఎప్పుడూ కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాయి. కానీ ఆమెతో ఉంటే.. అలాంటి అసౌకర్యాలు కూడా కొంచెం అందంగా మారిపోతాయి. ఫంక్షన్ హాల్ దగ్గరకు చేరేసరికి బయటే ఆమె కాలేజ్ ఫ్రెండ్స్ గుంపుగా కనిపించారు. కారు దిగగానే..
“అరే! వచ్చావా?”
“నువ్వు వస్తావో రావో అనుకున్నాం!” అంటూ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరిపోయారు. ఒకమ్మాయి కౌగిలించుకుంది. మరొక అమ్మాయి ఆమె చీరను చూసి..
“వావ్.. అదిరిపోయావే!” అంది.
“నువ్వు పెళ్లికూతుర్ని మించిపోకూడదు” అని ఇంకొకామె నవ్వింది. “అబ్బా.. మీరింకా మారలేదే” అంటూ ఆమె కూడా వాళ్లలో కలిసిపోయింది. అంతలో వాళ్లలో ఒకరు నా వైపు చూసి..
“ఎవరు?” అంది.
ఆమె నా వైపు తిరిగి..
“రామ్” అని చెప్పింది.
“ఓహ్.. మేము రోజూ వినేది మీ గురించేనా” అంది ఓ అమ్మాయి.
“మంచే విన్నారా?” అని అడిగాను.
“అది మాత్రం ఇప్పుడే చెప్పం” అంది. అంతలో లోపల నుంచి మరో అమ్మాయి “నిన్ను పెళ్లికూతురు పిలుస్తోందే… రా త్వరగా” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది.
“వస్తున్నా” అని చెప్పి, రెండు అడుగులు వేసి మళ్లీ నా దగ్గరకు వచ్చింది ఆమె.
“నువ్వు లోపలికొచ్చి కూర్చో, నేను వీళ్లతో వెళ్లి వస్తా” అంది.
“సరే.”
ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిపోయింది. నేను లోపలికి వచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఫంక్షన్ హాల్ మొత్తం వెలుగులతో మెరిసిపోతోంది. పూల వాసన. పిల్లల పరుగులు. స్టేజ్ మీద కెమెరా ఫ్లాష్‌లు. ఆమె ఆ రోజు ముదురు ఆకుపచ్చ చీర కట్టుకుంది. జుట్టంతా వదిలేసుకుంది. చిన్న ఎర్రని బొట్టు పెట్టుకుంది. ఆమెను చూస్తుంటే.. పెళ్లికి వచ్చిన అమ్మాయిల్లో ఒకరిలా కాదు.. ఈ వేడుక మొత్తానికీ ఓ ప్రత్యేకతలా కనిపిస్తోంది.
వేదిక మీద ఫోటోలు, పలకరింపులు పూర్తయ్యాక.. చేతిలో రెండు జ్యూస్ గ్లాసులతో జనాల మధ్య నుంచి దారి చేసుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఒక గ్లాస్ నా ముందు పెట్టి, ఇంకోటి చేతిలోనే ఉంచుకుని నా పక్కన కూర్చుంది.
“ఇంతసేపు ఒంటరిగా ఏం చేశావ్?” అని అడిగింది.
“నిన్నే చూస్తున్నా”
“అంతగా ఏం చూస్తున్నావ్?” అని నవ్వింది. నేనూ నవ్వాను. ఇద్దరం చుట్టూ ఉన్న జనాల్ని చూస్తూ కూర్చున్నాం. ఆమె అప్పుడప్పుడు నా వైపు వాలి..
“ఆ ఆంటీ మనిద్దరినే గమనిస్తోంది..”
“ఆ పిల్లాడు నీ గడ్డం చూసి భయపడుతున్నాడు..” అంటూ నవ్విస్తోంది. నేనూ చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుతున్నాను. అప్పుడే..
“రామ్?!” అని వెనుకనుంచి దూరంగా ఒక మహిళ గొంతు వినిపించింది. తిరిగి చూసాను.
ఆమె.. అనన్య. సీనియర్ జర్నలిస్ట్. ఒకప్పుడు మేమిద్దరం కలిసి ఎన్నో అసైన్మెంట్లు చేశాం. ఇన్నేండ్ల తర్వాత, ఇలాంటి పెళ్లి వేడుకలో ఆమెను మళ్లీ చూస్తానని అసలు ఊహించలేదు. నేను ఏదో మాట్లాడబోతుండగానే ఆమె నా దగ్గరకు వచ్చేసింది.
“ఓహ్ రామ్..” అంటూ నా పక్కనే కూర్చుంది.
“ఇన్ని ఏళ్ల తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావ్!” అని నవ్వింది. ఆ నవ్వులో పాత చనువు ఇంకా అలాగే ఉంది. ఆమె నా చేతిని తన చేతిలోకి తీసుకుంది.
“రామ్.. మన ఎడిషన్ నైట్లు గుర్తున్నాయా?” అంటూ నవ్వింది.
“ఎలా మర్చిపోతాను.. నువ్వు చేసే హడావుడి ఎవరు మర్చిపోతారు?” అన్నాను.
ఆమె నవ్వుతూ.. “అప్పట్లో రాత్రి రెండు గంటలైనా నీకు నిద్ర వచ్చేది కాదు..” అంటూ నా పక్కన కూర్చున్న ఆమె వైపు చూసి..
“హాయ్..” అంది అనన్య.
“హాయ్..” అంటూ ఆమె కూడా నవ్వింది.
“మీరు..?” అనన్య అడిగింది.
“నేను..” అంటూ ఆమె కాసేపు ఆగి నా వైపు చూసింది.
“రామ్ ఫ్రెండ్‌ని” అంది.
“ఓహ్.. చాలా రోజుల పరిచయంలా ఉందే మీది” అంది సరదాగా. ఆమె ఏమీ అనలేదు. చిన్నగా నవ్వింది. అనన్య మాత్రం మళ్లీ నా వైపు తిరిగి..
“నిన్ను చూసిన వెంటనే గుర్తుపట్టాను తెలుసా?” అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది.
“మన వరంగల్ ట్రిప్ గుర్తుందా? రాత్రంతా వర్షంలో ఇరుక్కుపోయాం..” అంది నవ్వుతూ.
నేనూ ఆ జ్ఞాపకంలోకి వెళ్లిపోయి నవ్వాను. అప్పుడే.. ఆమె ముఖం నేను స్పష్టంగా చూశాను. ఆ కళ్లలో మొదటిసారి ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపించింది. అది కోపం కాదు. నేను అప్పటికి దాని అర్థం పూర్తిగా గ్రహించలేదు… కొద్దిసేపటికి అనన్య వెళ్లిపోయింది. ఆ తర్వాత మేమిద్దరం హాల్ బయటికి వచ్చాం. రాత్రి గాలి చల్లగా ఉంది. దూరంగా బ్యాండ్ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆమె మాత్రం నిశ్శబ్దంగా ముందుకి నడుస్తోంది.
“ఏమైంది?” అని అడిగాను.
“ఏమీ లేదు..” అంది. కానీ ఆ కళ్లలో తడి మెరుస్తోంది.
నేను ఏమీ మాట్లాడలేదు.
“నువ్వు ఆమెతో అంత క్లోజ్‌గా మాట్లాడుతుంటే.. నాకు నచ్చలేదు.”
“ఎందుకు?”
ఆమె కాసేపు నా కళ్లలోకి చూస్తూ నిలబడింది.
“నీ జీవితంలోకి నేను ఆలస్యంగా వచ్చానేమో అనిపించింది..” అంది. ఆ మాట.. నన్ను లోపల ఎక్కడో బలంగా తాకింది. నేను మెల్లగా ఆమె భుజం చుట్టూ చేయి వేస్తూ దగ్గరికి తీసుకున్నాను.
“నువ్వు ఆలస్యంగా రాలేదు. రావాల్సిన సమయానికే వచ్చావు. నా గతంలో ఎవరున్నా.. వాళ్లలో ఎవరిదీ నువ్వున్న చోటు కాదు.” అన్నాను.
ఆమె ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె పెదవులు స్వల్పంగా వణికాయి. కొద్దిసేపటి తర్వాత..
“నువ్వు ఒకప్పుడు ఇంకెవరితోనైనా ఇలా నవ్వి ఉండొచ్చన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నా రామ్..”
ఆ మాట వినగానే.. నా చేతులు తెలియకుండానే ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాయి. ఆమె మెల్లగా ‘‘నువ్వు నాకు ఎంత ముఖ్యమో ఈరోజే తెలిసింది” అంటూ పూర్తిగా అల్లుకుంది. హాల్ లోంచి పెళ్లి పాట గట్టిగా వినిపిస్తోంది. ఆ రాత్రి ఆమెకు నా గతం కనిపించింది.. నాకు మాత్రం ఆమె కళ్లలో నా భవిష్యత్తు కనిపించింది.
రామ్
ఒక చిన్న అసూయ
- Advertisement -
- Advertisement -



