– సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు
– నాయకులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన విమర్శించారు. దీనికి నిరసనగా కార్మికులు సమ్మెబాట పట్టారని,ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరుతో సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలీసుల సహాయంతో బస్సులను రోడ్లపైకి తీసుకురావడం ద్వారా కార్మికుల పోరాటాన్ని బలహీనపరచాలని చూస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లు వెల్లడించారు. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని, రద్దయిన కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని, రెండవ వేతన సవరణ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, విశ్రాంత ఉద్యోగులకు రావలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు, నందు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.



