ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వినతికి హైడ్రా కమిషనర్ హామీ
నాచారం ప్రజలకు దోమల సమస్య నుంచి ఉపశమనం దిశగా చర్యలు
నవతెలంగాణ – నాచారం
హైదరాబాద్ నాచారం డివిజన్లో నెలకొన్న దోమల సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం చర్యలు వేగవంతం చేస్తోంది. చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడిక, వ్యర్థ రసాయన జలాల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే రూ.30 కోట్ల నిధులతో హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు అనుమతులు లభించగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
అదే విధంగా పటేల్ కుంట చెరువు కూడా పూర్తిగా పూడికతో నిండిపోయి దయనీయ స్థితికి చేరుకున్న నేపథ్యంలో దీని సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చిన్న చెరువు కావడంతో తక్కువ వ్యయంతోనే పనులు పూర్తి చేయవచ్చని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, త్వరలోనే పటేల్ కుంట చెరువు సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


