కొంతమంది వ్యక్తుల జీవితాలను వారు నిర్వహించిన పదవులు, బాధ్యతలతో మాత్రమే కొలవలేం. వారు తమ తర్వాత ఎంతమంది కార్యకర్తలను తయారు చేశారు, ఎంతమందిలో ఆలోచనను రగిలించారు, ఎంతమందిని ప్రజా ఉద్యమాల వైపు నడిపించారు అన్నదే వారి జీవితానికి అసలు కొలమానం. ఆ అర్థంలో కామ్రేడ్ టి.ఎన్.వి. రమణ జీవితం ఒక కార్యకర్త జీవితం మాత్రమే కాదు, కార్యకర్తలను తీర్చిదిద్దిన ఒక నిరంతర నిర్మాణ ప్రక్రియ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎప్‌పిఎం కంపెనీలో కార్మికుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రమణ, సమాజ మార్పు పట్ల ఉన్న నిబద్ధతతో కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి డ్యూటీ చేసి ఆ తర్వాత యువతతో సంబంధాలు పెంచుకునేవారు. వారితో సామాజిక, రాజకీయ అంశాలపై చర్చిస్తూ కొత్త కార్యకర్తల కోసం నిరంతరం అన్వేషించేవారు. యువజన, విద్యార్థి ఉద్యమాల్లో ఆయన చూపిన చొరవ అనేకమంది యువతను ఉద్యమాల వైపు తీసుకువచ్చింది.
ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేసిన దశ నుంచి డీవైఎఫ్‌ఐలో చురుకైన కార్యకర్తగా ఎదిగి, అక్కడి నుంచి సీపీఐ(ఎం) కార్యకర్తగా, పూర్తికాల కార్యకర్తగా తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశారు. బాధ్యతలు పెరిగేకొద్దీ ఆయన పని పరిధి కూడా విస్తరించింది. కార్యకర్తలకు పని అప్పగించడం మాత్రమే కాకుండా, ఆ పని ఎలా చేయాలో నేర్పించడం, సమస్యలను స్వయంగా ఎదుర్కొనే ధైర్యం కల్పించడం ఆయన ప్రత్యేకత. గ్రామంలో యువజన క్రీడా పోటీలు నిర్వహించడం నుంచి, మరో ప్రాంతంలో యువతను సంఘటితం చేయడం వరకు ఆయన ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తల నిర్మాణానికి ఒక అవకాశంగా మలిచేవారు. పుస్తకాలు చదవడం, సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతలో ఆలోచనా శక్తిని పెంచడం ఉద్యమ నిర్మాణంలో కీలకమని ఆయన నమ్మేవారు. అందుకే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు వారి అధ్యయనానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. రమణలోని మరో విశిష్టత ఆయన కార్యకర్తల పట్ల చూపిన శ్రద్ధ. ఎవరిలో ఏ సామర్థ్యం ఉందో గుర్తించి, అందుకు తగిన బాధ్యతలు అప్పగించేవారు.
ఒక పని పూర్తి చేయడం కంటే, ఆ పని ద్వారా ఒక కార్యకర్త ఎదగడం ఆయనకు ముఖ్యమైనది. తన తర్వాత కూడా మరొక కార్యకర్తను తయారు చేయగలిగే స్థాయికి కార్యకర్తలను తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. ఉద్యమ కార్యకలాపాలతో పాటు ‘నవతెలంగాణ’లో అసిస్టెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేస్తూ తన రచనా, సంపాదకీయ ప్రతిభను కూడా ప్రజా ఉద్యమానికి వినియోగించారు. రమణ జీవితం ఒక నిత్య అన్వేషణ. కొత్త మనుషుల కోసం అన్వేషణ, కొత్త కార్యకర్తల కోసం అన్వేషణ, కొత్త ఆలోచనల కోసం అన్వేషణ, సమాజ మార్పు కోసం అన్వేషణ. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన తయారు చేసిన కార్యకర్తల్లో ఆయన ఆలోచనలు కొనసాగుతున్నాయి. అందుకే రమణను స్మరించుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు. ఆయన చూపిన కార్యకర్తల నిర్మాణ మార్గాన్ని కొనసాగించడం. ఆయన నమ్మిన ఆశయాల పట్ల అదే నిబద్ధతతో నిలబడటం.
(నేడు కామ్రేడ్ టి.ఎన్.వి.రమణ
4వ వర్థంతి)
ముంజం శ్రీనివాస్
8074922758
నిత్యాన్వేషి కామ్రేడ్ రమణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



