Sunday, September 13, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్చదువు - సంస్కారం

చదువు – సంస్కారం

- Advertisement -

అనగనగా రంగాపురం అనే గ్రామంలో రంగమ్మ,భీమయ్య అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. వారికి సీత, గీత అనే ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరూ బడికి వెళ్ళేవాళ్ళు. పిల్లలను బాగా చదివించి మంచి స్థానంలో చూడాలని తల్లిదండ్రుల కోరిక. పొలం పనులు కూడా చెప్పకుండా బడికి పంపేవారు. ఇద్దరు పిల్లలూ తల్లిదండ్రులు చెప్పినట్టు వినేవారు. క్రమశిక్షణతో నడుచుకునేవారు.

సీత కంటే గీత బాగా చదివేది. తల్లిదండ్రులకు కూడా బాగా చదివే గీత అంటేనే ఇష్టం ఉండేది. సీత సరిగ్గా చదవదు కాబట్టి ఏ పని చేసినా కోప్పడేవారు. సీత కూడా గీత లాగా చదవాలని అనుకునేది కానీ సాధ్యం అయ్యేది కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఇద్దరూ కస్టపడి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. గీతకు మంచి ఉద్యోగం వస్తుంది. సీతకు మాత్రం ఏ ఉద్యోగం రాక ఇంట్లోనే ఉండేది. అప్పుడప్పుడు పొలం పనులకు కూడా వెళ్ళేది. గీతను ఇంకా గారాబంగా చూసేవారు. అది చూసి చిన్నబోయేది సీత. నా తలరాత ఇంతేనేమో అనుకొని బాధ పడేది.
మంచి సంబంధం చూసి గీతకు పెళ్ళి చేస్తారు. అల్లుడు కూతురు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో ఏ లోటు లేకుండా హాయిగా ఉంటారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళినా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఎప్పుడూ వాళ్లతో ఎక్కువరోజులు ఉండకుండా వెంటనే తిరిగి వచ్చేవారు. కనీసం ఒక్కరోజు ఉండమని కూడా అల్లుడు కూతురు చెప్పేవాళ్ళు కాదు. తండ్రి ఇదేమి పట్టించుకోడు కానీ తల్లి మాత్రం కాస్త అనుమానపడ్తుంది. అదేంటి తల్లిదండ్రులు వస్తే కనీసం మర్యాద కోసమైనా ఉండమని అడగరు అనుకునేది.
సీత ఇంటి దగ్గరే ఉంటూ పొలం పనులు చూసుకునేది. కూలీలను పనిలో పెట్టుకుంటూ, వాళ్ళకు డబ్బులిస్తూ అన్నీ చూసుకునేది. సీతకు కూడా పెళ్ళి చెయ్యాలి కదా అని ఉద్యోగం లేకపోయినా పక్క ఊర్లోనే వ్యాపారం చేసే అబ్బాయితో పెళ్ళి చేస్తారు. ఉన్నంతలో బాగానే సర్దుబాటు చేసుకొని బతుకుతారు సీత దంపతులు.
వయసు పెరిగిన భీమయ్య అనారోగ్యం పాలవుతాడు. ఊర్లో ఉన్న డాక్టర్ తో చూపించుకున్నా కుదుట పడదు. పట్టణానికి వెళ్లి చూపించుకోండి అని సలహా ఇస్తాడు డాక్టర్. ఎలాగూ గీత అక్కడే ఉంటుంది కాబట్టి రంగమ్మ, భీమయ్య గీత ఇంటికే వెళ్తారు. అక్కడే రెండ్రోజులు ఉండి మిగతా వైద్య పరీక్షలు ఏవో చేయించుకోవాలని ఆగిపోతారు. ఉన్న రెండ్రోజుల్లో అయినదానికి కానిదానికి గీత విసుక్కునేది. ఏదైనా ఖర్చు పెట్టాలంటే డబ్బులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకునేవారు. ఎంతో ప్రేమతో పెంచుకున్న గీతను చూస్తే బాధ కల్గుతుంది, స్వార్థంతో కన్న తల్లిదండ్రులను కూడా పరాయివాళ్ళలాగా చూడటం నచ్చదు. ఆసుపత్రికి ఖర్చులు ఎక్కువ అవుతాయని తెలిసి గీతను డబ్బులు సహాయం చేయమని అడగటానికి కూడా మనసొప్పక, అక్కడ ఉండలేక ఇంటికి తిరిగి వస్తారు.
ఈ విషయాలన్నీ తెలుసుకున్న సీత నేనున్నాను కదా అని తాను దాచుకున్న డబ్బులు తల్లిదండ్రులకు ఇచ్చి, ఆసుపత్రికి కూడా తోడుగా వెళ్లి చూపిస్తుంది. చిన్నప్పటి నుండి ప్రేమను పంచని సీత తమని ఇంత ప్రేమగా చూసుకోవడం చూసి సిగ్గుపడతారు, బాధ పడతారు సీత తల్లిదండ్రులు. ఎంత చదువుకుని ఏం లాభం తల్లిదండ్రులను ఆపదలో ఆదుకోకుంటే అనుకుంటారు. చదువు కన్నా సంస్కారం గొప్పదని నిరూపించిన సీతను చూసి సంతోషిస్తారు రంగమ్మ, భీమయ్యలు.

కె. గణేశ్
10 వ తరగతి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
దేవరకద్ర, మహబూబ్ నగర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -