నవతెలంగాణ -హైదరాబాద్
కాప్రా సర్కిల్ వంపుగూడ డివిజన్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రజా ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి ప్రారంభమైన ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పరిశుభ్రత, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
సాయినాథపురం మురికిగుంటలలో దోమల నివారణ కార్యక్రమాన్ని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంటమాలజీ విభాగం సిబ్బంది నిల్వ నీటిలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టే చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రవి, ఏఈ ఎంటమాలజీ రమేష్, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, వంపుగూడ డివిజన్ పరిధిలో స్తంభాలకు వేలాడుతున్న కేబుల్ వైర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ వైర్లు పాదచారులకు ప్రమాదకరంగా మారడంతో పాటు ప్రమాదాల అవకాశాన్ని పెంచుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి కేబుల్ ఆపరేటర్లకు హెచ్చరిక జారీ చేశారు. నిర్లక్ష్యంగా వైర్లు వదిలేస్తే భారీ జరిమానాలు విధించడమే కాకుండా పోలీస్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్ కృష్ణ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యం, భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ చర్యలకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



