– ఎరువుల పంపిణీ, రైతు భరోసా కోసం కీలకం
– ఏడీఏ పెంటేల రవి కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలు, ఎరువుల పంపిణీ ప్రక్రియలో మొబైల్ నంబర్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, పట్టాదారు పాస్ పుస్తకాలకు అనుసంధానమైన మొబైల్ నంబర్లు సరిచూడాలని వ్యవసాయ శాఖ సూచించింది. రాబోయే వానాకాలం – 2026 సీజన్‌కు ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటికే రైతు భరోసా పథకం అమలు సమయంలో రైతుల మొబైల్ నంబర్లు నమోదు చేయబడ్డాయి. యాసంగి సీజన్లో యూరియా పంపిణీ కూడా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతోంది. ఈ యాప్‌లో ఎరువులు పొందేందుకు రైతు పాస్ పుస్తకానికి లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి.
తప్పు నంబర్ ఉంటే ఎరువులు అందవు. పట్టాదారు పాస్ పుస్తకంలో మొబైల్ నంబర్ తప్పుగా నమోదు ఉంటే రైతులు ఎరువులు బుక్ చేసుకోవడం సాధ్యం కాదని అధికారులు హెచ్చరించారు. అందుకే ముందస్తుగా నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏఈఓల ద్వారా అప్డేషన్ ఏఈఓలు “ఏఈఓ లాగర్” యాప్ ద్వారా రైతుల వివరాలను అప్డేట్ చేస్తారు. “ఫార్మర్ మొబైల్ నంబర్ అప్డేషన్” మాడ్యూల్లో రైతు పేరు, ఫార్మర్ ఐడి, మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు కనిపిస్తాయి
నంబర్ సరైనదైతే కన్ఫర్మ్ చేస్తారు. తప్పు అయితే రైతును సంప్రదించి కొత్త నంబర్ నమోదు చేస్తారు. కొత్త నంబర్ నమోదు సమయంలో ఓటీపీ ద్వారా ధృవీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియను ఈ నెల 20 లోపు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. రైతు రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇందులో ధాన్యం కొనుగోలు పత్తి కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు,,ఎరువుల సరఫరా,,పీఎం కిసాన్ పథకం, అన్నింటికీ రిజిస్ట్రేషన్ అవసరం.
రైతులకు సూచనలు
మొబైల్ నంబర్ మారిన రైతులు వెంటనే అప్డేట్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ లేని వారు నమోదు చేసుకోవాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ విజ్ఞప్తి చేశారు.సమీప ఏఈఓ లను సంప్రదించి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించారు.



