నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ 57వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఏ ఐ కె ఎమ్ ఎస్ రాష్ట్ర నాయకుడు పెరుగు నాగన్న పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇరుగు అనిల్ తెలిపారు. బుధవారం ఇరుగు అనిల్ అధ్యక్షతన జండ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విప్లవ భావజాలంతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది అని తెలిపారు.
విప్లవోద్యమ చరిత్రను గుర్తు చేశారు. 1870లో లెనిన్ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన విప్లవ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా శ్రమజీవుల హక్కుల కోసం మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. భారతదేశంలో సిపిఐ (ఎం-ఎల్) స్థాపనతో రైతులు, కార్మికులు, గిరిజనులకు కొత్త దిశ దొరికిందని తెలిపారు. తెలంగాణా సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం వంటి చారిత్రక సంఘటనలు ప్రజల్లో విప్లవ చైతన్యాన్ని పెంచాయని, భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటాలు సామాన్య ప్రజల జీవితాల్లో మార్పుకు దోహదపడ్డాయని వివరించారు. ముఖ్యంగా గోదావరి లోయలో జరిగిన పోరాటాల ఫలితంగా గిరిజనులకు భూమిపై హక్కులు లభించాయని గుర్తు చేశారు. అటవీ హక్కుల చట్టం, పేసా చట్టం వంటి కీలక నిర్ణయాలు కూడా ప్రజా ఉద్యమాల ఒత్తిడితోనే సాధ్యమయ్యాయని అన్నారు.
ఇటీవలి కాలంలో విప్లవోద్యమం కొంత వెనుకంజ వేసినా, ప్రజా సమస్యలు మాత్రం పెరుగుతున్నాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రివిజనిజం, మితవాద ధోరణులు విప్లవ పంథాను బలహీనపరుస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటరీ రాజకీయాలపై ఆధారపడటం వల్ల సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, ఆదివాసీ ప్రాంతాల్లో సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల స్థానిక ప్రజలు నష్టపోతున్నారని అన్నారు.
ప్రజా ఉద్యమాలను అణచివేయడం, కార్యకర్తలను నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు., ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమానత్వ సమాజ నిర్మాణం కోసం విప్లవ మార్గమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. అనంతరం చివర్లో అమర వీరులకు నివాళులు అర్పించి, విప్లవ నినాదాలతో సభను ముగించారు. ఈ కార్యక్రమంలో విజయ, నాగమ్మ, ఉప్పలమ్మ, సోమక్క, యాకలక్ష్మి, రమ తదితరులు పాల్గొన్నారు.



