నవతెలంగాణ – బెంగళూరు : 2023లో బెంగళూరు జైలులో ఉగ్రవాద భావజాల వ్యాప్తి కేసులో ప్రధాన సూత్రధారి, లష్కరే తొయిబా సభ్యుడైన నసీర్ తో సహా ఏడుగురు నిందితులకు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. నసీర్ తో పాటు నిందితులు సయ్యద్ సుహైల్ ఖాన్, మహమ్మద్ ఉమర్, జాహిద్ తబ్రేజ్, సయ్యద్ ముదస్సిర్ పాషా, మహమ్మద్ ఫైసల్ రబ్బానీ, సల్మాన్ ఖాన్ లకు కోర్టు శిక్ష విధించడంతో పాటు రూ.48,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
బెంగళూరులోని పరపన్న అగ్రహార సెంట్రల్ జైలులో నసీర్ పన్నిన ఉగ్రవాద కుట్ర కేసులో ఎన్ఐఎ నమోదు చేసిన అభియోగాలను నిందితుడు ఆమోదించినట్లు తెలిపారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు, జైళ్లలో ఉన్న యువతను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, మతమార్పిడి చేయడం, ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం వంటి కుట్రకు పాల్పడ్డారని ఎన్ఐఎ పేర్కొంది. నేరస్థుల నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో .. 2023 జులైలో బెంగళూరు సిబిఐ బ్రాంచ్ మొదట ఈ కేసును నమోదు చేసింది. నగరంలో పలు ఉగ్రదాడులకు ప్రణాళిక రచించారని సిబిఐ పేర్కొంది.
అనంతరం ఈ కేసును ఎన్ఐఎకి బదిలీ చేసింది. పలు ఉగ్రవాద కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నసీర్ .. జైలు నుండి తప్పించేందుకు కుట్ర పన్నారని ఎన్ఐఎ వెల్లడించింది. ఆసమయంలో నసీర్ 2008 బెంగళూరు వరుస పేలుళ్ల కేసులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన 11మంది నిందితులు, పరారీలో ఉన్న జనైద్ అహ్మద్ పై ఎన్ఐఎ చార్జ్ షీట్ దాఖలు చేసింది.



