మరో రేసుకు చైనా మర మనిషి సిద్ధం
మనుషులతో కలిసి పని చేసేలా మార్చడంపై రూపకర్తల దృష్టి
‘వేగం’ నుంచి ‘విశ్వసనీయత’ వైపు అడుగులు
ఇప్పటికే పరుగులో ఉసేన్ బోల్ట్‌ను మించిన స్పీడ్
100 మీటర్లను 8.64 సెకన్లలో పూర్తి చేసిన టియాంగాంగ్ అల్ట్రా
చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగం కొత్త పుంతలు
చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగం కొత్త పుంతలు
శాస్త్ర సాంకేతిక రంగంలో చైనా ఎప్పుడూ ప్రత్యేకమే. కొత్త కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చడం దాని సొంతం. ఇప్పుడు చైనా సాంకేతిక శక్తి మరో నూతన ఆవిష్కరణకు సిద్ధమైంది. మనిషి వేగాన్ని అధిగమించిన హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు పరిశ్రమలు, సేవలు, విపత్తు సహాయ చర్యల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పరుగులో ప్రపంచ రికార్డులను అధిగమించేలా వేగవంతమైన రోబోలను రూపొందించడమే కాదు.. వాటిని మనిషికి తోడుగా, మనుషులతో కలిసి పని చేసే విశ్వసనీయ యంత్రాలుగా తీర్చిదిద్దడంలోనూ చైనా దూసుకెళ్తోంది.
బీజింగ్ : ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డును అధిగమించి సంచలనం సృష్టించిన చైనా హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు మరో పెద్ద సవాలుకు సిద్ధమవుతోంది. గంటల తరబడి పనిచేయగలిగే, క్లిష్ట పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉండే, పరిశ్రమలు, సేవలు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే నిజమైన పనివాడిగా రోబోను మార్చడంపైనే ఇప్పుడు దాని రూపకర్తల దృష్టి కేంద్రీకృతమైంది. బీజింగ్‌లో జరిగిన వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్‌లో చైనా రూపొందించిన టియాంగాంగ్ అల్ట్రా రోబో సంచలన ప్రదర్శన చేసిన విషయం విదితమే. 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.64 సెకన్లలో పూర్తి చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇది ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన మానవ ప్రపంచ రికార్డు కంటే దాదాపు ఒక సెకను వేగవంతమైన ప్రదర్శన. అయితే.. ఈ రికార్డు విజయంతోనే సంతృప్తి చెందడం లేదని టియాంగాంగ్ అల్ట్రాను అభివృద్ధి చేసిన బృందం చెప్తోంది. రోబో వేగాన్ని పెంచడం కంటే, దాన్ని మరింత విశ్వసనీయంగా, సురక్షితంగా, రోజువారీ పనులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే తమ తదుపరి లక్ష్యమని వెల్లడించింది.
వేగం నుంచి విశ్వసనీయత వైపు
టియాంగాంగ్ అల్ట్రా, ఓమ్ని అనే హ్యూమనాయిడ్ రోబోలను బీజింగ్ హ్యూమనాయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది. దీనిని ఎక్స్-హ్యూమనాయిడ్ అని కూడా పిలుస్తారు. అల్ట్రా, ఓమ్ని రోబోలను అభివృద్ధి చేసే బృందానికి ఇంజినీర్ జాక్ గువో (34) నాయకత్వం వహిస్తున్నారు. 100 మీటర్ల పరుగు సజావుగా సాగి రోబో 50 మీటర్ల దూరాన్ని దాటిన తర్వాతే తనకు ఊరట కలిగిందని గువో తెలిపారు. ఇప్పుడు తమ లక్ష్యం అధిక పనితీరును అధిక విశ్వసనీయత, ఎక్కువ ఉపయోగకరంగా మార్చడమని గువో వివరించారు.
బీజింగ్‌లో రోబోల కేంద్రం
ఎక్స్-హ్యూమనాయిడ్ సంస్థ బీజింగ్ ఆగ్నేయ ప్రాంతంలోని యిజువాంగ్ హైటెక్ అభివృద్ధి మండలిలో ఉంది. ఇది చైనాలోని ప్రధాన రోబోటిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతోంది. గతంలో ఆటోమొబైల్ పరిశ్రమలకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఇప్పుడు రోబో విక్రయ కేంద్రాలు, రోబో నేపథ్యంతో రెస్టారెంట్లు కూడా ఏర్పాటవుతున్నాయి. సంస్థ కార్యాలయంలో టియాంగాంగ్ రోబోల వివిధ తరాలకు చెందిన నమూనాలను ప్రదర్శిస్తున్నారు. గతేడాది హాఫ్ మారథాన్‌లో విజయం సాధించిన రోబో ధరించిన జెర్సీని కూడా అక్కడ ఉంచారు.
ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులతో అభివృద్ధి
2023 నవంబర్‌లో ఏర్పాటైన ఎక్స్-హ్యూమనాయిడ్ సంస్థకు ప్రభుత్వ రంగ, ప్రయివేటు పెట్టుబడిదారుల మద్దతు ఉంది. చైనా రోబోటిక్స్ సంస్థ యూబీటెక్‌తో పాటు షియోమీ, బైడు వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఈ సంస్థ రోబోల హార్డ్‌వేర్, కదలికలను నియంత్రించే సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధస్సు సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది.
ఫ్యాక్టరీల్లో తొలి అడుగులు
ఎక్స్-హ్యూమనాయిడ్ రోబోలను ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక రంగంలో రోబోల వినియోగాన్ని పరిశీలిస్తున్న కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. బీజింగ్‌లోని ఫోటాన్ కమ్మిన్స్ ఇంజిన్ ఫ్యాక్టరీలో సంస్థకు చెందిన రోబోలను పెట్టెల తరలింపులో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. టియాంగాంగ్ టియాన్యి 2.0 రోబో 8 నుంచి 12 కిలోల బరువున్న పెట్టెలను ఎత్తి అరల్లో ఉంచే పరీక్షలు నిర్వహించింది. అయితే..ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రయోగమేనని ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి.
పరిగెత్తడం నేర్చుకుంటే… ఇతర పనులకూ ఉపయోగం
రోబోను వేగంగా పరిగెత్తేలా చేయడం వల్ల దాని కదలికల సామర్థ్యం మొత్తం మెరుగుపడుతుందని గువో వివరించారు. అసమానమైన నేలలు, వివిధ రకాల పరిస్థితుల్లో శరీర సమతుల్యతను కాపాడుకోవడం వంటి సామర్థ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చిన్న పరిమాణంలోని ఓమ్ని రోబో ఇప్పటికే తన సామర్థ్యాన్ని చూపించింది. ఈ ఏడాది నిర్వహించిన అంతర్గత పరీక్షలో సంస్థ ప్రధాన కార్యాలయంలోని మొదటి అంతస్తు నుంచి 17వ అంతస్తు వరకు మెట్లపైకి ఎక్కింది. చిన్న హ్యూమనాయిడ్ రోబోలను తొలుత వాణిజ్య సేవలు, తేలికపాటి పరిశ్రమల్లో ఉపయోగించే అవకాశం ఉందని గువో భావిస్తున్నారు. పెద్ద పరిమాణంలో ఉన్న అల్ట్రా రోబోను భవిష్యత్తులో బహిరంగ ప్రాంతాల తనిఖీలు, అత్యవసర సహాయక చర్యల్లో వినియోగించవచ్చని చెప్పారు.
రికార్డు తర్వాత అసలు పరీక్ష
పరుగు పందెంలో విజయం తర్వాత టియాంగాంగ్ రోబోలకు ఎర్రటి వస్త్రాలు తొడిగించి సంబరాలు నిర్వహించారు. అయితే చైనాకు చెందిన ఈ రోబో విజయానికి అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభమైందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 100 మీటర్ల ట్రాక్‌పై వేగంగా పరిగెత్తడం ఒక ఘనత అయితే, అదే రోబో ఫ్యాక్టరీలో గంటల తరబడి పనిచేయడం, మెట్లు ఎక్కడం, వస్తువులు తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనడం మరింత క్లిష్టమైన సవాలుగా చెప్తున్నాయి. చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగానికి ఇది కొత్త అధ్యాయంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
రేసు గెలవడమే అసలు లక్ష్యం కాదు
టియాంగాంగ్ అల్ట్రాను మొదట రేసుల్లో గెలిచేందుకు రూపొందించలేదని గువో చెప్పారు. మనిషి ఆకారంలో ఉండే రోబోలు ఎంత వేగంగా, ఎంత సమర్థంగా కదలగలవో తెలుసుకోవడానికి నిర్వహించిన ప్రయోగంలో భాగంగానే దీని అభివృద్ధి ప్రారంభమైందన్నారు. ప్రస్తుత హ్యూమనాయిడ్ రోబోల పరిస్థితిని తొలి దశలోని కార్లతో గువో పోల్చారు. ముందుగా వాటిని సరిగా నియంత్రించగలిగేలా చేయాలనీ, ఆ తర్వాత నమ్మకమైన యాంత్రిక శరీరానికి మరింత తెలివైన కృత్రిమ మేధస్సును జోడించి క్లిష్టమైన పనులను స్వయంగా నిర్వహించేలా అభివృద్ధి చేయాలని వివరించారు.
ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులతో అభివృద్ధి
2023 నవంబర్‌లో ఏర్పాటైన ఎక్స్-హ్యూమనాయిడ్ సంస్థకు ప్రభుత్వ రంగ, ప్రయివేటు పెట్టుబడిదారుల మద్దతు ఉంది. చైనా రోబోటిక్స్ సంస్థ యూబీటెక్‌తో పాటు షియోమీ, బైడు వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఈ సంస్థ రోబోల హార్డ్‌వేర్, కదలికలను నియంత్రించే సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధస్సు సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది.



