– రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు
నవతెలంగాణ – తుంగతుర్తి
రేపటి నుండి 25 వరకు కొత్తగూడెంలో నిర్వహించే ఏఐకేస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతం చేయాలని, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు రైతాంగానికి, సంఘ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంఘం ఏర్పాటు అయి 90 ఏళ్ళు అయిన సందర్భంగా బుధవారం మండలంలోని అన్నారంలో సంఘ పతాకాన్ని ఆవిష్కరించి, మహా సభల ప్రచార కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ,వ్యవసాయ రంగాన్ని రక్షించటానికి కృషి చేస్తున్న అఖిల భారత కిసాన్ సభకు అనుబంధంగా తెలంగాణ రైతు సంఘం పని చేస్తుందని అన్నారు.
సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఏప్రిల్ 23, 24,25 తేదీలలో కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్నందున, మహాసభల జయప్రదానికి, ఆర్థిక సహకారాన్ని అందించి విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసారు. భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, జమీందారీ, జాగీర్దారులకు వ్యతిరేకంగా రైతాంగానికి అండగా నిలబడి రైతాంగ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న అఖిలభారత కిసాన్ సభ, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా పోరాడుతున్నది అన్నారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలని ఎండగట్టి వ్యవసాయాన్ని రక్షించటం కోసం, ఢిల్లీ కేంద్రంగా 13 నెలలపాటు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి పోరాడి విజయం సాధించినది అఖిల భారత కిసాన్ సభ. ప్రభుత్వం తాత్కాలింగా వెనుక్కు తగ్గినా రైతాంగానికి ప్రమాదం పొంచే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతాంగం ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ప్రకారం మద్దతు ధర, పంటలకు భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా కార్పొరేట్ కు అనుకూలమైన పసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని అన్నారు. దేశంలో పండే పత్తికి గిట్టుబాటు ధర లేకుండా చేసి, విదేశీ పత్తిపై ఉన్న సుంకాలను ఎత్తివేసి భారత పత్తి మార్కెట్‌ను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి రైతాంగాన్ని నష్టపర్చింది.
మరోవైపు వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి వికసిత్ భారత్ జిరామ్‌జి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి 26 కోట్ల మంది గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బ తీసింది అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజన చేసి కార్మిక హక్కులను కాల రాసింది. ఈ నేపధ్యంలో రైతాంగ సమస్యలతో పాటు గ్రామీణ పేదలు,కార్మిక హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు నిర్మిస్తున్నది రైతు సంఘం. అలాగే కార్పొరేట్ అనుకూలమైన నూతన విత్తన బిల్లును తీసుకువచ్చి దేశంలో అమలులో ఉన్న విత్తన చట్టాన్ని రద్దు చేసింది, దీని వలన రైతాంగం తీవ్రంగా నష్ట పోతుంది. నూతన విద్యుత్ సవరణ చట్టం పేరుతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలకు ఉన్న సబ్సిడీలను ఎత్తివేసి సుమారు లక్ష కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 1962 అణుశక్తి చట్టాన్ని, 2010 అణునష్టానికి, పౌర బాధ్యత చట్టాన్ని రద్దుచేసి కార్పొరేట్ కంపెనీలకు అనుమతించే నూతన చట్టాన్ని తీసుకురావడం వల్ల ప్రజల ఆరోగ్యాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. మన రాష్ట్రంలో రైతాంగ ప్రధాన సమస్యలైన గిట్టుబాటు ధర, బీమా సౌకర్యం, బోనస్, రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలపై నిరంతరం రైతు సంఘం పోరాడుతుంది అన్నారు. తెలంగాణ రైతు సంఘం, భవిష్యత్ కార్మిక, కర్షక, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఈ మహాసభల జయప్రదానికి ప్రముఖులు, మేధావులు, రైతు శ్రేయోభిలాషులు, ఆర్థికంగా భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.



